బాహుబలి రీరిలీజ్.. తెలివైన ప్లాన్ వేసిన నిర్మాతలు
బాహుబలి నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా వర్క్స్ దీనికి సంబంధించిన పనులను ఆల్రెడీ మొదలుపెట్టేసిందని సమాచారం.
By: Tupaki Desk | 6 Jun 2025 1:42 PM ISTకొన్ని సంవత్సరాలుగా టాలీవుడ్ లో రీరిలీజుల ట్రెండ్ బాగా ఎక్కువైపోయింది. హిట్టూ, ఫ్లాపుతో సంబంధం లేకుండా సినిమాలను రీరిలీజ్ చేస్తున్నారు. ఆడియన్స్ కూడా ఈ ట్రెండ్ ను బాగా ఎంజాయ్ చేస్తూ కొత్త సినిమాలను మించి హంగామా చేస్తున్నారు. రీసెంట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్లాప్ సినిమా ఖలేజా రీరిలీజ్ అయిన సంగతి తెలిసిందే.
ఆ సినిమా సుమారు రూ.10 కోట్ల కలెక్షన్లను అందుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పటికీ ఖలేజా థియేటర్లలో ఆడుతుంది. ఖలేజా కంటే ముందుగా వచ్చిన ప్రభాస్ వర్షం సినిమాకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. వీటన్నింటినీ చూసి టాలీవుడ్ లో మరిన్ని రీరిలీజ్ లను ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు. అందులో భాగంగానే బాహుబలి సినిమాను కూడా రీరిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
బాహుబలి నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా వర్క్స్ దీనికి సంబంధించిన పనులను ఆల్రెడీ మొదలుపెట్టేసిందని సమాచారం. అయితే బాహుబలి రీరిలీజ్ లో ఓ పెద్ద ట్విస్టు అందరినీ ఎగ్జైట్ అయ్యేలా చేస్తుంది. బాహుబలి సినిమా రెండు భాగాలుగా వచ్చిన సంగతి తెలిసిందే. బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి: ది కంక్లూజన్ పేరుతో రాగా రెండు సినిమాలూ ఒకదాన్ని మించి మరొకటి హిట్లుగా నిలిచాయి.
ఇందులో ఒక సినిమాను రీరిలీజ్ చేసి మరో సినిమాను రీరిలీజ్ చేయకపోతే ఆడియన్స్ కు సినిమా చూసిన ఎగ్జైట్‌మెంట్ ఉండదు. అలా అని రెండు సినిమాలనూ రీరిలీజ్ చేస్తే ఆడియన్స్ చూస్తారో లేదో అని అనుమానం కూడా. ఇక్కడే బాహుబలి నిర్మాతలు తెలివిగా ఆలోచించి ఓ పక్కా ప్లాన్ వేశారు. బాహుబలి రెండు పార్టుల్లోని అనవసర సీన్స్ ను తీసేసి, బాగా ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ ను కలిపి సినిమాను ఓ భాగంగానే రిలీజ్ చేయాలని చూస్తున్నారట. ఆల్రెడీ దీని కోసం ఎడిటింగ్ వర్క్స్ ను కూడా మొదలుపెట్టారని అంటున్నారు. ఈ వార్తలు నిజమైతే బాహుబలిని ఒకే కథగా చూడాలని చాలా మంది ఈ కారణంతో థియేటర్లకు వచ్చే అవకాశముంది. రీరిలీజుల్లో కూడా బాహుబలి ట్రెండ్ సృష్టించడం ఖాయం.
