కొడుకు ఎంట్రీ.. మంచు విష్ణు ఎమోషనల్.. ఏమన్నారంటే?
మంచు అవ్రామ్ (7) కన్నప్ప మూవీలో బాల తిన్నడుగా కనిపించనున్నాడు. విష్ణు చిన్నప్పటి రోల్ ను పోషిస్తున్నాడు.
By: Tupaki Desk | 19 Jun 2025 12:48 PM ISTమంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప.. రిలీజ్ కు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. మహాకవి ధూర్జటి రాసిన శ్రీకాళహస్తీశ్వర మహత్యంలోని భక్త కన్నప్ప చరిత్రను స్ఫూర్తిగా తీసుకుని కన్నప్ప చిత్రాన్ని ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్నారు. విష్ణు కథ, స్క్రీన్ ప్లే అందించగా.. డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబు భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు.
పాన్ ఇండియా లెవెల్ లో సందడి చేయనున్న కన్నప్ప మూవీలో మంచు ఫ్యామిలీ మూడో తరం వారసులు కనిపించనున్నారు. మంచు విష్ణు కొడుకు అవ్రామ్, కుమార్తెలు అరియానా, వివియానా.. కన్నప్పతోనే తెరంగేట్రం చేస్తున్నారు. ఇప్పటికే మేకర్స్ వారికి సంబంధించిన ఫస్ట్ లుక్స్ అండ్ సాంగ్ ను రిలీజ్ చేసి ఆకట్టుకున్నారు.
మంచు అవ్రామ్ (7) కన్నప్ప మూవీలో బాల తిన్నడుగా కనిపించనున్నాడు. విష్ణు చిన్నప్పటి రోల్ ను పోషిస్తున్నాడు. అయితే అవ్రామ్ ఎంట్రీపై ఇప్పుడు మంచు విష్ణు ఎమోషనల్ అయ్యారు. అవ్రామ్ తెరంగేట్రంపై ఆనందాన్ని వ్యక్తం చేశారు. కన్నప్ప మూవీ తనకు చాలా స్పెషల్ అని చెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
"కన్నప్పతో నా కొడుకు అవ్రామ్ తెరంగేట్రం చేస్తున్నాడు. అతుడు మూవీ సెట్స్ లోకి రావడం.. మేకప్ వేసుకుని కెమెరా ఎదుట నిల్చోవడం.. ఆ తర్వాత డైలాగ్స్ చెప్పడం.. అలా ప్రతి మూమెంట్ కూడా నా జీవితంలో భావోద్వేగభరితమైనదే. ఒకప్పుడు కలలుగన్న తండ్రికి అదే వరల్డ్ లోకి కొడుకు అడుగుపెట్టడం ఎంతో ఆనందంగా ఉంది" అని విష్ణు తెలిపారు.
"అయితే ఆ ఆనందానికి ఏది కూడా సాటి రాదు. ఇది అవ్రామ్ కేవలం సినీ ఎంట్రీ కాదు.. జీవితాంతం గుర్తుండిపోయే ఒక మధుర జ్ఞాపకం. నాపై చూపించిన ప్రేమాభిమానాలను ఇప్పుడు నా కుమారుడిపైన కూడా చూపిస్తారని నేను భావిస్తున్నా. అవ్రామ్ సినీ జర్నీ కన్నప్పతో మొదలైంది" అంటూ మంచు విష్ణు రాసుకొచ్చిన పోస్ట్ వైరల్ గా మారింది.
అయితే విష్ణు.. అవ్రామ్ బిహైండ్ ది సీన్స్ వీడియో కూడా పోస్ట్ చేశారు. అందులో అవ్రామ్ చాలా యాక్టివ్ గా కనిపించాడు. సెట్స్ లో సందడి చేశాడు. తల్లితో సెట్స్ కు వస్తూ.. తండ్రితో మాట్లాడుతూ.. కాస్ట్యూమ్స్ వేసుకుంటూ.. డైలాగ్స్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. తాతయ్య మోహన్ బాబు దగ్గర ఆశీస్సులు తీసుకోగా.. ఆయన ఆత్మీయంగా ముద్దు ఇచ్చారు. యాక్టింగ్ పై అతడికి ఫుల్ ఇంట్రెస్ట్ ఉన్నట్లు క్లియర్ గా తెలుస్తోంది.
