కొంపముంచిన ‘బ్యాచిలర్ పార్టీ’.. రక్షిత్ శెట్టికి భారీ షాక్
ఇక సినిమాలో హీరో బాధలో ఉన్నప్పుడు ‘న్యాయ ఎల్లిదె’ అనే పాటను వాడటం కాకతాళీయంగా జరిగింది కాదని కోర్టు అభిప్రాయపడింది.
By: Madhu Reddy | 4 April 2026 3:49 PM ISTకన్నడ స్టార్ హీరో, నేషనల్ అవార్డ్ విన్నర్ రక్షిత్ శెట్టికి ఊహించని షాక్ తగిలింది. ఆయన సొంత నిర్మాణ సంస్థ పరంవా స్టూడియోస్ నిర్మించిన ‘బ్యాచిలర్ పార్టీ’ సినిమా ఇప్పుడు కాపీరైట్ వివాదంలో చిక్కుకుంది. అనుమతి లేకుండా పాత పాటలను వాడారనే ఆరోపణలతో ఢిల్లీ హైకోర్టు ఏకంగా రూ. 25 లక్షల భారీ జరిమానా విధించింది. కేవలం కొన్ని సెకన్ల పాటు వినిపించే పాటల కోసం ఇంత పెద్ద మొత్తంలో పరిహారం చెల్లించాల్సి రావడం ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది.
ఏమిటా వివాదం? కోర్టుకు వెళ్ళిన మ్యూజిక్ కంపెనీ:
రక్షిత్ శెట్టి నిర్మాణంలో వచ్చిన ‘బ్యాచిలర్ పార్టీ’ సినిమాలో తమకు చెందిన రెండు పాటలను అక్రమంగా వాడుకున్నారని ‘ఎంఆర్‌టీ మ్యూజిక్’ సంస్థ కోర్టును ఆశ్రయించింది. ‘న్యాయ ఎల్లిదె’ మరియు ‘ఒమ్మె నిన్నన్ను’ అనే రెండు పాపులర్ పాటల హక్కులు తమ దగ్గరే ఉన్నాయని, వాటిని సినిమాలో ఉపయోగించడానికి ఎలాంటి పర్మిషన్ తీసుకోలేదని ఆ సంస్థ ఫిర్యాదు చేసింది. ఇక దీంతో సినిమా యూనిట్ కాపీరైట్ చట్టాలను ఉల్లంఘించిందని వాదిస్తూ ఢిల్లీ హైకోర్టులో కేసు వేయడంతో ఈ రచ్చ మొదలైంది.
సెకన్ల లెక్క చెప్పిన రక్షిత్.. తిరస్కరించిన కోర్టు:
ఈ కేసు విచారణలో రక్షిత్ శెట్టి తరఫు లాయర్లు తమ వాదనను బలంగా వినిపించారు. ‘న్యాయ ఎల్లిదె’ పాటను కేవలం 7 సెకన్లు, ‘ఒమ్మె నిన్నన్ను’ పాటను కేవలం 31 సెకన్ల పాటు మాత్రమే సినిమాలో బ్యాక్‌గ్రౌండ్‌లో వాడామని, అంత తక్కువ సమయం వాడటం హక్కుల ఉల్లంఘన కిందకు రాదని వాదించారు. అయితే, కోర్టు ఈ వాదనను అస్సలు ఒప్పుకోలేదు. పాట నిడివి ఎంత అన్నది ముఖ్యం కాదని, అనుమతి లేకుండా వాణిజ్య పరమైన లాభం కోసం వాడుకోవడమే తప్పని ధర్మాసనం స్పష్టం చేసింది.
పథకం ప్రకారమే వాడారు.. జరిమానా తప్పదు:
ఇక సినిమాలో హీరో బాధలో ఉన్నప్పుడు ‘న్యాయ ఎల్లిదె’ అనే పాటను వాడటం కాకతాళీయంగా జరిగింది కాదని కోర్టు అభిప్రాయపడింది. కథకు అనుగుణంగా, ఒక ప్లాన్ ప్రకారమే ఆ పాటను వాడుకున్నారని, అది కచ్చితంగా కాపీరైట్ పరిధిలోకి వస్తుందని జడ్జి పేర్కొన్నారు. రక్షిత్ శెట్టికి జైలు శిక్ష పడకుండా మినహాయింపు ఇచ్చినప్పటికీ, జరిమానా విషయంలో మాత్రం తగ్గేదేలేదని కోర్టు తీర్పునిచ్చింది. ఎంఆర్‌టీ మ్యూజిక్ సంస్థకు రూ. 25 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది.
ఇండస్ట్రీకి ఇదొక గుణపాఠం..రక్షిత్ శెట్టి రియాక్షన్:
ఈ వివాదానికి సంబంధించి కోర్టు మొదట ₹20 లక్షలు డిపాజిట్ చేయాలని ఆదేశించినప్పటికీ, రక్షిత్ శెట్టి నిర్మాణ సంస్థ నుంచి స్పందన ఆలస్యం కావడంతో కోర్టు జరిమానా మొత్తాన్ని రూ. 25 లక్షలకు పెంచింది. ఈ పరిణామంతో రక్షిత్ శెట్టి ప్రొడక్షన్ హౌస్‌కు భారీ ఆర్థిక భారం పడగా, దీనిపై ఆయన అధికారికంగా స్పందించారు. ప్రస్తుతం ఈ విషయం కోర్టు పరిధిలో ఉందని, తాము చట్టపరమైన ప్రక్రియను గౌరవిస్తూ ముందుకు సాగుతామని రక్షిత్ శెట్టి స్పష్టం చేశారు. అయితే, సినిమా మేకర్స్ పాత పాటలను లేదా మ్యూజిక్‌ను వాడుకునేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ కేసు నిరూపించింది. ఈ తీర్పు ఇతర నిర్మాతలకు కూడా ఒక హెచ్చరికలాంటిదని చెప్పాలి. భారీ బడ్జెట్ సినిమాలు తీసేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు ఎంతటి ఆర్థిక భారానికి దారితీస్తాయో ఈ ఘటనతో అర్థమవుతోంది.
