Begin typing your search above and press return to search.

అయోధ్య‌లో లెజెండ‌రీ న‌టుడికి 100 కోట్ల భూములా?

అయోధ్యలో అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం 85,000 కోట్ల రూపాయలను కేటాయించడం విశేషం.

By:  Srikanth Kontham   |   15 July 2026 7:00 AM IST
అయోధ్య‌లో లెజెండ‌రీ న‌టుడికి 100 కోట్ల భూములా?
X

ప్రస్తుతం అయోధ్య భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రియల్ ఎస్టేట్ ప్రాంతంగా అవతరిస్తోంది. శ్రీరామ మందిర ప్రతిష్టాపన తర్వాత ఈ పుణ్యక్షేత్రం ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగానే కాకుండా పెట్టు బడిదారులకు ప్రధాన ఆకర్షణగా మారింది. ఈ మార్పులో భాగంగానే అనేకమంది సినీ ప్రముఖులు అయోధ్య లో భూములు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ అయోధ్యలో భారీగా పెట్టుబడులు పెట్టిన‌ట్లు తెలుస్తోంది. 90 నుండి 100 కోట్ల రూపాయల విలువైన భూములను అయోధ్య‌లో కొనుగోలు చేసినట్లు సమాచారం.

తన కుటుంబానికి చెందిన ఏబీ కార్ప్ లిమిటెడ్ ద్వారా దాదాపు 67 ఎకరాల భూమిని.. తన తండ్రి హరివంశరాయ్ బచ్చన్ జ్ఞాపకార్థం ఓ స్మారక చిహ్నాన్ని నిర్మించడానికి ప్రత్యేకంగా భూమిని సేకరించారుట‌. అలాగే యంగ్ హీరో రణబీర్ కపూర్ కూడా అయోధ్య రియల్ ఎస్టేట్ మార్కెట్లో అడుగుపెట్టారు. సరయు టౌన్‌షిప్‌లో 3.31 కోట్ల రూపాయల విలువైన ప్లాట్‌ను కొనుగోలు చేశారు. "రామాయణం' చిత్రంలో శ్రీరాముడి పాత్రలో నటిస్తున్న రణబీర్ ఈ పెట్టు బడిని ఒక దైవిక నిర్ణయంగా ..కుటుంబ వారసత్వంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇంకా అక్ష‌య్ కుమార్ స‌హా ప‌లువురు పేరున్న అగ్ర హీరోలు భారీ ఎత్తున స్థ‌లాలు కొనుగోలు చేసిన‌ట్లు బాలీవుడ్ మీడియాలో వార్త‌లొస్తున్నాయి.

అయోధ్యలో అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం 85,000 కోట్ల రూపాయలను కేటాయించడం విశేషం. మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం, అత్యాధునిక అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్ నిర్మాణం ఇప్పటికే పూర్తయ్యాయి. నగరం మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో యాత్రికులను ఆకర్షించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కనెక్టివిటీ పరంగా కూడా అయోధ్య సరికొత్త మైలురాళ్లను అధిగమిస్తోంది. కాన్పూర్ .. అయోధ్యలను అనుసంధానించే నమో భారత్ కారిడార్‌తో ప్రయాణ సమయం గంటన్నరకే పరిమితం కానుంది.

భవిష్యత్తులో ఢిల్లీ-అయోధ్య బుల్లెట్ రైలు సౌకర్యం అందుబాటులోకి రానుండటంతో ప్రయాణీకుల రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి. వీట‌న్నింటిని దృష్టిలో పెట్టుకుని బాలీవుడ్ సెల‌బ్రిటీలు పెద్ద ఎత్తున‌ భూములు కొనుగోలు చేస్తున్నారు. సెలబ్రిటీల రాక సాధారణ పెట్టుబడి దారులకు సానుకూల సంకేతంగా మారింది. ప్రముఖుల పెట్టుబడులు ఈ ప్రాంతంపై విశ్వాసాన్ని పెంచడమే కాకుండా భూముల ధరలను కూడా గణనీయంగా పెంచుతున్నాయి. భవిష్యత్తులో అయోధ్య పుణ్యక్షేత్రంగానే కాకుండా ఆధునిక సదుపాయాలతో కూడిన దేశంలోని అగ్రశ్రేణి నివాసిత .. వ్యాపార కేంద్రాల్లో ఒకటిగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. పర్యాటక రంగంలో వస్తున్న అనూహ్య వృద్ధి అయోధ్యను దేశ ఆర్థిక భవిష్యత్తులో కీలక కేంద్రంగా మారే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు భావిస్తున్నారు.