'బాహుబలి ది బిగినింగ్' @10 ఏళ్లు!
ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, సత్యరాజ్ , నాజర్, రమ్యకృష్ణ , ప్రభాకర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా తెలుగు సినిమాకు ఓ కొత్త రూపును తీసుకొచ్చింది.
By: Tupaki Desk | 10 July 2025 10:01 PM ISTఅప్పటి వరకూ తెలుగు సినిమా అంటే కేవలం రీజనల్ మార్కెట్ కే సొంతం. తెలుగు సినిమాకు ఇతర భాషల్లో ఆదరణ అంతంత మాత్రమే. తెలుగు కంటెంట్ ఇతర భాషల్లో అనువాదమై సక్సెస్ అవ్వడం కంటే? రీమేక్ రూపంలో తెలుగు సినిమాలు సక్సెస్ సాధించేవి. అలా తెలుగు సినిమా అంటే పర భాషలో కాస్త చిన్న చూపు వైనం కనిపించేది. కొన్ని దశాబ్ధాల పాటు తెలుగు సినిమాకు ఈ రకమైన దోపీడికి గురైంది.
సరిగ్గా అదే సమయంలో రిలీజ్ అయిన `బాహుబలి ది బిగినింగ్` తో ఏకంగా ఇండియన్ సినిమాకే తెలుగు తలమానికంగా నిలిచింది. ఒక్క విజయంతో దేశమే తెలుగు చిత్ర పరిశ్రమ వైపు చూసింది. రాజమౌళి ఘన కీర్తి విశ్వ వ్యాప్తమైంది. ఈ సినిమా విడుదలై (10 జులై 2015) నేటికి సరిగ్గా దశాబ్దం పూర్తయింది. ఈ సందర్భంగా ఒక్కసారి బాహుబలి ది బిగినింగ్ విశేషాల్లోకి వెళ్తే... బాహుబలి సక్సెస్ తోనే పాన్-ఇండియా సినిమాల ఆవిర్భావానికి దారితీసింది. రాజమౌళిని అంతర్జాతీయ సినిమా పటంలో నిలిపింది.
ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, సత్యరాజ్ , నాజర్, రమ్యకృష్ణ , ప్రభాకర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా తెలుగు సినిమాకు ఓ కొత్త రూపును తీసుకొచ్చింది. స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ కథకు తన యుడు రాజమౌళి అద్భుతమైన దృశ్యరూపాన్ని ఇచ్చి ఓ గొప్ప చిత్రంగా అంతర్జాతీయ స్థాయికి తెలుగు సినిమాను తీసుకెళ్లారు. అద్భుతమైన మాహిష్మతి సామ్రాజ్యం సెట్లు..కాలకేయ సామ్రజ్యం తో ప్రేక్షకుల్ని ఓ కొత్త వరల్డ్ లోకి తీసుకెళ్లారు. అప్పటివరకూ రొటీన్ కమర్శియల్ చిత్రాలకే పరిమితమైన తెలుగు సిని మాకు బాహుబలితో ఓ కొత్త రూపాన్ని అందించారు. ప్రేక్షకుల్ని మంత్రముగ్దుల్ని చేసారు. అమరేంద్ర, మహేంద్ర బాహుబలిగా ప్రభాస్, భల్లాలదేవగా రానా , శివగామిగా రమ్య కృష్ణ, కట్టప్పగా సత్యరాజ్ గొప్ప నటనతో ఆ పాత్రలకే వన్నె తీసుకొచ్చారు.
వాస్తవానికి ఈ పాత్రలకు.. భల్లాలదేవ పాత్రకు `అక్వామాన్` ఫేమ్ జాసన్ మోమోవాను, శివగామి పాత్రకు శ్రీదేవిని, కట్టప్ప పాత్రలకు సంజయ్ దత్‌ను తీసుకో వాలనుకున్నారు. కానీ వాళ్లు కుదరకపోవడంతో కొత్త నటులు వచ్చా రు. అలా జరగడమే `బాహబలి`కి అతి పెద్ద మంచిగా జరిగింది. ఈసినిమా కోసమే ప్రభాస్ ఐదేళ్లు కేటాయించారు. ఎన్నో అవకాశాలు వచ్చినా బాహుబలి లాంటి పాత్రలు జీవితంలో ఒక్కసారి మాత్రమే వస్తాయని కట్టుబడి పనిచేసారు. దర్శకుడు రాజమౌళిని అంతే నమ్మి పనిచేసి గొప్ప సక్సెస్ అందుకున్నారు. పాత్రల కోసం రానా, ప్రభాస్, అనుష్క లు ఎంతో కష్టపడ్డారు. పాత్రల కోసం బరువు తగ్గడం. .పెరగడం అంటే చిన్న విషయం కాదు. ఎంతో శ్రమిస్తే తప్ప సాధ్యం కాదు. ఆ విషయంలో ముగ్గురు ఎంతో కమిట్ మెంట్ తో పనిచేసారు.
ఈ సినిమా కోసం ప్రభాస్ తన ఇంట్లో రూ. 1.5 కోట్ల విలువైన జిమ్‌ను ఏర్పాటు చేసుకున్నారు. అలాగే కాలకేయ -అతని రాజవంశం ప్రజలు మాట్లాడే కిలికి భాష సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. ఈ భాషను ప్రముఖ తమిళ రచయిత , గేయ రచయిత మధన్ కార్కీ కనుగొన్నారు. ఈ భాషకు వ్యాకరణ నియమాలను కూడా పెట్టారు. ఇందులో దాదాపు 800 పదాలు ఉన్నాయని పేర్కొనడం విశేషం. భారతదేశంలో ఒక సినిమా కోసం ఒక భాషను సృష్టించడం అన్నది ఇదే తొలిసారి. 25 కోట్ల వ్యయంతో మాహిష్మతి సెట్ ను హైదరా బాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో 20 ఎకరాల్లో నిర్మించారు. ఈ సెట్ ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక ప్రధాన పర్యాటక ఆకర్షణగా మారింది.
అలాగే విఎఫ్ ఎక్స్ పనుల కోసం నిర్మాతలు 85 కోట్లకు పైగా ఖర్చు చేశారు. దాదాపు 15 విఎఫ్ ఎక్స్ స్టూడియోల నుండి 800 మందికి బాహుబలి కోసం పని చేశారు. ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ - అతని బృందం బాహుబలి కోసం 20,000 ఆయుధాలను రూపొందించారు. కవచాల నుండి, విల్లులు , బాణాలు , ఇతర కత్తుల వరకు ప్రత్యేకంగా తయారు చేసారు. `బాహుబలి ది బిగినింగ్` బడ్జెట్ మొత్తం 200 కోట్లు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 650 కోట్లకు పైగా వసూలు చేసింది.
లండన్‌లోని ప్రతిష్టాత్మక రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో ప్రదర్శించ బడిన తొలి ఆంగ్లేతర చిత్రం కూడా ఇదే. అలాగే కేరళలోని 50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో బాహుబలి ప్రత్యేక పోస్టర్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఇది గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లోకి ఎక్కింది. ఇంకా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవా ర్డులు...రివార్డులు సైతం బాహుబలి పేరిట ఉన్నాయి.
