శ్రీరాముడిగా రణబీర్.. క్లాసిక్ డే రాముడు అరుణ్ గోవిల్ ఆసక్తికర వ్యాఖ్యలు
దర్శకుడు నితీష్ తివారీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పౌరాణిక డ్రామా చిత్రం 'రామాయణం' పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే.
By: Sivaji Kontham | 31 May 2026 9:49 AM ISTదర్శకుడు నితీష్ తివారీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పౌరాణిక డ్రామా చిత్రం 'రామాయణం' పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణాసురుడిగా కన్నడ స్టార్ యష్ నటిస్తున్నారు. అయితే రామానంద్ సాగర్ ఐకానిక్ టెలివిజన్ సిరీస్ `రామాయణ్`లో శ్రీరాముడి పాత్రతో కోట్లాది మంది భారతీయుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న సీనియర్ నటుడు అరుణ్ గోవిల్.. ఈ కొత్త చిత్రంలో శ్రీరాముడి తండ్రి రాజు దశరథుడి పాత్రను పోషిస్తుండటం విశేషం. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అరుణ్ గోవిల్ రణ్‌బీర్ కపూర్‌పై వస్తున్న విమర్శలు - తనతో పోలికలపై ఎంతో హుందాగా స్పందించారు.
రణ్‌బీర్ కపూర్ ఫస్ట్ లుక్ విడుదలైనప్పుడు ఎదురైన విమర్శల గురించి అరుణ్ గోవిల్ మాట్లాడుతూ.. ప్రజల మనస్సుల్లో తాను పోషించిన రాముడి పాత్ర ఒక ప్రామాణికంగా మారిపోయిందని.. అందుకే పోలికలు రావడం సహజమని విశ్లేషించారు. ప్రజలు తమ హృదయాల్లో మరో రాముడిని చూడటానికి అంతగా ఇష్టపడరు.. ఇప్పటికీ ఉత్తర, మధ్య భారతదేశంలోని జాతరలు- మేళాలలో విక్రయించే శ్రీరాముడి చిత్రపటాలపై నా ముఖమే కనిపిస్తుంది! అని గుర్తుచేసుకున్నారు. అయితే రణ్‌బీర్ కపూర్ ఎంతో మంచి నటుడని, ప్రతి నటుడు తనదైన శైలిలో పాత్రను పోషిస్తాడని చెబుతూ.. రణ్‌బీర్ కూడా రాముడి పాత్రను తనదైన ప్రత్యేక శైలిలో అద్భుతంగా చేసి ఉంటాడనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
మరోవైపు ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ కేవలం శ్రీరాముడి పాత్రలోనే కాకుండా.. మహావిష్ణువు మరొక అవతారమైన `పరశురాముడి` పాత్రలోనూ కనిపించబోతున్నట్లు ఒక సంచలన విషయాన్ని వెల్లడించారు. లాస్ ఏంజిల్స్‌లో జరిగిన టీజర్ లాంచ్‌లో రణ్‌బీర్ మాట్లాడుతూ.. ఒకే చిత్రంలో శ్రీరాముడు, పరశురాముడి వంటి ఇద్దరు విష్ణు అవతారాలను పోషించే అవకాశం రావడం ఒక నటుడిగా తనకు దక్కిన అద్భుతమైన గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. బాడీ లాంగ్వేజ్‌తో పాటు ఆ పాత్రల వెనుక ఉన్న ఆధ్యాత్మికత, భావోద్వేగాలు .. వారి మూలాలను లోతుగా అర్థం చేసుకోవడానికి తాను షూటింగ్‌కు ముందు ఒక సంవత్సరం పాటు ప్రత్యేకంగా శ్రమించానని రణ్‌బీర్ పేర్కొన్నారు.
నిర్మాత నమిత్ మల్హోత్రా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ దృశ్య కావ్యం `రామాయణ` 2026 దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కావడానికి సిద్ధమవుతోంది. భారతీయ చలనచిత్ర చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌గా భావిస్తున్న ఈ చిత్రం.. పాత తరం రాముడు (అరుణ్ గోవిల్), కొత్త తరం రాముడు (రణ్‌బీర్ కపూర్) ఒకే స్క్రీన్‌పై కనిపించనుండటంతో సినిమా లవర్స్‌లో సరికొత్త వైబ్స్ క్రియేట్ చేస్తోంది.
