Begin typing your search above and press return to search.

అతను చనిపోయాకే.. అతని ప్రేమ అర్థమైంది

తాజా ఎపిసోడ్‌లో మీరు ఎవరికి అయినా క్షమాపణ చెప్పాలి అనుకుంటే ఎవరికి చెప్తారు అంటూ అషు రెడ్డిని సుధీర్‌ అడిగాడు.

By:  Tupaki Desk   |   4 April 2025 6:00 AM IST
అతను చనిపోయాకే.. అతని ప్రేమ అర్థమైంది
X

సోషల్‌ మీడియా ద్వారా వచ్చిన గుర్తింపుతో బుల్లి తెరపై ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ అషు రెడ్డి. బుల్లితెరపై సాధించిన విజయాలతో ఏకంగా వెండి తెరపై కూడా అవకాశాలు దక్కించుకుంది. పలు సినిమాల్లో నటించిన అషు రెడ్డి గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. బిగ్‌ బాస్‌ షో ద్వారా తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు సుపరిచితురాలు, ఆ తర్వాత కూడా పలు బుల్లి తెర కార్యక్రమాల్లో కనిపించడం ద్వారా వార్తల్లో నిలిచిన విషయం తెల్సిందే. హీరోయిన్‌గా అషురెడ్డి నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ సోషల్ మీడియాలో ఈమెకు హీరోయిన్స్‌ రేంజ్‌లో గుర్తింపు ఉంది అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఈమె రెగ్యులర్‌గా ఏదో ఒక షో లో కనిపిస్తూ ఉంటుంది అనే విషయం తెల్సిందే. తాజాగా సుధీర్‌ హోస్టింగ్‌ చేస్తున్న ఫ్యామిలీ స్టార్‌ కార్యక్రమంలో అషు రెడ్డి పాల్గొంది. ఆ కార్యక్రమంలో అషు చాలా సరదాగా కనిపించింది. కానీ సుధీర్ ఒక ప్రశ్న అడిగిన సమయంలో ఎమోషనల్‌ అయింది. గతంలో ఎప్పుడు చూడని విధంగా అషు కన్నీళ్లు పెట్టుకుని తనలోని బాధను చెప్పుకొచ్చింది. తాజా ఎపిసోడ్‌లో మీరు ఎవరికి అయినా క్షమాపణ చెప్పాలి అనుకుంటే ఎవరికి చెప్తారు అంటూ అషు రెడ్డిని సుధీర్‌ అడిగాడు. అషు ఆ సమయంలోనే తన జీవితంలో ఉన్న ఒక వన్‌ సైడ్‌ ప్రేమ కథను చెప్పుకొచ్చింది.

10వ తరగతిలో ఉన్న సమయంలో ఒక అబ్బాయి నా వద్దకు వచ్చి లవ్‌ చేస్తున్నట్లు చెప్పాడు. అతడి ప్రపోజల్‌ను తిరస్కరించాను. అంతే కాకుండా స్కూల్‌లో అతడిపై కంప్లైంట్‌ చేశాను. ఆ తర్వాత ఇంటర్‌ చదువుతున్న రోజుల్లో అప్పట్లో ఉన్న ఆర్కుట్‌లోనూ నాపై ఉన్న ప్రేమను కనబర్చుతూ మెసేజ్ చేశాడు. ఆర్కుట్‌ ద్వారా అతడు చేసిన లవ్‌ ప్రపోజల్‌ను తిరస్కరించాను. అప్పుడు కూడా నా ఇంట్లో వారికి అతడిపై కంప్లైంట్‌ ఇచ్చాను. డిగ్రీలో చేరిన తర్వాత అతడి నుంచి ఎలాంటి కాల్‌, మెసేజ్ లేదు. కొన్ని రోజుల తర్వాత అతడు చనిపోయినట్లు నాకు తెలిసింది.

అతడిని చివరి చూపు చూడాలి అనుకున్నాను. నేను వెళ్లాలి అనుకుంటున్నట్లు వాళ్ల అమ్మకు తెలిసి నువ్వు రావొద్దు అంది. నిన్ను నిజంగా ప్రేమించాడు, నువ్వు జాయిన్‌ అయిన కాలేజ్‌లోనే జాయిన్‌ కావాలి అనుకున్నాడు, నీతో మాట్లాడేందుకు ఎప్పుడూ ప్రయత్నించేవాడు. నీ నెంబర్‌ కోసం చాలా ప్రయత్నించాడు. అంతగా నిన్ను సీరియస్‌గా ప్రేమించినా నువ్వు మా వాడిని పదే పదే తిరస్కరించావు అని వాళ్ళ అమ్మ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆమె మాటలకు నేను సైతం ఎమోషన్‌ అయ్యాను. అతడు చనిపోయిన తర్వాతే అతడి ప్రేమ సీరియస్‌ అని అర్థం అయిందని అషు రెడ్డి ఆవేదన వ్యక్తం చేసింది. కొన్ని ప్రేమలు మొదలు కాకుండానే చనిపోతాయి. అషు రెడ్డి విషయంలోనూ అదే జరిగిందని నెటిజన్స్ ఆమెపై సానుభూతి కనబర్చుతూ కామెంట్స్ చేస్తున్నారు.