Begin typing your search above and press return to search.

బాహుబ‌లి రెండు భాగాలు క‌లిపితే 'ది ఎపిక్'

బాహుబ‌లి - ది ఎపిక్ అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది అని సోష‌ల్ మీడియాలో వెల్ల‌డించారు. బాహుబలి: ది బిగినింగ్ బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా విజయం సాధించింది.

By:  Tupaki Desk   |   10 July 2025 11:03 PM IST
బాహుబ‌లి రెండు భాగాలు క‌లిపితే ది ఎపిక్
X

క‌ట్ట‌ప్ప బాహుబ‌లిని ఎందుకు చంపాడు? (వై క‌ట్ట‌ప్ప కిల్డ్ బాహుబ‌లి?) ఈ ఒక్క ప్ర‌శ్న‌తో బాహుబ‌లి 2 కోసం ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రజ‌లు ఎదురు చూసేలా చేసాడు ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళి. రెండు భాగాలుగా రూపొందించిన బాహుబ‌లి భార‌తీయ సినిమా చ‌రిత్ర‌లో అసాధార‌ణ వ‌సూళ్ల‌ను సాధించ‌డ‌మే గాక‌, రాజ‌మౌళి ఖ్యాతిని ప్ర‌పంచానికి చాటి చెప్పింది. అందుకే బాహుబ‌లి చిత్రం చాలా స్పెష‌ల్. అందులో న‌టించిన ప్ర‌భాస్, రానా, స‌త్య‌రాజ్, ర‌మ్య‌కృష్ణ‌, అనుష్క వంటి న‌టీన‌టుల‌కు ఇది ఎంతో ప్ర‌త్యేక‌మైన‌ది.

ఈ సినిమా విడుద‌లైన ప‌దేళ్ల‌యింది. ఈ సంద‌ర్భంగా బాహుబ‌లి 1, బాహుబ‌లి 2 రెండు భాగాల‌ను క‌లిపి కంబైన్డ్ సినిమాని `బాహుబ‌లి- ది ఎపిక్` పేరుతో తిరిగి థియేట‌ర్ల‌లోకి విడుద‌ల చేస్తున్నారు. 31 అక్టోబ‌ర్ 2025 డేట్ ని లాక్ చేసారు. ఈ సంద‌ర్భంగా రీరిలీజ్ గురించి అధికారిక పోస్ట‌ర్ వేసి మ‌రీ ప్ర‌క‌టించారు. ఈ ఎగ్జ‌యిటింగ్ చిత్రాన్ని మ‌రోసారి పెద్ద తెర‌పై వీక్షించేందుకు సిద్ధంగా ఉండండి అని ప్ర‌క‌టించారు. అమ‌రేంద్ర బాహుబ‌లి- మ‌హేంద్ర బాహుబ‌లి ఫోటోల‌తో ఈ పోస్ట‌ర్ ని ముద్రించ‌డం ఆస‌క్తిని క‌లిగించింది. అలాగే ఈ పోస్ట‌ర్ లాంచ్ సంద‌ర్భంగా ప్ర‌భాస్- రానా- రాజ‌మౌళి - ర‌మ్య‌కృష్ణ రీయూనియ‌న్ అవ్వ‌డం ఆస‌క్తిని క‌లిగించింది.

10 సంవత్సరాల క్రితం, ఒక ప్రశ్న దేశాన్ని ఏకం చేసింది… ఇప్పుడు ప్రశ్న , దానికి సమాధానం ఒక గొప్ప ఇతిహాసంలో కలిసి తిరిగి వచ్చాయి. బాహుబ‌లి - ది ఎపిక్ అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది అని సోష‌ల్ మీడియాలో వెల్ల‌డించారు. బాహుబలి: ది బిగినింగ్ బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా విజయం సాధించింది. ఇది జాతీయ అంతర్జాతీయ స్థాయిలో విమర్శకుల ప్రశంసలను పొందింది. ఈ చిత్రం 44వ సాటర్న్ అవార్డులలో మూడు జాతీయ అవార్డులను, ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా సాటర్న్ అవార్డును గెలుచుకుంది. ఆ త‌ర్వాత సీక్వెల్ విడుద‌లై దాదాపు 1800 కోట్లు వ‌సూలు చేయ‌డం ఒక సంచ‌ల‌నం. ఆ సమయంలో అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చిత్రంగా బాహుబ‌లి 2 నిలిచింది. ఇది దాదాపు 9వేల థియేట‌ర్ల‌లో విడుద‌లైంది.