తొందరపడి ఆ సీక్వెల్ తీయను
ఈ సందర్భంగా డైరెక్టర్ కబీర్ ఖాన్ ఈ సినిమా సీక్వెల్ పై రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.
By: Tupaki Desk | 17 July 2025 12:00 AM ISTఇండియన్ సినిమాలో సీక్వెల్స్ ట్రెండ్ బాగా ఎక్కువైంది. కథ, కంటెంట్, ప్రేక్షకాదరణతో సంబంధం లేకుండా ప్రతీ సినిమాకీ సీక్వెల్స్ అనౌన్స్ చేస్తూ వస్తున్నారు కొందరు. అయితే అలా చేసిన సీక్వెల్స్ లో కొన్ని సినిమాలు ముందు సినిమాను మించి హిట్ గా నిలిస్తే, మరికొన్ని సినిమాలు ముందు సినిమా స్థాయిని అందుకోలేక డిజాస్టర్లుగా నిలిచాయి. ఇంకొన్ని సినిమాలైతే అనౌన్స్ అయితే అయ్యాయి కానీ ముందు సినిమాల రిజల్ట్ ను దృష్టిలో పెట్టుకుని వాటికి సీక్వెల్స్ వస్తాయో లేవో కూడా చెప్పలేని పరిస్థితి.
ఈ నేపథ్యంలో పదేళ్ల కిందట సల్మాన్ ఖాన్ హీరోగా కబీర్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కిన బజరంగీ భాయిజాన్ కు సీక్వెల్ రానుందని ఆ మధ్య వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సల్మాన్ ఖాన్ కెరీర్లోని సూపర్ హిట్ సినిమాల్లో ఒకటిగా నిలిచిందనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బజరంగీ భాయిజాన్ రిలీజై జులై 17కు పదేళ్లు పూర్తవుతుంది.
ఈ సందర్భంగా డైరెక్టర్ కబీర్ ఖాన్ ఈ సినిమా సీక్వెల్ పై రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. బజరంగీ భాయిజాన్ కు తప్పకుండా సీక్వెల్ ను తీస్తామని, ఈ జెనరేషన్ కు తగ్గట్టు ఉండేలా ఆ సీక్వెల్ ను రూపొందిస్తామని ఆయన అన్నారు. అయితే ఈ సీక్వెల్ ను సొంత ప్రయోజనాల కోసం మాత్రం తీయమని, సీక్వెల్ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉన్నట్టు ఆయన తెలిపారు.
బజరంగీ భాయిజాన్ సినిమా సక్సెస్ ను క్యాష్ చేసుకోవాలనో, బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు అందుకోవాలనో ఈ సీక్వెల్ ను తొందరపడి తీయమని, బజరంగీ భాయిజాన్ చాలా మంచి సినిమా, దానికి సీక్వెల్ తీయాలంటే దాన్ని మించి గొప్పగా తెరకెక్కించాలని, అలాంటి కథ ఎప్పుడొస్తే అప్పుడు ఆ సీక్వెల్ ను తీస్తామని డైరెక్టర్ కబీర్ ఖాన్ స్పష్టం చేశారు. గతంలో ఈ సీక్వెల్ పై రైటర్ విజయేంద్ర ప్రసాద్ కూడా మాట్లాడారు. కొన్నాళ్ల కిందట సల్మాన్ ను కలిసి బజరంగీ భాయిజాన్ సీక్వెల్ కోసం ఓ పాయింట్ చెప్తే అది ఆయనకెంతో నచ్చిందని, ఏం జరుగుతుందో చూద్దామని చెప్పిన సంగతి తెలిసిందే.
