'బ్యాడ్ గర్ల్'కి అన్ని కష్టాలు తొలగిపోయేదెలా?
అసలు వివాదం ఏమిటీ? అంటే.... ఇందులో టీనేజర్ పాత్రను ఉన్నదున్నట్టు చూపిస్తున్నారని కొందరు వ్యాఖ్యానిస్తుంటే, ఈ పాత్రను వక్రీకరించారని మరికొందరు వాదిస్తున్నారు.
By: Tupaki Desk | 23 July 2025 4:00 AM ISTరకరకాల వివాదాల కారణంగా నిరంతరం వార్తల్లో నిలుస్తోంది `బ్యాడ్ గర్ల్` మూవీ. వేట్రిమారన్- అనురాగ్ కశ్యప్ వంటి ప్రముఖ దర్శకనిర్మాతలు ఈ సినిమాకి మద్ధతుగా నిలవడంతో ఇందులో ఏదో సంథింగ్ ఉందని భావిస్తున్నారు. ఈ చిత్రానికి వర్ష భరత్ దర్శకత్వం వహించారు. అయితే రిలీజ్ ముంగిట ఈ సినిమా చాలా వివాదాల్ని మోసుకొచ్చింది. ఇప్పుడు కోర్టులో వివాదాన్ని పరిష్కరించుకుని రిలీజ్ కి వస్తోంది. అయితే ఈ సినిమాలో టీనేజర్ పాత్రను అసభ్యంగా చూపిస్తున్నారని, ఒక బ్రాహ్మణ యువతిగా చూపిస్తూ మతాన్ని కించపరిచారని వివాదం చెలరేగింది.
ఇటీవల విడుదలైన టీజర్ టీనేజర్లను తప్పు దారి పట్టించేదిగా ఉందని కూడా కోర్టు భావిస్తోంది. మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల నుండి `బ్యాడ్ గర్ల్` టీజర్‌ను తొలగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. టీజర్‌లో మైనర్లను అసహ్యకరమైన రీతిలో చిత్రీకరించారని పేర్కొంటూ పిటిషన్లు దాఖలు అవ్వడంతో కోర్టు ఈ కేసును సీరియస్ గా పరిగణించింది. విచారణ సందర్భంగా కోర్టు సినిమా టీజర్ ను అన్ని మాధ్యమాల నుంచి తొలగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ఓ వైపు కోర్టు గొడవ నడుస్తున్నా ఈ చిత్రానికి యుఏ సర్టిఫికెట్ లభించింది. సెప్టెంబర్ 5న సినిమా థియేటర్లలో విడుదల కానుంది.
అసలు వివాదం ఏమిటీ? అంటే.... ఇందులో టీనేజర్ పాత్రను ఉన్నదున్నట్టు చూపిస్తున్నారని కొందరు వ్యాఖ్యానిస్తుంటే, ఈ పాత్రను వక్రీకరించారని మరికొందరు వాదిస్తున్నారు. పిల్లలను లైంగికంగా తప్పుగా చిత్రీకరిస్తున్నారని పలువురు ఆరోపించారు. ఈ చిత్రంలో బ్రాహ్మణ అమ్మాయి పాత్రను చూపించడంపై చాలా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
బ్యాడ్ గర్ల్ చిత్రంతో వర్ష భరత్ దర్శకులుగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రం ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ రోటర్‌డ్యామ్ 2025లో NETPAC (నెట్‌వర్క్ ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ ఆసియన్ సినిమా) అవార్డును గెలుచుకుంది. అంజలి శివరామన్ ఇందులో ప్రధాన నాయిక. హృదు హరూన్, టీజే అరుణాచలం, శరణ్య రవిచంద్రన్, శాంతి ప్రియ, శశాంక్ బొమ్మిరెడ్డిపల్లి తదితరులు నటించారు.
