Begin typing your search above and press return to search.

విల‌న్‌ని కూడా హీరోలానే ఆరాధించారు!

విలన్ పాత్రలు తనకు హీరోలకు ధీటుగా సమానమైన ప్రేమను అందించాయని న‌టుడు అశుతోష్ రాణా వ్యాఖ్యానించారు.

By:  Tupaki Desk   |   8 May 2024 12:17 PM GMT
విల‌న్‌ని కూడా హీరోలానే ఆరాధించారు!
X

విల‌న్ గా న‌టించ‌డం అంటే స‌వాల్ తో కూడుకున్న‌ది. అయితే విల‌న్ పాత్ర‌లు కూడా హీరోల‌కు స‌మానంగా ఆద‌ర‌ణ పొందుతున్నాయ‌ని, విలన్ పాత్రలు తనకు హీరోలకు ధీటుగా సమానమైన ప్రేమను అందించాయని న‌టుడు అశుతోష్ రాణా వ్యాఖ్యానించారు. వెండితెర‌పై ప్ర‌తినాయ‌క‌ పాత్రలతో మెప్పించిన మేటి న‌టుడు అశుతోష్. ఇప్పుడు అతడు 'మ‌ర్డ‌ర్ ఇన్ మహిమ్‌'లో విజ‌య్ రాజ్ తో క‌లిసి న‌టిపిస్తున్నాడు. ఈ ఇద్దరు ప్రముఖ నటులు ఎలాంటి సినిమాటిక్ మ్యాజిక్‌ను తెరపైకి తెస్తారో చూడాలని అభిమానులు ఉత్సుకతతో ఉన్నారు. అశుతోష్ రానా తన పాత్ర గురించి ..కెరీర్ ప్రారంభంలో ప్రతినాయ‌క‌ పాత్రలను పోషించడం గురించి ప్ర‌స్థావించారు. విల‌న్ పాత్ర‌లు తనకు అనుకూలంగా ఎలా ప‌ని చేసాయో కూడా వెల్ల‌డించారు.

'మ‌ర్డ‌ర్ ఇన్ మహిమ్‌'లో పీట‌ర్ అనే సంక్లిష్ఠ‌మైన‌ పాత్రను పోషించడం గురించి అశుతోష్ రానా మాట్లాడుతూ, ''నేను ఈ త‌ర‌హా పాత్రలను పోషించడంలో పాపుల‌ర‌య్యాను. మర్డర్ ఇన్ మహిమ్‌లో నా పాత్ర నేను ఇంతకు ముందు ఎన్న‌డూ చేయ‌నిది. సిరీస్‌లోని పీట‌ర్ భావోద్వేగాలు, వ్యక్తిత్వం .. ఆ పాత్ర‌కు నేను అవును అని చెప్పడానికి కార‌ణాలు. నేను ఇంతకు ముందెన్నడూ చేయని పనిని ప్రేక్షకులు చూస్తారు!'' అని అన్నారు. ''నా కెరీర్ ప్రారంభ దశలో విల‌న్ పాత్రలు చేయడం నిజంగా నాకు బాగా వ‌ర్క‌వుటైంది. ఈ రోజు నేను వెనక్కి తిరిగి చూసుకుంటే, నా పాత్రలు ఇప్పటికీ నా ప్రేక్షకుల హృదయాల్లో సజీవంగా ఉన్నాయి. మూడు దశాబ్దాల తర్వాత ఇప్పటికీ వాటి గురించి మాట్లాడబడుతున్నందున నేను దానిని గొప్ప‌ విజయంగా భావిస్తున్నాను. కథానాయకులకే సినిమాల ప్రాధాన్యం ఉన్న కాలంలో ప్రేక్షకులు విలన్‌పై సమానమైన ప్రేమను కురిపించారు. నాకు ఆశీస్సులు ల‌భించాయి'' అని అన్నారు. ఇప్ప‌టికీ త‌న‌ని తాను తెర‌పై చూసుకున్న‌ప్పుడు ఒణుకు పుడుతుంద‌ని అశుతోష్ అన్నారు. అలా క‌నిపించ‌డం ఆనందాన్నిస్తుంద‌ని అన్నారు.

మ‌ర్డ‌ర్ ఇన్ మ‌హిమ్ సిరీస్ ట్రైలర్ ఇటీవల విడుదలైంది. ఇది అంద‌రినీ ఆకట్టుకుంది. మర్డర్ ఇన్ మహిమ్ అనేది ఒక సామాజిక అంశానికి సంబంధించిన సినిమా. ఇది ఒక హత్య వెన‌క రహస్యాన్ని శోధించే చిత్రం. ముంబైలోని భయంకరమైన అండర్ మాఫియా క‌థ‌ను ఆవిష్కరిస్తుంది. అదే సమయంలో పాత స్నేహితులైన పీటర్ (అశుతోష్ రాణా పాత్ర పోషించారు) , జెండే (విజయ్ రాజ్ పోషించిన పాత్ర)ల రిలేష‌న్ ని కూడా వెలుగులోకి తెస్తుంది. ర‌చ‌యిత జెర్రీ పింటో పాపుల‌ర్ నవల ఆధారంగా రాజ్ ఆచార్య దర్శకత్వం వహించిన ఈ ధారావాహికను టిప్పింగ్ పాయింట్ ఫిల్మ్స్ - జిగ్సా పిక్చర్స్ నిర్మించాయి. అశుతోష్ రానా .. విజయ్ రాజ్‌, శివాని రఘువంశీ- శివాజీ సతం త‌దిత‌రులు కీలక పాత్రలు పోషించారు.

మహిమ్ స్టేషన్‌లో జరిగిన భయంకరమైన హత్య .. చీకటి నేరం విచారణలో చిక్కుకున్న పీట‌ర్ క‌థేమిట‌న్న‌ది తెర‌పైనే చూడాలి. పీట‌ర్ కుమారుడు సునీల్ అనుమానితుడిగా మారడంతో ప‌రిస్థితులు సీరియ‌స్ గా మార‌తాయి. ఈ క్రైమ్ థ్రిల్ల‌ర్ లో పీటర్ - జెండే అంతుచిక్కని కిల్లర్‌ను వెంబడించే క్ర‌మంలో ప‌రిణామాలు ఏమిట‌న్న‌ది సిరీస్ లో చూడాలి. మర్డర్ ఇన్ మాహిమ్ మే 10 నుండి జియో సినిమాలో స్ట్రీమింగ్ కానుంది.