Begin typing your search above and press return to search.

ఎవ‌రికీ ఇబ్బంది కాకూడ‌ద‌నే తిరుమలకు రాలేదు!

మంగళవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న బాబు మోహన్ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

By:  Sravani Lakshmi Srungarapu   |   7 July 2026 3:27 PM IST
ఎవ‌రికీ ఇబ్బంది కాకూడ‌ద‌నే తిరుమలకు రాలేదు!
X

తెలుగు సినీ ప్రేక్షకులను తనదైన కామెడీతో ఎన్నో సంవత్సరాల పాటూ అలరించిన సీనియర్ నటుడు బాబు మోహన్ తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. చాలా కాలం తర్వాత శ్రీవారి సన్నిధికి వచ్చిన ఆయన, ఇంతకాలం తిరుమలకు ఎందుకు రాలేదనే విషయాన్ని స్వయంగా వెల్లడించారు. తన రాకతో ఇతర భక్తులకు అసౌకర్యం కలగకూడదనే ఉద్దేశంతోనే గత ఐదారు సంవత్సరాలుగా తిరుమలకు దూరంగా ఉన్నానని ఆయ‌న చెప్పారు.

మంగళవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న బాబు మోహన్ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. దర్శనం అనంతరం ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, రెండు నెలల క్రితమే ఎట్టి పరిస్థితుల్లోనైనా స్వామివారిని దర్శించుకోవాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. ఇటీవల తిరుపతి పరిసర ప్రాంతాల్లో సినిమా షూటింగ్ ఉండటంతో ఈ అవకాశాన్ని వినియోగించుకుని శ్రీవారిని దర్శించుకున్నానని చెప్పారు. తనకు అభిమానుల నుంచి లభించే ఆదరణ కారణంగా ఆలయంలో రద్దీ పెరిగి ఇతర భక్తులకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉండేదని భావించానని బాబు మోహన్ పేర్కొన్నారు. అందుకే చాలాకాలం పాటు తిరుమలకు రాకుండా ఉండిపోయానని తెలిపారు. అయితే ఈసారి షూటింగ్ పనులు పూర్తైన‌ తర్వాత స్వామివారి దర్శనం చేసుకోవడం తనకు ఎంతో ఆనందంగా అనిపించిందన్నారు.

సినీ కెరీర్ గురించి కూడా ఆయన ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ప్రస్తుతం తాను ఏకంగా 15 సినిమాల్లో నటిస్తున్నానని, వాటిలో 8 సినిమాల‌ షూటింగ్ ఇప్పటికే పూర్తై రిలీజ్ కు రెడీగా ఉన్నాయని చెప్పారు. ఈ సినిమాల్లో కనీసం 5 చిత్రాల్లో ఫుల్ లెంగ్త్ క్యారెక్ట‌ర్ల‌లో కనిపిస్తానని, ఆడియ‌న్స్ మరోసారి తన యాక్టింగ్ ను ఆదరిస్తారనే నమ్మకం వ్యక్తం చేశారు. నటుడిగా చివరి శ్వాస వరకు ప్రేక్షకులను అలరించాలని, నవ్వులు పంచాలని శ్రీవారిని ప్రార్థించినట్లు వెల్లడించారు.

రాజకీయాల్లో బిజీ కావడంతో కొంతకాలం వెండితెరకు దూరమైన బాబు మోహన్, ఇప్పుడు మళ్లీ వరుస సినిమాల‌తో కెమెరా ముందుకు వ‌స్తున్నారు. కొత్త తరం డైరెక్ట‌ర్లు కూడా తనకు మంచి పాత్రలు ఇస్తున్నారని, వాటి ద్వారా మరోసారి ప్రేక్షకుల మన్ననలు పొందాలని ఆశిస్తున్నానన్నారు. తిరుమల దర్శనం అనంతరం ఆయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం సినీ వర్గాల్లోనూ, అభిమానుల్లోనూ చర్చనీయాంశంగా మారాయి.