'అవతార్ 3' సూపర్ అప్‌డేట్ వచ్చేసింది
అవతార్ 2 తో పాటు అవతార్ 3 ని సైతం జేమ్స్ కామెరూన్ ప్రకటించిన విషయం తెల్సిందే. 2022లో అవతార్ 2 రాగా, 2025 లో అవతార్ 3 రానున్నట్లు ప్రకటించారు.
By: Tupaki Desk | 22 July 2025 1:49 PM ISTప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులను కట్టిపడేయగల సత్తా ఉన్న దర్శకుడు జేమ్స్ కామెరూన్. ఆయన దర్శకత్వంలో 2009 సంవత్సరంలో వచ్చిన అవతార్ సినిమాను అప్పట్లో అద్భుతం, మహా అద్భుతం అనుకోవడం జరిగింది. 2022లో అంతకు మించి అన్నట్లుగా అవతార్ 2 తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆయన అవతార్ కోసం సృష్టించిన ప్రపంచంను ప్రేక్షకులు మరోసారి ఆస్వాదించారు. మరో వరల్డ్ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ విజయాన్ని అవతార్ 2 దక్కించుకున్న విషయం తెల్సిందే. అవతార్ 2 తో పాటు అవతార్ 3 ని సైతం జేమ్స్ కామెరూన్ ప్రకటించిన విషయం తెల్సిందే. 2022లో అవతార్ 2 రాగా, 2025 లో అవతార్ 3 రానున్నట్లు ప్రకటించారు.
అవతార్ 2 ను 2022, డిసెంబర్ 16న విడుదల చేయడం జరిగింది. అవతార్ 3 సినిమాను 2025, డిసెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఈ విషయాన్ని మరోసారి అధికారికంగా ప్రకటిస్తూ అవతార్ 3 కొత్త పోస్టర్‌ను దర్శకుడు జేమ్స్ కామెరూన్ విడుదల చేశారు. అవతార్ సినిమా ట్రైలర్ ను ఈనెలలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. అవతార్ 3 సినిమా యొక్క మొదటి ట్రైలర్‌ను హాలీవుడ్ మూవీ 'ది ఫెంటాస్టిక్ ఫోర్ : ఫస్ట్ స్టెప్స్' సినిమాతో రిలీజ్ చేయబోతున్నారు. ట్రైలర్ ను ఈ సినిమా స్క్రీనింగ్‌కు ముందు ప్రదర్శించబోతున్నట్లుగా హాలీవుడ్ వర్గాల ద్వారా తెలుస్తోంది. అవతార్ 3 ట్రైలర్ అంచనాలను మించి ఉంటుందని తెలుస్తోంది.
జేమ్స్ కామెరూన్ అవతార్ 2 ను వాటర్ ప్రపంచంలో చూపించడం జరిగింది. నీటిలో ఎక్కువగా సన్నివేశాలు ఉన్నాయి, నీటి గురించి సన్నివేశాలు ఉన్నాయి. అయితే అవతార్ 3 లో మాత్రం అగ్నికి సంబంధించిన సన్నివేశాలు ఉండబోతున్నాయి. అవతార్ : ఫైర్ అండ్ యాష్ అనే టైటిల్ తో రాబోతున్న ఈ మూడో పార్ట్ ను ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్‌లలో విడుదల చేయడం కోసం ట్రైలర్‌ను ముందస్తుగానే విడుదల చేసి ప్రమోషన్ హడావిడి మొదలు పెట్టబోతున్నారు. సినిమా విడుదలకు అటు ఇటుగా అయిదు నెలల సమయం మాత్రమే ఉంది. కనుక ఆలస్యం చేయకుండా ట్రైలర్ 1 ను విడుదల చేసే ఉద్దేశంతో మేకర్స్ ఉన్నారట.
అవతార్‌ను గతంలో మాదిరిగానే ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్‌లలో విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇప్పటి వరకు ఏ హాలీవుడ్ సినిమా, ఇతర భాషల సినిమా విడుదల కానన్ని దేశాల్లో ఈ సినిమాను విడుదల చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు నమోదు అయిన రికార్డులు అన్నింటిని కూడా అవతార్ 3 సినిమా బ్రేక్ చేసే విధంగా సినిమా ఉంటుంది అనే విశ్వాసంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ఊహకు సైతం అందని ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకు వెళ్లి వినోదాన్ని అందించే సత్తా ఉన్న దర్శకుడు జేమ్స్ కామెరూన్. అందుకే ఆయన నుంచి వచ్చే ప్రతి ప్రకటన కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాదిలో అతి పెద్ద మూవీగా అవతార్ 3 నిలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
