భారీ ప్లాన్స్... అట్లీ ఇవి కూడా చేస్తాడా?
ప్రస్తుతం అల్లు అర్జున్‌తో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్న అట్లీ త్వరలోనే మరో ప్రాజెక్ట్‌ను ప్రారంభించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
By: Tupaki Desk | 12 July 2025 4:10 PM ISTసౌత్ స్టార్ దర్శకుల్లో రాజమౌళి తర్వాత ముందు వరుసలో అట్లీ ఉంటాడు అనడంలో సందేహం లేదు. ఆయన దర్శకత్వంలో వచ్చిన జవాన్ సినిమా వెయ్యి కోట్లకు మించి వసూళ్లు సాధించడంతో పాటు, బాలీవుడ్‌కి జీవం పోసినట్లుగా హిట్ అయింది. అందుకే అట్లీ దర్శకత్వంలో సినిమాలు చేసేందుకు బాలీవుడ్ స్టార్స్ క్యూ కడుతున్నారు. అంతే కాకుండా సౌత్ స్టార్ హీరోలు, సూపర్ స్టార్‌లు సైతం ఈయన దర్శకత్వంలో సినిమాలు చేసేందుకు గాను ఆసక్తిగా ఉన్నారు. ఈ సమయంలో అట్లీ సౌత్‌లో సినిమాను మొదలు పెట్టాడు. అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో సినిమా కన్ఫర్మ్ అయింది. ఇప్పటికే 'AA22XA6' సినిమా షూటింగ్ ప్రారంభం అయింది.
ప్రస్తుతం అల్లు అర్జున్‌తో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్న అట్లీ త్వరలోనే మరో ప్రాజెక్ట్‌ను ప్రారంభించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఆ ప్రాజెక్ట్ సినిమా కాదని, అది ఒక యాడ్ ఫిల్మ్ అని తెలుస్తోంది. నిమిషం రెండు నిమిషాల నిడివితో కాకుండా దాదాపు అయిదు నిమిషాల నిడివి ఉండే విధంగా ఆ యాడ్ ఫిల్మ్ ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు అధికారికంగా ఆ యాడ్ ఫిల్మ్ గురించి ఎలాంటి సమాచారం లేదు. కానీ ఆ యాడ్ ఫిల్మ్‌లో బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ కనిపించబోతున్నాడు. ఆయన ఈ యాడ్ కోసం యాక్షన్ సన్నివేశాల్లోనూ కనిపిస్తాడని, కామెడీ, యాక్షన్ ప్రధానంగా ఈ కమర్షియల్ యాడ్ ఫిల్మ్ ను అట్లీ రూపొందించబోతున్నాడట.
రణ్వీర్ సింగ్‌తో పాటు ఈ యాడ్ ఫిల్మ్ లో కిస్సిక్ బ్యూటీ శ్రీలీల కనిపించబోతుంది. పుష్ప 2 సినిమాలోని ఆ ఐటెం సాంగ్ తర్వాత శ్రీలీల రేంజ్ అమాంతం పెరిగింది. అందుకే ఈ యాడ్‌లో రణ్వీర్ సింగ్‌కు జోడీగా శ్రీలీలను ఎంపిక చేశారని వార్తలు వస్తున్నాయి. రణ్వీర్ సింగ్, శ్రీలీల కాంబోలో షాట్స్ ఉంటాయి, ఒక యాడ్ ఫిల్మ్స్ కోసం ఇంత భారీ ప్లాన్స్ చేయడం ఇదే మొదటి సారి అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. ఈ యాడ్ ఫిల్మ్ లో ఈ మధ్య కాలంలో మోస్ట్ హ్యాపెనింగ్ స్టార్‌గా నిలిచిన బాబీ డియోల్ సైతం కనిపించబోతున్నాడు. ఈ మధ్య కాలంలో ఈయనకు స్టైలిష్ యాక్టర్, స్టైలిష్ విలన్ అనే పేర్లను అభిమానులు సోషల్ మీడియాలో పెట్టుకుని మాట్లాడుతున్న విషయం తెల్సిందే.
ఇంత భారీ స్టార్ కాస్ట్ ఉండటంతో పాటు, ఇండియాస్ టాప్ దర్శకుల్లో ఒకరు అయిన అట్లీ ఈ యాడ్ ఫిల్మ్ కి డైరెక్షన్ చేస్తున్న నేపథ్యంలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. తక్కువ సమయంలోనే ఈ యాడ్ ఫిల్మ్ ను రూపొందించేందుకు గాను ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను చేస్తున్నారు. ప్రస్తుతం 'AA22XA6' షూటింగ్‌లో ఉన్న అట్లీ అతి త్వరలోనే ఆ యాడ్ షూటింగ్‌కు హాజరు కాబోతున్నాడు. వచ్చే నెలలో ప్రేక్షకులు ఆ యాడ్ ఫిల్మ్ ను టీవీల్లో చూసే అవకాశాలు ఉన్నాయి. రణ్వీర్ సింగ్ వంటి స్టార్‌తో శ్రీలీలకు నటించే అవకాశం దక్కడంతో ముందు ముందు హీరోయిన్‌గా బాలీవుడ్‌లో మరిన్ని సినిమాలు చేస్తుందేమో చూడాలి అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
