నేను దేనినీ తేలిగ్గా తీసుకోను: అవికా గోర్
అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన `ఉయ్యాల జంపాల` చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైంది అవికా గోర్.
By: Tupaki Desk | 9 Jun 2025 5:00 AM ISTఅన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన `ఉయ్యాల జంపాల` చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైంది అవికా గోర్. అంతకుముందు `బాలికా వధు` సీరియల్ ద్వారా తెలుగు వారికి సుపరిచితమైన ఈ బ్యూటీ పెద్ద తెరపై కొన్ని వరుస ఫ్లాపులను ఎదుర్కొంది. దిల్ రాజు నిర్మించిన `థాంక్యూ `లో నాగచైతన్య సరసన ఒక నాయికగా నటించింది. విక్రమ్ కె ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కళ్యాణ్ దేవ్ సరసనా అవిక నటించింది.
`అమరన్ ఇన్ ది సిటీ - చాప్టర్ 1` చిత్రంలోనూ అవికా గోర్ నటనకు పేరొచ్చింది. ఇప్పటికే బాలీవుడ్ లో 1920 సిరీస్ చిత్రాల్లో నటించింది. హర్రర్ చిత్రాల మాస్టర్ విక్రమ్ భట్ దర్శకత్వం వహించిన `బ్లడీ ఇష్క్`లోను అవికాగోర్ కథానాయికగా నటించింది.
ఇటీవల ఓ అవార్డుల వేడుకల్లో అవిక సత్కారం అందుకుంది. ఈ సమయంలో ఎంతో ఉద్వేగానికి గురైంది. బాలికా వధుతో మొదలైన నా కెరీర్ ఈ స్థాయికి ఎదగడం నిజంగా నా అదృష్టం అని అంది. ప్రేక్షకులు ఈ రోజు ఈ స్థాయినిచ్చారని, దీనికి కృతజ్ఞతలు తెలిపింది.
అధికారిక శిక్షణ లేదా చిత్ర పరిశ్రమ నేపథ్యం లేకుండానే అవిక ఈ స్థాయిని అందుకుంది. కనీసం తనకు ఇంటి నుంచి కూడా సరైన మద్ధతు లేదు. అయినా నటిగా ఒక స్థాయికి ఎదిగినందుకు ఆనందంగా ఉందని తెలిపింది. మంచి పాత్రలు వచ్చినప్పుడు బాధ్యతగా నటించి విజయం అందుకునేలా చేయడం ఆర్టిస్టు బాధ్యత అని కూడా అవిక అంది. OTT లేదా టెలివిజన్ లేదా సినిమా ఏదైనా నేను ఒకే విధంగా పని చేస్తానని తెలిపింది. నేను దేనినీ తేలికగా తీసుకోలేదు.. అని అంది. సవాళ్లను ఎదుర్కొని ఒడిదుడుకులను అధిగమించి అనుకున్న స్థాయికి చేరతానని శపథం చేసింది.
