అవతార్ 3.. ట్రోలర్స్‌కి సౌండ్ లేకుండా చేసిన కామెరూన్
అవతార్ - అవతార్ 2 చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా అసాధారణ వసూళ్లను సాధించిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 29 Nov 2025 9:36 AM ISTఅవతార్ - అవతార్ 2 చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా అసాధారణ వసూళ్లను సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలను తెరకెక్కించిన మేధావి షష్ఠిపూర్తి పూర్తి చేసుకున్న ఒక వృద్ధ దర్శకనిర్మాత. అతడు ఎవరో పరిచయం అవసరం లేదు. ది గ్రేట్ జేమ్స్ కామెరూన్. ఇప్పుడు ఆయన వయసు 71. ఈ ఏజ్ లో కూడా అతడు చేస్తున్న ఛాలెంజ్‌లు చూస్తుంటే ఆశ్చర్యపోకుండా ఉండలేం. అతడు అవతార్ లను సృష్టించాడు. పండోరాను సృజించాడు. పండోరా గ్రహంపై అవతార్ ల సంచారాన్ని, అక్కడ అందమైన ప్రకృతిని, ఐవాను, మానవులతో అవతార్ ల భీకర పోరాటాలను చూపించాడు. భూమ్మీద నుంచి వెళ్లే మనిషి ఈ ప్రకృతిని ఎలా తగులబెడతాడు, ఈ ప్రపంచ వినాశనానికి ఎలా కారకుడు అవుతాడో అతడు ఊహించిన విధానానికి ప్రజలు సాహో అన్నారు. రెండో భాగంలో నీటిపైనా భూమిపైనా పోరాటాలను అతడు చూపించాడు. మెరైన్ బయాలజీ అని సింపుల్ గా విమర్శించిన వాళ్లకు కూడా బాక్సాఫీస్ కలెక్షన్లు చూసి ఔరా అనేలా చేసాయి. కామెరూన్ అద్భుతాలు చేస్తున్నాడని, అతడు చూపించే ఒక అందమైన మాయా ప్రపంచాన్ని చూడాలని ఆరాధించే గొప్ప ఫాలోవర్స్ అతడికి చాలు.
టైటానిక్, డార్క్ నైట్, ప్రిడేటర్స్, అవతార్ 1, అవతార్ 2 అతడి సృష్టికి అంతం లేదు. ఇప్పుడు అవతార్ 3 ని కామెరూన్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన అభిమానులు, ప్రజల కోసం విడుదలకు తెస్తున్నాడు. డిసెంబర్ 19న ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా విడుదలవుతోంది. అవతార్ 3 భారతదేశంలోను 500కోట్లు అంతకుమించి కొల్లగొడుతుందని అంచనా వేస్తున్నారు. ముందస్తు బుకింగుల జోరు అంతగా లేకపోయినా, అవతార్ ఫ్రాంఛైజీకి ఉన్న క్రేజ్ దృష్ట్యా ఇది ప్రపంచవ్యాప్తంగా అద్భుత వసూళ్లను సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. అవతార్ 1, అవతార్ 2 వసూళ్లు 5.5 బిలియన్లు. అంతకుమించి ఈ ఒక్క చిత్రం (అవతార్ 3- ఫైర్ అండ్ యాష్) వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు.
అయితే ఈ సినిమాపై నెటిజనులు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అవతార్ ఫ్రాంఛైజీ అలసట కనిపిస్తోందని, అది రెండో భాగం తేలిపోయేలా చేసిందని కొందరు విమర్శించారు. అవతార్ 2ని ఒకసారి చూడగలం. మళ్లీ మళ్లీ చూడలేమని కొందరు విమర్శించారు. అయితే అవతార్ సినిమాలు విజువల్ అద్భుతాలు. అందువల్ల ఈ ఫ్రాంఛైజీ ఎప్పటికీ కొనసాగాలని కోరుకున్న అభిమానులు లేకపోలేదు. కొందరు అవతార్ 3, అవతార్ 4, అవతార్ 5 ఇవ్వాలని కామెరూన్ ని అడగలేదని వ్యంగ్యంగా స్పందించారు. అవతార్ ఫ్రాంఛైజీ కంటే వేరొక గ్రహాంతర వాసుల కథపై కామెరూన్ దృష్టి సారించాలని కొందరు సలహాలు ఇచ్చేసారు.
అయితే అన్ని ట్రోల్స్ కు కామెరూన్ ఇచ్చిన ఒకే ఒక్క సమాధానం సౌండ్ లేకుండా చేసింది. ఒకవేళ అవతార్ - ఫైర్ అండ్ యాష్ (అవతార్ 3 ) విజయం సాధించకపోతే తాను ఈ ఫ్రాంఛైజీని వెంటనే మూసేస్తానని ప్రకటించారు. అంతేకాదు అవతార్ 1, అవతార్ 2 ని మించి అవతార్ 3 ఘనవిజయం సాధిస్తుందని నమ్మకాన్ని వ్యక్తం చేసారు. పెరిగిన వీఎఫ్ఎక్స్ ఖర్చులు, నిర్మాణ ఖర్చుల దృష్ట్యా మొదటి రెండు భాగాలను మించి వసూలు చేయాల్సి ఉందని, పెరిగిన ఖర్చులు తనపై ఒత్తిడి పెంచాయని కామెరూన్ ఇంతకుముందు వ్యాఖ్యానించారు. దానికి తగ్గట్టే ఇప్పుడు మారిన డాలర్ విలువతో అవతార్ 3 మరింత వృద్ధిని బాక్సాఫీస్ వద్ద నమోదు చేస్తుందని అభిమానులు నమ్ముతున్నారు. కేవలం మరో 20 రోజులు వేచి చూస్తే చాలు .. అవతార్ 3 రికార్డుల గురించి మాట్లాడుకోవడానికి.. సరికొత్త పండోరా గ్రహంపై విహరించడానికి....71 ఏళ్ల ముసలోడి సత్తా ఎంతో తేలడానికి....
