స్టార్ డైరెక్టర్స్ ప్రౌడ్ మూవ్‌మెంట్!
ఎదిగిన కొడుకు ప్రయోజకుడు అయినప్పుడు ఆ తండ్రి పడే ఆనందం మాటల్లో వర్ణించలేం. అదే ప్రౌడ్ మూవ్‌మెంట్.
By: Tupaki Desk | 4 Jan 2026 12:45 PM ISTఎదిగిన కొడుకు ప్రయోజకుడు అయినప్పుడు ఆ తండ్రి పడే ఆనందం మాటల్లో వర్ణించలేం. అదే ప్రౌడ్ మూవ్‌మెంట్. ఇదే తరహాలో ఆనందాన్ని, ప్రౌడ్ మూవ్‌మెంట్‌ని ఎంజాయ్ చేస్తున్న స్టార్ డైరెక్టర్స్ ఇండస్ట్రీలో ఉన్నారు. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు నుంచి `మళ్లీ మళ్లీ ఇది రాని రోజు` ఫేమ్ క్రాంతి మాధవ్ వంటి దర్శకుల వరకు ఇప్పుడు ఇలాంటి ప్రౌడ్ మూవ్‌మెంట్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. అమ అసిస్టెంట్‌లు దేశ వ్యాప్తంగా సాధిస్తున్న విజయాలకు సంతోషిస్తున్నారు.
హ్యాట్సాఫ్ రాజమౌళి...
లెజెండరీ డైరెక్టర్ దాసరి నారాయణ రావు వద్ద దర్శకత్వ శాఖలో అసిస్టెంట్‌లుగా, అసోసియేట్‌లు వర్క్ చేసిన వారు చాలా మందే డైరెక్టర్లుగా పరిచయమై ఇండస్ట్రీలో దర్శకులుగా మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు వద్ద అసిస్టెంట్ డైరెక్టర్స్‌గా వర్క్ చేసి దర్శకులుగా అరంగేట్రం చేసిన వాళ్లలో జక్కన్న డైరెక్టర్‌గా పరిచయం కావడం..`బాహుబలి`తో పాన్ ఇండియా డైరెక్టర్‌గా పేరు తెచ్చుకుని తెలుగు సినిమా స్వరూపాన్నే సమూలంగా మార్చేయడం తెలిసిందే.
తన వద్ద పని చేసిన రాజమౌళి గురువుని మించిన శిష్యుడు అయ్యాడని రాఘవేంద్రావు చాలా ప్రౌడ్‌గా ఫీలయ్యాడు. `బాహుబలి 2` ట్రైలర్ రిలీజ్ తరువాత `హ్యాట్సాఫ్ టు రాజమౌళి` అంటూ జక్కన్నపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఇది గురువుగా ఆయన ప్రౌడ్ మూవ్‌మెంట్. బి. గోపాల్, వైవీఎస్, చౌదరి, చంద్రశేఖర్ ఏలేటి వంటి దర్శకులని పరిచయం చేసినా గురువుగా తనని ప్రౌడ్‌గా ఫీలయ్యేలా జక్కన్న మాత్రమే చేయడం గమనార్హం.
గ్రేట్ మూవ్‌మెంట్...
ఫ్యాక్షన్ యాక్షన్ మూవీస్ దర్శకుడు వీవీ వినాయక్ వద్ద `దిల్` మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేసిన సుకుమార్ ఆ తరువాత `ఆర్య` మూవీతో దర్శకుడిగా మారడం, తొలి ప్రయత్నంలోనే సూపర్ హిట్ అందుకోవడం తెలిసిందే. `పుష్ప`, `పుష్ప 2` సినిమాలతో పాన్ ఇండియా డైరెక్టర్‌గా తిరుగులేని పాపులారిటీని సొంతం చేసుకున్న సుకుమార్ తన శిష్యుల్ని ఇండస్ట్రీకి అందించాడు. పాన్ ఇండియా సినిమాలతో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న సుక్కు తనలాగే తన శిష్యుల్ని కూడా తయారు చేశాడు.
సుక్కు వద్ద వర్క్ చేసి డైరెక్టర్స్‌గా పరిచయమైన వాళ్లలో బుచ్చిబాబు సానా, శ్రీకాంత్ ఓదెల దర్శకులుగా తమదైన మార్కుని చూపిస్తూ పాన్ ఇండియా సినిమాలతో ట్రెండ్ సెట్ చేస్తున్నారు. `ఉప్పెన` మూవీతో దర్శకుడిగా పరిచయమైన బుచ్చిబాబు సానా తొలి ప్రయత్నంలోనే బ్లాక్ బస్టర్ హిట్‌ని సొంతం చేసుకుని గురువుకు తగ్గ శిష్యుడు అనిపించుకున్నాడు. ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో `పెద్ది` పేరుతో భారీ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు.
ఇక రెండవ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల.. నేచురల్ స్టార్ నాని హీరోగా మాసీవ్ యాక్షన్ లవ్ డ్రామా `దసరా`ని తెరకెక్కించి గురువు సుకుమార్‌ని ఆశ్చర్యపరిచాడు. ఈ మూవీ చూసి తాను గర్వంగా ఫీలవుతున్నానని సుకుమార్ సోషల్ మీడియా వేదికగా స్పందించడం విశేషం. ప్రస్తుతం నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల `ది ప్యారడైజ్` పేరుతో పాన్ ఇండియా మూవీకి శ్రీకారం చుట్టాడు. దీనికి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.
ఇది రేర్ ఫీట్...
ఇప్పుడు ఇదే తరహాలో ప్రౌడ్ మూవ్‌మెంట్‌ని ఆస్వాదిస్తున్నారు దర్శకుడు క్రాంతి మాధవ్. `మళ్లీ మళ్లీ ఇది రాని రోజు` వంటి మూవీతో క్రాంతి మాధవ్ దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఇదే సినిమాకు ఆయన వద్ద అసిస్టెంట్‌గా వర్క్ చేసిన సందీప్‌రెడ్డి వంగ పాన్ ఇండియా డైరెక్టర్‌గా ఎదగడం తెలిసిందే. అర్జున్ రెడ్డి, కబీర్‌సింగ్, యానిమల్ వంటి సినిమాలతో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించారు. ప్రస్తుతం ప్రభాస్‌తో `స్పిరిట్` మూవీకి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.
శిష్యుడు పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్న వేళ క్రాంతి మాధవ్ కొంత విరామం తరువాత `దిల్ దియా` పేరుతో ఓ బోల్డ్ మూవీని రూపొందిస్తున్నాడు. చైతన్య రావు హీరోగా నటిస్తున్న ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ని దర్శకుడు సందీప్‌రెడ్డి వంగ రిలీజ్ చేయడం తెలిసిందే. క్రాంతి మాధవ్ శిష్యుడుగా కెరీర్ ప్రారంభించిన సందీప్‌రెడ్డి వంగ ఇప్పుడు గురువు సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ని రిలీజ్ చేయడం అనేది గురువుగా క్రాంతి మాధవ్ ప్రౌడ్ మూవ్‌మెంట్ అని అంతా కామెంట్‌లు చేస్తున్నారు. ఇది రేర్ ఫీట్ అని ప్రశంసలు కురిపిస్తున్నారు.
