Begin typing your search above and press return to search.

పుష్ప-3 బ్యాక్ డ్రాప్ అదే.. బన్నీ మాటేంటి?

భారీ అంచనాలు నెలకొన్న ఈ ప్రాజెక్ట్ నుంచి క్రేజీ అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

By:  Tupaki Desk   |   18 Feb 2024 12:35 PM GMT
పుష్ప-3 బ్యాక్ డ్రాప్ అదే.. బన్నీ మాటేంటి?
X

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప ది రూల్. 2021లో విడుదలైన పుష్ప ది రైజ్ కు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ.. ఆగస్టు 15వ తేదీన వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. భారీ అంచనాలు నెలకొన్న ఈ ప్రాజెక్ట్ నుంచి క్రేజీ అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

ఇక ఈ సినిమా విషయంలో డైరెక్టర్ సుకుమార్ అండ్ టీం పెద్ద ఎత్తున కసరత్తు చేస్తోంది. ఆడియన్స్ కు బెస్ట్ అవుట్ పుట్ ఇవ్వడమే టార్గెట్ గా సుక్కూ టీమ్ కృషి చేస్తోంది. అయితే కొన్ని రోజుల క్రితం ఈ సినిమా మూడో పార్ట్ కూడా ఉంటుందని వార్తలు వచ్చాయి. పుష్ప ది రోర్ టైటిల్ తో ప్రేక్షకుల మందుకు వస్తుందని సినీ వర్గాల్లో చర్చ జరిగింది.

దీనిపై పుష్ప మూవీ టీమ్ ఎక్కడా స్పందించకపోయినా.. ఇటీవల అల్లు అర్జున్ రెస్పాండ్ అయ్యారు. జర్మనీలో జరుగుతున్న బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కు చీఫ్ గెస్ట్ గా హాజరైన బన్నీ.. పుష్ప-3పై పెదవి విప్పారు. ఫ్యూచర్ లో పుష్ప-3 కూడా ఉండొచ్చని అల్లు అర్జున్ చెప్పారు. ఈ సినిమాను ఒక ఫ్రాంచైజీలా మార్చాలనుకుంటున్నట్లు తెలిపారు. తమ వద్ద సూపర్ ఆలోచనలున్నాయని అన్నారు.

దీంతో బన్నీ అభిమానులంతా పుష్ప-3 ఉంటుందని ఫిక్స్ అయిపోయారు. అయితే మూడో పార్ట్ స్టోరీ లైన్ పై ఇప్పుడు నెట్టింట చర్చ మొదలైంది. జపాన్ బ్యాక్ డ్రాప్ లో పుష్ప-3 స్టోరీని సుకుమార్ రెడీ చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆర్ఆర్ఆర్, బాహుబలి మూవీలకు జపాన్ మార్కెట్ లో సూపర్ క్రేజ్ లభించింది. అందుకే పుష్ప-3ను జపాన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించాలని సుక్కూ మాస్టర్ నిర్ణయించుకున్నారట.

అయితే పుష్ప-1లోనే జపాన్ బ్యాక్ డ్రాప్ కు పునాది పడింది. జపాన్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఎర్ర చందనం స్మగ్లర్ల గురించి సినిమాలో హైలెట్ చేసి చూపించారు. మరోవైపు, ఫస్ట్ పార్ట్ తో పోలిస్తే సెకండ్ పార్ట్ లో ప్రెజంటేషన్ భారీగా ఉంటుందని అల్లు అర్జున్.. ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. కచ్చితంగా ఈ మూవీ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుందని చెప్పారు. అయితే పుష్ప తర్వాత తాను బడా ప్రాజెక్టులు చేయనున్నట్లు వెల్లడించారు బన్నీ. మరి పుష్ప రాజ్ కొత్త సినిమాలు ఎలా ఉంటాయో చూడాలి.