ఏళ్ల తరబడి గాయకుల మధ్య వివాదం.. ఈ మంటలు చల్లారేదెలా?
ఇది సోషల్ మీడియాలో మొదలైంది. దువా లిపాతో ఏదైనా మ్యూజిక్ ట్రాక్‌లు నిర్మిస్తున్నారా అని నెటిజన్ ప్రశ్నించగా, ''ఆమె (దువా లిపా)తో పిల్లలను కనడం కంటే మంచిది!'' అని బాద్ షా అన్నాడు.
By: Tupaki Desk | 9 Jun 2025 10:30 PMపాప్ గాయకులు బాద్ షా, హనీసింగ్ మధ్య శత్రుత్వం అందరికీ తెలిసిందే. ర్యాపర్లు ఒకరికొకరు ఎదురు పడితే భగ్గుమని మండిపోతారు. శత్రువుల్లా సలసలా కాగిపోతారు. ఇద్దరు ప్రముఖ రాపర్లు తమ మ్యూజిక్ ఆల్బమ్‌లపైనా సెటైర్లు వేసుకుంటారు. ఒకరితో ఒకరు విభేధిస్తారు. పబ్లిక్ ప్లాట్‌ఫామ్‌లపై తమ బంధం, సంఘర్షణ గురించి బహిరంగంగా మాట్లాడుకుంటారు. ఇటీవల బాద్షా అంతర్జాతీయ గాయని దువా లిపా నుద్ధేశిస్తూ చేసిన ట్వీట్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. దీనికి ప్రతిస్పందిస్తూ యో యో వ్యంగ్యంగా స్పందించాడు. అటుపై అభిమానులు రెండుగా చీలి ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డారు.
ఇది సోషల్ మీడియాలో మొదలైంది. దువా లిపాతో ఏదైనా మ్యూజిక్ ట్రాక్‌లు నిర్మిస్తున్నారా అని నెటిజన్ ప్రశ్నించగా, ''ఆమె (దువా లిపా)తో పిల్లలను కనడం కంటే మంచిది!'' అని బాద్ షా అన్నాడు. దీనికి ప్రతిస్పందిస్తూ యో యో హనీ సింగ్ 'జీనియస్' అని నవ్వుతూ మూడు క్లాప్ ఎమోజీలతో వ్యంగ్యంగా స్పందించాడు. ఈ వ్యాఖ్య పెద్ద చర్చగా మారింది. దువా లిపాతో పిల్లలను కనాలని కోరుకుంటున్నానని రాపర్ బాద్ షా ట్వీట్ చేయగా, దానిపై హనీసింగ్ పంచ్ వేయడం అభిమానుల్లో ఘర్షణకు తెర తీసింది.
తనకు ఎదురైన అవమానాలకు ప్రతిస్పందనగా, బాద్షా ఎదురుదాడి చేస్తూ-''మనం నిజంగా ఆరాధించే స్త్రీకి ఇవ్వగల అత్యంత అందమైన అభినందనలలో ఒకటి... ఆమె మీ పిల్లలకు తల్లి కావాలని కోరుకోవడం.. నా ఉద్ధేశం సరే.. ఇప్పుడు మీ ఉద్ధేశాలు బయటపడ్డాయి'' అని బాద్ షా ఆవేశంగా వ్యాఖ్యానించాడు.
నిజానికి బాద్ షా, యోయో హనీ సింగ్ మధ్య కొన్నేళ్లుగా వివాదాలు కొనసాగుతున్నాయి. వారిద్దరూ రాప్ గ్రూప్ మాఫియా ముండీర్‌లో సభ్యులు. కొన్ని సంఘటన తర్వాత పరిస్థితులు మరింత దిగజారి, వైరంగా మారాయి. ఇద్దరూ ఒకరినొకరు బహిరంగంగా ఎగతాళి చేసుకున్నారు. బాద్షా తన అనారోగ్యాన్ని ఎగతాళి చేశాడని హనీ సింగ్ పేర్కొన్నాడు. యోయోతో వివాదాలను కొనసాగిస్తానని బాద్ షా శపథం చేసాడు. ఇంతలోనే హనీ ఇటీవల చేసిన వ్యంగ్య వ్యాఖ్య అగ్నికి మరింత ఆజ్యం పోసింది. యో యో కి దూకుడెక్కువ. బ్రౌన్ రంగ్, బ్లూ ఐస్, ఫస్ట్ కిస్, దేశీ కలకార్ వంటి పాపులర్ సాంగ్స్ అతడికి గుర్తింపునిచ్చాయి. అదే సమయంలో తన రెచ్చగొట్టే సాహిత్యానికి పదే పదే విమర్శలు ఎదుర్కొంటున్నాడు.