Begin typing your search above and press return to search.

ఈవెంట్ కు పిలిచి క‌నీసం ప‌ట్టించుకోలేదు

ఇన్ని సినిమాల్లో న‌టించి, ఇంత గుర్తింపు తెచ్చుకున్నాక కూడా ఇలాంటి ప‌రిస్థితి ఎదుర‌వ్వ‌డంపై పృథ్వీరాజ్ ఆవేద‌న వ్య‌క్తం చేశాడు.

By:  Tupaki Desk   |   27 April 2025 2:30 AM
ఈవెంట్ కు పిలిచి క‌నీసం ప‌ట్టించుకోలేదు
X

పెళ్లి పందిరి, చెన్న‌కేశ‌వ రెడ్డి, సంతోషం మొద‌లు ఇటీవ‌ల వ‌చ్చిన యానిమ‌ల్‌, తండేల్, అర్జున్ స‌న్నాఫ్ వైజ‌యంతి వ‌ర‌కు మూడు ద‌శాబ్దాలుగా ఎన్నో వైవిధ్య‌మైన పాత్ర‌ల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను త‌న న‌ట‌న‌తో అల‌రిస్తున్న బ‌బ్లూ పృథ్వీరాజ్ కు ఈ మ‌ధ్య ఒక చేదు అనుభ‌వం ఎదురైందంట‌. ఈ విష‌యాన్ని పృథ్వీరాజ్‌నే స్వ‌యంగా ఒక పాడ్‌కాస్ట్‌లో తెలియ‌జేశాడు. ఇన్ని సినిమాల్లో న‌టించి, ఇంత గుర్తింపు తెచ్చుకున్నాక కూడా ఇలాంటి ప‌రిస్థితి ఎదుర‌వ్వ‌డంపై పృథ్వీరాజ్ ఆవేద‌న వ్య‌క్తం చేశాడు.

దిలీప్ ప్ర‌కాష్‌-రెజీనా జంట‌గా, బ్ర‌హ్మానందం, ప్ర‌కాష్ రాజ్‌, పృథ్వీరాజ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఉత్స‌వం సినిమా కింద‌టి ఏడాది విడుద‌లైంది. ఈ చిత్ర షూటింగ్ కోవిడ్ ముందే దాదాపు పూర్తైనా వివిధ కార‌ణాల‌తో విడుద‌ల ఆల‌స్య‌మైంది. మొత్తానికి గ‌త ఏడాది ఈ చిత్రం రిలీజైంది. ఈ సినిమా ముందు నిర్వ‌హించిన ప్రీరిలీజ్ ఈవెంట్‌కు గుర్తు పెట్టుకుని త‌న‌ను కూడా ఆహ్వానించ‌డంతో చాలా ఆనందించాన‌ని పృథ్వీరాజ్ తెలిపాడు. ఉత్సాహంగా, సంతోషంతో ఆ కార్య‌క్ర‌మానికి వెళ్లాన‌ని తెలిపాడు.

ఈ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు హాజ‌ర‌య్యేందుకు వేరే షూటింగ్‌ల‌ను కూడా ర‌ద్దు చేసుకొని వెళ్లాన‌ని, అక్క‌డికి వెళ్లాక తొలుత ప్రొడ్యూస‌ర్ల‌ను, ద‌ర్శ‌కుడిని ప‌ల‌క‌రించగా వాళ్లు స‌రిగ్గా మాట్లాడ‌లేద‌ని పృథ్వీరాజ్ వాపోయాడు. స‌రే వాళ్లు ఈవెంట్ హ‌డావిడిలో ఉన్నార‌ని స‌రిపెట్టుకుని, వెళ్లి ఒక చోట కూర్చోగా ఎవ‌రెవ‌రో వ‌స్తున్నార‌ని త‌న‌ను మూడు-నాలుగుసార్లు లేపి ప‌క్క‌కు జ‌రిగి కూర్చోమ‌న్నార‌ని తెలిపాడు. ఆత‌ర్వాత స్టేజ్ పైకి పెద్ద న‌టులు మొద‌లు మేక‌ప్ ఆర్టిస్టుల వ‌ర‌కు అంద‌రిని పిలిచి త‌న‌ను ర‌మ్మ‌న‌లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. ఇంత‌లో ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడితో మాట్లాడుతుండ‌గా కావాల‌ని వ‌చ్చి ఆయ‌న్ని ఒక‌రు పిలుచుకొని వెళ్లార‌ని పృథ్వీ చెప్పాడు.

ప్రీరిలీజ్ ఈవెంట్ మొత్తం ముగిశాక గ్రూప్ ఫోటో కోసం అంద‌రిని నిల‌బ‌డ‌మ‌ని చెప్పి, త‌న‌ను కావాల‌ని వెనుక వ‌రుసలో నిల‌బెట్టార‌ని పృథ్వీరాజ్ బాధ‌ప‌డ్డాడు. ఈ గ్రూప్ ఫొటో కోసం త‌న‌తో పాటు వెన‌క నిల‌బ‌డిన గిరిబాబును మాత్రం ప్ర‌త్యేకంగా పిలిచి ముందు వ‌రుస‌లో నిల‌బెట్ట‌గా త‌న‌ని మాత్రం ప‌ట్టించుకోలేద‌ని వాపోయాడు. యానిమ‌ల్ సినిమా త‌ర్వాత తన గుర్తింపు మ‌రింత పెరిగింద‌ని అనుకున్నా కానీ, క‌నీసం ప‌ట్టించుకునే వారే లేక‌పోయారని ఈ సంఘ‌ట‌న‌తోనే త‌న‌కు తెలిసింద‌ని పృథ్వీరాజ్ ఆవేద‌న వ్య‌క్తం చేశాడు.