దివంగత నటుడి కొడుకు మానసిక ఆందోళనకు కారణం?
దివంగత నటుడు ఇర్ఫాన్ ఖాన్ కుమారుడు బాబిల్ ఖాన్ ఆదివారం ఉదయం ఒక భావోద్వేగ వీడియోను పోస్ట్ చేసాడు. ఇందులో అతడు అదుపులేకుండా ఏడుస్తూ కనిపించడంతో ఈ వీడియో కలకలం రేపింది.
By: Tupaki Desk | 4 May 2025 8:46 PM ISTసినీపరిశ్రమలో కెరీర్ కోసం పాకులాడే బడ్డింగ్ నటులు చాలా సంక్లిష్ఠమైన పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. గ్లామర్ రంగంలో రెడ్ కార్పెట్ వేసి సహచరులు ప్రేమించి, అభిమానించి, కలిసి మెలిసి ఉండే పరిస్థితులు, గౌరవాన్ని ఇచ్చి పుచ్చుకునే సన్నివేశం ఇప్పుడు లేవు. ఎదిగే క్రమంలో కొన్ని విమర్శల్ని, కుట్రల్ని లేదా గొడవల్ని ఫేస్ చేయాల్సి రావొచ్చు. రంగుల ప్రపంచాన్ని ఒక బిగ్ బాస్ హౌస లా భావిస్తే, ఈ ఇంటిలో ఎవరు బాగా ఆడగలరు? అన్నది చాలా కీలకంగా మారుతుంది. లైఫ్ జర్నీలో ప్రతి ఆర్టిస్టు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఇది.
దివంగత నటుడు ఇర్ఫాన్ ఖాన్ కుమారుడు బాబిల్ ఖాన్ ఆదివారం ఉదయం ఒక భావోద్వేగ వీడియోను పోస్ట్ చేసాడు. ఇందులో అతడు అదుపులేకుండా ఏడుస్తూ కనిపించడంతో ఈ వీడియో కలకలం రేపింది. ఈ వీడియోలో బాబిల్ బాలీవుడ్ లో ఒత్తిళ్లపై నిరాశను వ్యక్తం చేశాడు. పలువురు తోటి నటీనటుల పేర్లను అతడు ప్రస్థావించాడు. వారితో అతడికి సమస్య ఏర్పడిందని అందరికీ అర్థమైంది. అతడు మానసికంగా ఇబ్బంది పడుతున్నాడని కూడా అర్థం చేసుకున్నారు. అయితే ఈ వీడియో సర్క్యులేట్ అయిన తర్వాత బాబిల్ కుటుంబం అతడి భావోద్వేగ విస్ఫోటనం వెనుక ఉన్న నిజమైన ఉద్దేశ్యాన్ని చెబుతూ ఒక ప్రకటన విడుదల చేసింది.
బాబిల్ తల్లి సుతపా సిక్దర్ తన ఇన్‌స్టాలో ఒక నోట్ జారీ చేసారు. ఇందులో బాబిల్ కెరీర్, మానసిక ఆరోగ్యం గురించి ప్రస్థావించారు. అతడు పరిశ్రమలో చాలా ప్రేమ, ప్రశంసలను పొందాడని, కొన్ని కష్టతరమైన రోజులు ఉన్నాయని అన్నారు. అయితే అతడు సురక్షితంగానే ఉన్నాడని, త్వరలో కోలుకుంటాడని కూడా వివరణ ఇచ్చారు. వీడియోలో బాబిల్ భావోద్వేగాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని కూడా కన్వే చేసే ప్రయత్నం చేసారు. అనన్య పాండే, షనాయ కపూర్, సిద్ధాంత్ చతుర్వేది, రాఘవ్ జుయల్, ఆదర్శ్ గౌరవ్, అర్జున్ కపూర్, అరిజిత్ సింగ్ వంటి తన తోటి నటుల గురించి బాబిల్ భావోద్వేగ వ్యాఖ్యలు విమర్శ కాదు, పరిశ్రమకు వారు చేసిన కృషికి గుర్తింపు అని కూడా వివరణ ఇచ్చారు. అయితే బాబిల్ ఆవేదన ఇందులో వేరేగా కనిపించింది. ప్రస్తుతం ఈ వీడియోను తొలగించడమే గాక, ఇన్ స్టా నుంచి అతడు వైదొలిగాడు.
వైరల్ వీడియోలో బాబిల్ ఇలా విరుచుకుపడ్డాడు. నేను చెప్పాలనుకున్నది ఏమిటి అంటే.. షనాయ కపూర్, అనన్య పాండే, అర్జున్ కపూర్, సిద్ధాంత్ చతుర్వేది, రాఘవ్ జుయల్, ఆదర్శ్ గౌరవ్, అరిజిత్ సింగ్ వంటి వ్యక్తులు ఉన్నారని మీకు తెలియజేయాలని కోరుకుంటున్నాను? ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. బాలీవుడ్ చాలా f**d. బాలీవుడ్ చాలా చాలా మొరటుగా ఉంది. ఆ పరిశ్రమ నేను ఇప్పటివరకు ఇన్వాల్వ్ అయిన అత్యంత ఫేక్ పరిశ్రమ అని బాబిల్ అభివర్ణించారు. అయితే కొందరు పరిశ్రమను మెరుగుపరచడానికి ప్రయత్నిస్తున్నారని కూడా యువకుడైన బాబిల్ ఆవేశంగా పేర్కొన్నాడు.
