Begin typing your search above and press return to search.

ఒంట‌రిత‌న‌మే సుర‌క్షితం: ఐశ్వ‌ర్య ర‌జ‌నీకాంత్

ఒంట‌రిగా ఉన్న ఐశ్వ‌ర్య తాను ఇలా ఉండ‌టాన్ని ఆస్వాధిస్తున్నాన‌ని అన్నారు. ఒంట‌రిగా ఉన్న‌ప్పుడే సుర‌క్షితంగా ఉండ‌గ‌ల‌మ‌ని న‌మ్ముతున్నాను అని వ్యాఖ్యానించారు.

By:  Tupaki Desk   |   12 Feb 2024 1:30 PM GMT
ఒంట‌రిత‌న‌మే సుర‌క్షితం: ఐశ్వ‌ర్య ర‌జ‌నీకాంత్
X

ఐశ్వర్య రజనీకాంత్ తెర‌కెక్కించిన 'లాల్ స‌లామ్' ఇటీవ‌లే విడుద‌లైంది. ఈ సినిమా ఆశించిన వ‌సూళ్లను సాధించ‌క‌పోవ‌డం నిరాశ‌ప‌రిచింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన వ్య‌క్తిగ‌త జీవితం గురించి ఓపెన‌య్యారు ఐశ్వ‌ర్య‌. త‌న భ‌ర్త‌, స్టార్ హీరో ధ‌నుష్ నుంచి విడిపోక‌పోయినా కానీ, రెండేళ్లుగా అత‌డి నుంచి దూరంగా ఉంటున్నారు. ఒంట‌రిగా ఉన్న ఐశ్వ‌ర్య తాను ఇలా ఉండ‌టాన్ని ఆస్వాధిస్తున్నాన‌ని అన్నారు. ఒంట‌రిగా ఉన్న‌ప్పుడే సుర‌క్షితంగా ఉండ‌గ‌ల‌మ‌ని న‌మ్ముతున్నాను అని వ్యాఖ్యానించారు.

ఇంత‌కుముందు లాల్ స‌లామ్ రిలీజ్ స‌మ‌యంలో ర‌జ‌నీకాంత్ తోపాటు, ధ‌నుష్ కూడా ఐశ్వ‌ర్య‌కు బెస్ట్ విషెస్ తెలిపారు. ధ‌నుష్ - ఐశ్వ‌ర్య జంట‌కు ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. ఈ ఇద్ద‌రి బ్రేక‌ప్.. ర‌జ‌నీకాంత్ కానీ ఆ కుటుంబీకుల‌కు కానీ, అభిమానుల‌కు కానీ ఇష్టం లేదు. అందువ‌ల్ల ఇంకా విడాకుల ప్రాసెస్ గురించిన ఎలాంటి చ‌ర్చా లేదు. ఆ ఇద్ద‌రూ క‌లిసి లేరు. విడిగా ఉంటున్నారు. 2004లో పెళ్లాడిన ఈ జంట 2022లో త‌మ బ్రేక‌ప్ గురించి ప్ర‌క‌టించి ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. ప్ర‌స్తుతం పిల్ల‌ల‌కు స‌హ త‌ల్లిదండ్రులుగా కొన‌సాగుతున్నారు.

3 మూవీ ఫ్లాప‌వ్వ‌డానికి కార‌ణం?

2012లో ఐశ్వ‌ర్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన 3 మూవీ ఫ్లాప‌వ్వ‌డానికి కార‌ణాల‌ గురించి మాట్లాడారు. ధనుష్, శ్రుతి హాసన్ ప్రధాన పాత్రలలో న‌టించ‌గా, అనిరుధ్ రవిచందర్ స్వరాలు అందించిన ఈ చిత్రంలోని 'వై దిస్ కొలవరి డి' పాట భారీ విజయాన్ని సాధించింది. ఈ పాట పెద్ద స‌క్సెస‌వ్వ‌డం జ‌నంలో వైరల్ అవ్వ‌డం త‌న సినిమా విజయాన్ని కూడా ప్రభావితం చేసింద‌ని ఐశ్వ‌ర్య అన్నారు.

2011లో 'వై దిస్ కొలవరి డి?' ఆన్‌లైన్‌లో లీక్ అయ్యి వెంటనే ప్రపంచవ్యాప్తంగా వైరల్‌గా మారింది. చమత్కారమైన లిరిక‌ల్ సాంగ్ ల‌క్ష‌లాదిగా వీక్షణలను పొందింది. మేం ఇంకా ప్ర‌చారానికి సిద్ధం కాలేదు.. ఆ లీక్ ఒక‌ పెద్ద షాక్. కొలవెరి డి మా జీవితాల‌ను మార్చేసింది. ఈ పాట విజ‌యం సినిమాపై ఒత్తిడి తెచ్చింది. ఆశ్చర్యం కంటే, ఇది నాకు షాక్‌గా మారింది. నేను వేరే కథను చెప్పడానికి ప్రయత్నించాను.. కానీ పాట మింగేసింది.. ఆ సినిమాలో విష‌యాన్ని కప్పివేసింది. నిజానికి ఇది సీరియస్ సినిమా.. థియేట‌ర్ల‌లో విడుదలయ్యాక చాలామంది సినిమా గురించి మాట్లాడలేదు. కొల‌వెరి డి గురించే మాట్లాడారు.. అని సుదీర్ఘ వివ‌ర‌ణ ఇచ్చారు.

అనిరుధ్ వై దిస్ కొలవరి డి? గురించి ముచ్చ‌టిస్తే.. అనిరుధ్- ధ‌నుష్ పాడిన ఈ పాట‌ అప్ప‌ట్లో చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది. సాహిత్యం తంగ్లీష్‌లో రాసారు. తమిళం- ఆంగ్లం మిశ్రమంగా ఉంటుంది. ఈ లిరిక్ ని అనుసరించడం, అర్థం చేసుకోవడం సులభం. ధనుష్ ఈ నంబర్‌కు తన గాత్రాన్ని అందించాడు. ఇది మరింత విజయవంతమైంది. అనిరుధ్‌, ధనుష్‌లకు మంచి పేరు తెచ్చిపెట్టిన ఈ పాట గురించి ఐశ్వర్య మాట్లాడుతూ.. ఈ పాట సినిమాకు హెల్ప్ కాలేదు. ఇది ఎవరి వ్యక్తిగత కెరీర్‌కైనా సహాయపడితే నేను సంతోషిస్తాను అని అన్నారు.

రజనీకాంత్, విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రల్లో నటించిన లాల్ సలామ్ కి ఐశ్వర్య దర్శకత్వం వహించింది. స్పోర్ట్స్ డ్రామాలో కపిల్ దేవ్ కూడా ప్రత్యేక అతిధి పాత్రలో నటించారు. ఫిబ్రవరి 9న సినిమా విడుదలైంది. ఈ చిత్రం విమర్శకులు, ప్రేక్షకుల నుండి మిశ్రమ సమీక్షలను అందుకుంది. ఈ చిత్రానికి సంబంధించిన సౌండ్‌ట్రాక్‌ను ఏఆర్ రెహమాన్ స్వరపరిచారు. జలాలీ పాట ఆక‌ట్టుకుంది.