ట్రెండీ స్టోరి: నటీమణులపై అత్యాచార బెదిరింపులకు పాల్పడితే..!
అయేషా ఖాన్ ఈ ధోరణిని తీవ్రంగా ఖండించారు. ఇది కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన సమస్య కాదని, సమాజంలో పెరుగుతున్న ఒక ప్రమాదకరమైన ధోరణి అని ఆందోళన వ్యక్తం చేసారు.
By: Sivaji Kontham | 5 March 2026 9:00 AM ISTఇటీవల సోషల్ మీడియా వేదికగా నటీమణులపై జరుగుతున్న దాడులు, వేధింపులు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా నటి అయేషా ఖాన్ తనకు ఎదురైన చేదు అనుభవాలను షేర్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు నెట్టింట చర్చనీయాంశమయ్యాయి. ఇదే సమయంలో... నటీమణులకు అత్యాచార బెదిరింపుల వ్యవహారం చూస్తుంటే.. సమాజం ఎటు పోతోంది? అనే సందేహాలు కలుగుతున్నాయి.
సోషల్ మీడియా అనేది ఒకవైపు సెలబ్రిటీలకు అభిమానులతో కనెక్ట్ అయ్యే వేదికగా ఉంటే.. మరోవైపు అది వేధింపులకు అడ్డాగా మారుతోంది. తాజాగా నటి అయేషా ఖాన్ తనకు ఇన్‌స్టాలో ఎదురవుతున్న భయంకరమైన పరిస్థితుల గురించి నోరు విప్పారు. తన శరీర ఆకృతి కారణంగా ఒక పాట నుండి తనను తొలగించడమే కాకుండా, సోషల్ మీడియాలో తనను విపరీతంగా `సెక్సువలైజ్` (లైంగికీకరించడం) చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా, కొందరు దుండగులు తనను అత్యాచారం చేస్తామని బెదిరిస్తున్నట్టు చెప్పి అందరినీ దిగ్భ్రాంతికి గురిచేశారు.
అయేషా ఖాన్ ఈ ధోరణిని తీవ్రంగా ఖండించారు. ఇది కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన సమస్య కాదని, సమాజంలో పెరుగుతున్న ఒక ప్రమాదకరమైన ధోరణి అని ఆందోళన వ్యక్తం చేసారు. కేవలం గ్లామరస్ ఫోటోలు పెట్టినంత మాత్రాన లేదా నటి అయినంత మాత్రాన.. ఇలాంటి అసభ్యకర వ్యాఖ్యలు చేయడం లేదా ప్రాణ, మాన బెదిరింపులకు పాల్పడటం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ఈ రకమైన ఆన్‌లైన్ అబ్యూస్ బాధితుల మానసిక స్థితిని తీవ్రంగా దెబ్బతీస్తుందని సామాజిక నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు.
అయితే, ఇలాంటి వేధింపులు ఎదుర్కోవడం అయేషా ఖాన్‌కు మాత్రమే పరిమితం కాలేదు. గతంలో సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ ఊర్ఫీ జావేద్ తన విభిన్నమైన ఫ్యాషన్ సెన్స్ కారణంగా అనేకసార్లు అత్యాచార, హత్య బెదిరింపులను ఎదుర్కొన్నారు. ఆమె పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసి.. నిందితులను అరెస్ట్ చేయించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే నటి రాఖీ సావంత్, సింగర్ చిన్మయి శ్రీపాద వంటి వారు కూడా ఆన్‌లైన్ వేదికగా ఇలాంటి దారుణమైన వేధింపులను ఎదుర్కొన్నామని ధైర్యంగా బయటకు వచ్చి చెప్పారు.
సోషల్ మీడియాలో సెలబ్రిటీలపై జరిగే ఈ దాడులు ఏమాత్రం సరైనవి కావు. ఒక నటి వస్త్రధారణ లేదా ఆమె వ్యక్తిగత జీవితం ఆధారంగా ఆమె క్యారెక్టర్‌ను జడ్జ్ చేయడం.. బెదిరింపులకు దిగడం నాగరిక సమాజం లక్షణం కాదు. డిజిటల్ మాధ్యమాల్లో ఉన్న స్వేచ్ఛను ఇతరులను గౌరవించడానికి ఉపయోగించాలే తప్ప.. వారిని భయపెట్టడానికి కాదు. ఇలాంటి వేధింపులను చూస్తూ ఊరుకోవడం వల్ల నేరగాళ్లకు మరింత బలం చేకూరుతుంది. అందుకే బాధితులు ధైర్యంగా ముందుకు రావడం ముఖ్యం.
ఇలాంటి ఆన్‌లైన్ వేధింపులకు పాల్పడే వారిని శిక్షించడానికి భారతదేశంలో కఠినమైన ఐటి చట్టాలు అందుబాటులో ఉన్నాయి. ఐటి చట్టం-2000లోని సెక్షన్ 67 కింద అశ్లీల సమాచారాన్ని ప్రసారం చేయడం నేరం. అలాగే భారత శిక్షాస్మృతి (ఐపిసీ) ప్రకారం, సెక్షన్ 354డి (స్టాకింగ్), సెక్షన్ 509 (స్త్రీ గౌరవానికి భంగం కలిగించే పదాలు లేదా చేష్టలు), సెక్షన్ 506 (క్రిమినల్ బెదిరింపు) కింద కేసులు నమోదు చేయవచ్చు. సోషల్ మీడియాలో బెదిరింపులు ఎదుర్కొంటున్న వారు వెంటనే స్క్రీన్ షాట్స్ తీసి, దగ్గరలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయవచ్చు. సంబంధిత సెక్షన్ల ప్రకారం నిందితుడిని పట్టుకుని కఠినంగా శిక్షించేందుకు పోలీసులకు అవకాశం ఉంది.
మొత్తానికి సాంకేతికత పెరిగేకొద్దీ సైబర్ నేరాలు కూడా కొత్త రూపాలు దాల్చుతున్నాయి. సెలబ్రిటీలు ధైర్యంగా ఇలాంటి విషయాలను బయటపెట్టడం వల్ల సామాన్యుల్లో కూడా అవగాహన పెరుగుతుంది. చట్టం తన పని తాను చేసినా కానీ సమాజంలో, వ్యక్తుల్లో మార్పు వచ్చినప్పుడే సోషల్ మీడియా మహిళలకు సురక్షితమైన ప్రదేశంగా మారుతుంది.
