Begin typing your search above and press return to search.

సుక్కు మూడు గంట‌లు క‌థ చెప్పి ఇంట‌ర్వెల్ అన్నారా?

అదే బ‌న్నీని స్టైలిష్ స్టార్‌గా నిల‌బెట్టిన 'ఆర్య‌'. సుకుమార్‌ను ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ దిల్ రాజు ఓ సినిమాకు ప్లాన్ చేస్తున్నాడ‌ని తెలిసి నిర్మాత మ‌ల్లిడి స‌త్య‌నారాయ‌ణ ఆఫీస్‌కు వెళ్లాడ‌ట‌.

By:  Tupaki Desk   |   15 April 2025 2:45 AM
సుక్కు మూడు గంట‌లు క‌థ చెప్పి ఇంట‌ర్వెల్ అన్నారా?
X

కొన్ని ఇండ‌స్ట్రీ హిట్‌ల తెర వెనుక క‌థ‌లు చాలా మందికి తెలియ‌వు. తెర ముందు జ‌రిగేదే తప్ప ఆ ప్రాజెక్ట్ వెనుక స్క్రిప్ట్ ద‌శ నుంచి సెట్స్‌పైకి వెళ్లేవ‌ర‌కు ఎటాంటి మ‌లుపులు చోటు చేసుకున్నాయి. ఎలాంటి ట్విస్ట్‌లు ఎదుర‌య్యాయి? చివ‌రికి ఎలా సెట్స్ పైకి వెళ్లింది? .. ప్రేక్ష‌కుల వ‌ద్ద‌కు వెళ్ల‌డానికి డైరెక్ట‌ర్‌, నిర్మాత ఏం చేశారు? ఫైన‌ల్‌గా బ్లాక్ బ‌స్ట‌ర్‌గా నిలిచి వారి కెరీర్‌కి ఎలా ఉప‌యోగా ప‌డింది అనే విష‌యాలు ప్ర‌తి ఒక్క‌రిలో ఆస‌క్తిని క‌లిగిస్తాయి. అలాంటి ఓ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ తెర‌వెన‌క క‌థ ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

అదే బ‌న్నీని స్టైలిష్ స్టార్‌గా నిల‌బెట్టిన `ఆర్య‌`. సుకుమార్‌ను ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ దిల్ రాజు ఓ సినిమాకు ప్లాన్ చేస్తున్నాడ‌ని తెలిసి నిర్మాత మ‌ల్లిడి స‌త్య‌నారాయ‌ణ ఆఫీస్‌కు వెళ్లాడ‌ట‌. సుకుమార్‌తో చేస్తున్న సినిమాలో హీరో ఎవ‌ర‌ని అడిగార‌ట‌. దానికి దిల్ రాజు చాలా మందిని క‌లిశాం కానీ ఎవ‌రూ సూట్ కావ‌డం లేద‌ని చెప్పాడ‌ట‌. అదే స‌మ‌యంలో టేబుల్‌పై ఉన్న ఆంధ్ర‌జ్యోతి స్పెష‌ల్ ఎడిష‌న్ క‌వ‌ర్ పేజీపై ఉన్న బ‌న్నీ ఫొటోని చూపించి ఇత‌న్ని హీరోగా పెట్టుకోమ‌న్నార‌ట‌.

దానికి దిల్ రాజు ఇప్ప‌టికే త‌న‌కి క‌థ చెప్పాం. కానీ ఇంత వ‌ర‌కు పిలుపు రాలేద‌ని చెప్ప‌డంతో మీకు అత‌నే కావాలా అని మ‌ల్లిడి స‌త్య‌నారాయ‌ణ చెప్ప‌డంతో కావాల‌నే క‌థా క‌థ చెప్పాం అని దిల్ రాజు చెప్పార‌ట‌. వెంట‌నే అర‌వింద్ గారిని క‌లిసి మ‌ల్లిడి విష‌యం చెబితే తాను బిజీగా ఉన్నాన‌ని, ప్ర‌స్తుతం రాజ‌మండ్రి వెళుతున్నాన‌ని, మీరు కూడా రావాల్సి ఉంటుంద‌ని, కావాలంటే తిరుగు ప్ర‌యాణంలో మీరు చెప్పిన డీల్ గురించి మాట్లాడుకుందామ‌ని అల్లు అర‌వింద్ అన్నార‌ట‌.

ఆయ‌న చెప్పిన‌ట్టే రాజ‌మండ్రి వెళ్లిన మ‌ల్లిడి స‌త్య‌నారాయ‌ణ తిరుగు ప్ర‌యాణంలో ఏలూరు రైల్వేస్టేష‌న్‌కు వ‌చ్చే క్ర‌మంలో అల్లు అర‌వింద్‌తో క‌లిసి కారులో ప్ర‌యాణిస్తూ సుకుమార్‌, దిల్ రాజు ప్రాజెక్ట్ గురించి చెప్పి వారికి బ‌న్నీని అప్ప‌గిద్దామ‌ని చెప్పార‌ట‌. దానికి అల్లు అర‌వింద్ నుంచి ఊహించ‌ని స‌మాధానం ఎదురైంద‌ట‌. క‌థ విన్నాను. మూడు గంట‌లు క‌థ చెప్పిన సుకుమార్ ఇంట‌ర్వెల్ అన్నాడు. నాకు నిద్రొచ్చేసింది. అని చెప్పార‌ట‌.

దానికి మ‌ల్లిడి స‌త్య‌నారాయ‌ణ ..నేను క‌థ విన్నాను బాగుంది అని చెప్పార‌ట‌. ఆ మాట‌లు విన్న అల్లు అర‌వింద్ స‌రే ఓకే కానీ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు ప‌రిస్థితేంటీ? ఆయ‌న చేయ‌గ‌ల‌డా అని అడిగితే.. ఆయ‌న మంచి మేక‌ర్‌, అంతే కాకుండా స‌క్సెస్‌ఫుల్ డిస్ట్రిబ్యూట‌ర్‌. పైగా సోలో ప్రొడ్యూస‌ర్‌గా ఆయ‌న‌కిది తొలి సినిమా. అంతే కాకుండా ఏదో సినిమా చేస్తున్నామ‌ని ఆయ‌న మొత్తం డైరెక్ట‌ర్‌కు వ‌దిలేయ‌డు. ప‌క్క‌నే ఉండి అంతా చూసుకుంటాడు. నా మాట విని బ‌న్నీని సుకుమార్‌, రాజుగార్ల‌కు ఇచ్చేయండి అన్నార‌ట‌. అలా ఆయ‌న చెప్పి ఒప్పించ‌డం వ‌ల్లే `ఆర్య‌` కార్య‌రూపం దాల్చింద‌ట‌. ఇదీ మ‌ల్లిడి స‌త్య‌నారాయ‌ణ చెప్పిన‌ `ఆర్య‌` వెన‌కున్న ఆస‌క్తిక‌ర‌మైన స్టోరీ.