Begin typing your search above and press return to search.

#బాహుబ‌లి.. అప్పుడే ప‌దేళ్ల‌యిందా?

ఇక ఈ ద‌శాబ్ధ కాలంలో బాహుబ‌లి సినిమా గురించి ప్ర‌పంచ‌వ్యాప్తంగా గొప్ప చ‌ర్చ సాగింది. ఇది భార‌తీయ సినిమా ద‌శ, దిశ‌ను మార్చేసిన మాస్ట‌ర్ పీస్‌గా ప్ర‌పంచ సినీచ‌రిత్ర‌లో నిలిచింది.

By:  Tupaki Desk   |   29 April 2025 9:53 AM IST
Bahubali Re Release
X

భార‌తీయ సినిమా చ‌రిత్ర‌లో ఎన్నో క్లాసిక్ సినిమాలు తెర‌కెక్కాయి. వాటిలో టాలీవుడ్ నుంచి పాతాళ భైర‌వి, మాయా బ‌జార్, బాహుబ‌లి అని చెప్పుకోద‌గ్గ సినిమాలు ఉన్నాయి. ఎంపిక చేయ‌దగిన‌ చాలా క్లాసిక్స్ తెలుగు చిత్ర‌సీమ‌లో తెర‌కెక్కినా కానీ, ఈ డికేడ్ లో బాహుబ‌లి విస్మ‌రించ‌లేనిది. క్లాసిక్ డేలో పాతాళ భైర‌వి, మాయా బ‌జార్ చిత్రాలు ప్ర‌పంచ‌స్థాయిలో పేరెన్నిక గ‌న్న చిత్రాలుగా గుర్తింపును తెచ్చుకున్నారు. ఇక ఈ ద‌శాబ్ధ కాలంలో బాహుబ‌లి సినిమా గురించి ప్ర‌పంచ‌వ్యాప్తంగా గొప్ప చ‌ర్చ సాగింది. ఇది భార‌తీయ సినిమా ద‌శ, దిశ‌ను మార్చేసిన మాస్ట‌ర్ పీస్‌గా ప్ర‌పంచ సినీచ‌రిత్ర‌లో నిలిచింది. దేశీ సినిమా పాన్ ఇండియన్ మార్కెట్లో స‌త్తా చాట‌డానికి అవ‌స‌ర‌మైన బ‌ల‌మైన‌ పునాదిని వేసింది బాహుబ‌లి. వంద కోట్లు అనే మాట‌ను మ‌రిపించి 500 కోట్లు 600 కోట్లు అంటూ రికార్డుల్ని వేటాడిన సినిమాగా బాహుబ‌లి ఒక చ‌రిత్ర‌గా మారింది.

ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి- ఆర్కా మీడియాల‌ అసాధార‌ణ‌మైన ముందు చూపు, దార్శ‌నిక ప్ర‌చార శైలి, స్టార్ కాస్టింగ్ పెర్ఫామెన్సెస్, భారీ యాక్ష‌న్ పార్ట్, వీఎఫ్ఎక్స్ స‌హా ప్ర‌తిదీ బాహుబ‌లిని ప్ర‌పంచ వేదిక‌పై క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ గా నిల‌బెట్టాయి. ఈ సినిమాలో న‌టించిన ప్ర‌భాస్, రానా, స‌త్య‌రాజ్, అనుష్క‌, ర‌మ్య‌కృష్ణ‌, త‌మ‌న్నా వంటి న‌టీన‌టుల‌కు ప్ర‌పంచ‌వ్యాప్త గుర్తింపు ద‌క్కింది. ఆస‌క్తిక‌రంగా బాహుబ‌లి అనే అంకానికి భీజం ప‌డి ఈ ఏడాది జూన్ నాటికి ప‌దేళ్లు పూర్త‌వుతోంది. ఈ సంద‌ర్భంగా ఈ మాస్ట‌ర్ పీస్ ని తిరిగి థియేట‌ర్ల‌లో రీరిలీజ్ చేస్తుండ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తోంది.

పెద్ద స్క్రీన్ల‌లో బాహుబ‌లి ఫ్యాన్స్ మ‌రోసారి సినిమాని వీక్షించి ఆస్వాధించేందుకు ఆస్కారం ఏర్ప‌డింది. బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ ఈ ప్రకటనను సోషల్ మీడియాలో షేర్ చేయ‌గా అది వైర‌ల్ గా మారింది. 2025 అక్టోబర్‌లో భారతదేశం స‌హా అంతర్జాతీయంగా ఈ చిత్రాన్ని తిరిగి విడుదల చేస్తామని శోభు త‌న ప్ర‌క‌ట‌న‌లో వెల్లడించారు. ఇది అభిమానులకు వేడుక అవుతుందని అన్నారు. అప్పుడే 10 సంవత్సరాలు అయిందా? అంటూ అభిమానులు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. నేను నిజానికి నెట్‌ఫ్లిక్స్‌లో బాహుబలి 2ని తిరిగి చూస్తున్నాను. థియేటర్‌లో బాహుబలిని చూసినప్పుడు నాకు కలిగిన ఉరుములాంటి అనుభవాన్ని గుర్తుచేసుకున్నాను.. రీరిలీజ్ కి శుభాకాంక్ష‌లు అంటూ మ‌రో అభిమాని స్పందించాడు. రాజ‌మౌళి తెర‌కెక్కించిన బాహుబ‌లి చిత్రాన్ని ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోభు యార్లగడ్డ- ప్రసాద్ దేవినేని నిర్మించారు. 10 జూలై 2015న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రంలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేయ‌గా, రానా దగ్గుబాటి ప్ర‌తినాయ‌క పాత్ర‌లో న‌టించారు. అనుష్క శెట్టి, తమన్నా, సత్యా రమ్యకృష్ణ‌ పాత్ర‌ల‌కు గొప్ప పేరొచ్చింది. సీక్వెల్ క‌థ‌తో `బాహుబలి 2: ది కన్‌క్లూజన్` 2017లో విడుదలై 1000 కోట్లు పైగా వ‌సూలు చేయ‌డం ఒక సెన్సేష‌న్.