అవమానాల నుంచి ఆస్కార్ బరిలోకి..!
తను డైరెక్టర్ కాదు.. కానీ డైరెక్టర్ అయ్యాడు.. ఎవరూ ఊహించని కథని ఎంచుకుని దాని కోసం ఐదేళ్లు కష్టపడ్డాడు.
By: Tupaki Desk | 10 Jan 2026 12:43 AM ISTతను డైరెక్టర్ కాదు.. కానీ డైరెక్టర్ అయ్యాడు.. ఎవరూ ఊహించని కథని ఎంచుకుని దాని కోసం ఐదేళ్లు కష్టపడ్డాడు. ఎన్ని అవమానాలు ఎదురైనా.. కష్టాల కడలి అతన్ని ముంచెత్తాలని చూసినా.. ఇలాంటి సాహసం నీకు అవసరమా? అని ఇండస్ట్రీ వర్గాల్లోని వారు వాదించినా.. ఇండస్ట్రీతో సంబంధం లేదు. దర్శకుడిగా ఎలాంటి అనుభవం లేదు.. ఎందుకీ వృధా ప్రయాస.. డబ్బులు పోగోట్టుకుంటావని తెలిసిన వాళ్లు.. తెలియని వాళ్లు అవమానకరంగా మాట్లాడినా తను నమ్మిన దానికి కట్టుబడ్డాడు.
ఎన్ని అవాంతరాలు ఎదురైనా చివరికి తన ఇంటిని తాకట్టుపెట్టాల్సిన పరిస్థితులు ఎదురైనా భయపడకుండా అన్నింటినీ నరసింహా స్వామికి వదిలేసి.. స్వామిపై భారం వేసి పట్టుదలతో ముందుకు సాగాడు. ఐదేళ్లు ఒకే ప్రాజెక్ట్ కోసం కష్టపడి దేశ వ్యాప్తంగా అందరిని ఆశ్చర్యపరిచాడు. ఇప్పుడు తన సినిమాతో ఆస్కార్ బరిలోకి అడుగు పెట్టాడు. తనే యానిమేషన్ వండర్ `మహావతార్ నరసింహా` దర్శకుడు అశ్విన్ కుమార్. అంతా ఇది అసాధ్యం అని వెక్కిరిస్తున్న వేళ తన స్నేహితులతో కలిసి అసాధ్యాన్ని ఐదేళ్లలో సుసాధ్యం చేసి చూపించాడు.
నాస్తికుడైన అశ్విన్ కుమార్ సాధువులతో చర్చిస్తుండగా నరసింహ స్వామిపై ఎవరైనా సినిమా తీస్తే బాగుంటుందనే భావన కలిగిందట. అదే విషయాన్ని 2008లో స్నేహితులతో చెప్పాడట. అయితే ఆ తరువాత ఆ స్వామే దాని కోసం తనని ఎంచుకోవడం..ఈ సినిమాని పూర్తి చేయడం తనకు దక్కిన అదృష్టంగా భావించాడట. 2008లో ఈ సినిమా ఎలా చేస్తే బాగుంటుందని స్కెచెస్ వేయించిన అశ్విన్ కుమార్ సినిమా కోసం 5 ఏళ్ల శ్రమించాడని తెలిసింది. నరసింహ స్వామిపై భారం వేసి ఎన్ని కష్టాలొచ్చినా ఎదురొడ్డి సినిమా చేశాడట. దీని కోసం ఇంటిని కూడా తాకట్టు పెట్టాల్సి వచ్చిందని, ఆ టైమ్‌లో భయపడలేదని, అంతా స్వామిపైనే భారం వేసి కష్టాలని, నష్టాలని ఎదుర్కొంటూ పూర్తి చేశానని అశ్విన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
అయితే డివోషనల్ ఫీల్ కోసం ఈసినిమాకు మంచి మ్యూజిక్ ఉండాలని ఎంతో మందిని పరిశీలించిన తరువాత తమిళ మూవీ `జడ`కు మ్యూజిక్ చేసిన సామ్ సీఎస్‌ని ఎంచుకున్నాడట. ప్రాజెక్ట్ ఫైనల్‌గా పూర్తి చేసి స్నేహితుల ద్వారా హోంబలే ఫిలింస్ వారిని కలిసి సినిమా చూపించడం..వారు వెంటనే ఓకే చెప్పడంతో పాన్ ఇండియా వైడ్‌గా రిలీజ్ సాధ్యమైంది. ఆ తరువాత ఏం జరిగిందో తెలిసిందే. స్టార్ హీరోల సినిమాలకు ధీటుగా పాన్ ఇండియా వైడ్‌గా రిలీజ్ అయిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో రూ.300 కోట్లమేర వసూళ్లని రాబట్టింది. ఇప్పుడు ఆస్కార్ అవార్డుల రేసులో నిలవడంతో ఇప్పుడు అతని ఐదేళ్ల కష్టం ఫలించినట్టయింది. తొలి అడుగుతో అందరి దృష్టిని ఆకర్షించిన అశ్విన్ కుమార్ ఇదే సిరీస్‌లో ఆరు యానిమేషన్ డివోషనల్ మూవీస్‌ని అందించబోతున్నాడు. 2027లో పరశురామ, 2029లో `రామావతార్`, 20231లో కృష్ణావతార్, 2035, 2037లో కల్కి అవతార్ సినిమాలని వరుసగా అందించబోతున్నాడు.
