Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ: 'యుద్ధం శరణం’

By:  Tupaki Desk   |   8 Sep 2017 7:29 AM GMT
మూవీ రివ్యూ: యుద్ధం శరణం’
X
చిత్రం : ‘యుద్ధ శరణం’

నటీనటులు: అక్కినేని నాగచైతన్య - లావణ్య త్రిపాఠి - శ్రీకాంత్ - రేవతి - రావు రమేష్ - మురళీ శర్మ - ప్రియదర్శి - రవి వర్మ - వినోద్ కుమార్ తదితరులు
సంగీతం: వివేక్ సాగర్
ఛాయాగ్రహణం: నికేత్ బొమ్మిరెడ్డి
కథ: డేవిడ్ నాథన్
మాటలు: అబ్బూరి రవి
స్క్రీన్ ప్లే - డేవిడ్ నాథన్ - అబ్బూరి రవి
నిర్మాత: రజని కొర్రపాటి
దర్శకత్వం: కృష్ణ మారిముత్తు

‘ప్రేమమ్’.. ‘రారండోయ్ వేడుక చూద్దాం’ లాంటి వరుస హిట్లతో మంచి ఊపు మీదున్న అక్కినేని నాగచైతన్య ఏడాది వ్యవధిలోనే మూడో సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చేశాడు. చైతూను హీరోగా పెట్టి అతడి మిత్రుడు.. కొత్త దర్శకుడు కృష్ణ మారిముత్తు తీసిన సినిమా ‘యుద్ధం శరణం’. మంచి టేస్టున్న నిర్మాతగా పేరున్న సాయి కొర్రపాటి నిర్మించిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మంచి అంచనాల మధ్య విడుదలైన ‘యుద్ధం శరణం’ ఆ అంచనాల్ని ఏమేరకు అందుకుందో చూద్దా పదండి.

కథ:

అర్జున్ (నాగచైతన్య) చదువు పూర్తయ్యాక అందరిలా 9-6 ఉద్యోగాలు చేయడం ఇష్టం లేక తన అభిరుచికి తగ్గట్లుగా డ్రోన్ టెక్నాలజీలో నైపుణ్యం సాధించే ప్రయత్నంలో ఉంటాడు. అతడికో అందమైన కుటుంబం ఉంటుంది. తన ఇంటికి అతిథిగా వచ్చిన అంజలి అనే అమ్మాయితో అర్జున్ ప్రేమలో పడితే.. అతడి కుటుంబం వారి ప్రేమను అంగీకరిస్తుంది. ఇలా అన్ని రకాలుగా ఆనందంగా సాగిపోతున్న అర్జున్ జీవితంలో ఉన్నట్లుండి అలజడి రేగుతుంది. అతడి తల్లిదండ్రులు కనిపించకుండా పోతారు. తర్వాత వాళ్లు చనిపోయారని తెలుస్తుంది. ఇంతకీ వాళ్లిద్దరూ ఎందుకు చనిపోయారు.. దాని వెనుక ఉన్న మిస్టరీ ఏంటి.. ఆ మిస్టరీని అర్జున్ ఎలా ఛేదించాడు.. అసలు నిజం తెలుసుకున్నాక ఏం చేశాడు అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

‘యుద్ధం శరణం’ కథేంటన్నది టీజర్.. ట్రైలర్లలోనే దాదాపుగా చెప్పేశారు. ఈ కథలో ఎంతమాత్రం కొత్తదనం లేదు కాబట్టే ముందే అలా విప్పేశారని భావించవచ్చు. ముందు కథ విప్పేశారంటే.. కథనం కొత్తగా ఉంటుందని.. స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేస్తారని ఆశిస్తాం. ఐతే ‘యుద్ధం’ శరణం విజువల్ గా కొంచెం కొత్తగా అనిపిస్తుంది తప్ప కథనంతో ఎలాంటి కొత్తదనం పంచదు. సాఫీగా సాగిపోతున్న ఒక సామాన్యుడి కుటుంబంలో అలజడి రేగినపుడు... అతను తన కుటుంబ సభ్యుల్ని కోల్పోయినపుడు.. ఎలా తిరగబడి తనకు అన్యాయం చేసిన వాళ్ల పని పడతాడన్నదే ఈ కథ. ఇలాంటి కథలతో పదుల సంఖ్యలో సినిమాలు చూసి ఉంటాం. మళ్లీ ఇలాంటి కథతో పాటు ట్రావెల్ చేయాలంటే ఎగ్జైట్మెంట్ కలిగించే అంశాలు చాలా ఆశిస్తాం. అలాంటి అంశాలు ‘యుద్ధం శరణం’ చాలా తక్కువగా కనిపిస్తాయి.

ఒక కథను వరుస క్రమంలో చెప్పకుండా.. గతాన్ని వర్తమానాన్ని కలిపి కాస్త ముందుకు వెనక్కి తిప్పి తిప్పి చూపించేసినంత మాత్రాన సినిమాకు కొత్తదనం వచ్చేస్తుందా? ఈ స్క్రీన్ ప్లే టెక్నిక్ ఒకప్పుడైతే కొత్తగా అనిపించేది కానీ.. ఇప్పుడు అది కూడా పాతదైపోయింది. అసలే పాత కథ.. పైగా దాన్ని నరేట్ చేసిన తీరులోనూ కొత్తదనం ఏమీ లేకపోవడం.. కథనమూ చాలా మామూలుగా ఉండటంతో ‘యుద్ధం శరణం’ సగటు సినిమాలా అనిపిస్తుంది. చాలా వరకు బోర్ కొట్టిస్తుంది. పుస్తకానికి అందమైన ముఖచిత్రం తొడిగినట్లుగా కేవలం విజువల్స్ ద్వారా సినిమాకు మంచి లుక్ అయితే తీసుకు రాగలిగారు కానీ.. అంతకుమించి ఎగ్జైట్ చేస అంశాలేమీ లేవిందులో.

‘యుద్ధం శరణం’కు సంబంధించి ప్రేక్షకులకు కొంచెం కొత్తగా అనిపించిన విషయాలు రెండు. అందులో ఒకటి హీరో కథానాయకుడు డ్రోన్స్ ఆపరేట్ చేసే వ్యక్తిగా కనిపించడం. మరొకటి శ్రీకాంత్ విలన్ పాత్ర పోషించడం. ఈ రెండు విషయాల్లోనూ ప్రేక్షకుల అంచనాల్ని ‘యుద్ధం శరణం’ అందుకోదు. పైన చెప్పుకున్న కథను కొంచెం భిన్నంగా నడిపించడానికి ఈ అంశాన్ని ఉపయోగించుకోవడానికి మంచి అవకాశమే లభించింది. కానీ దర్శకుడు దాన్నేమీ పెద్దగా వాడుకోలేదు. ప్రథమార్ధంలో ఒక చోట హీరో డ్రోన్ సాయంతో రెండు ప్రాణాల్ని కాపాడతాడు. ఆ సన్నివేశం కొంచెం కొత్తగా అనిపిస్తుంది. ఆ సీన్ చూశాక.. సామాన్యుడైన హీరో పెద్ద విలన్ని ఢీకొట్టడానికి అతడికున్న శక్తి సరిపోనపుడు ఈ డ్రోన్ సాయంతోనే యుద్ధం సాగిస్తాడేమో అని ఆశిస్తాం. కానీ హీరో డ్రోన్ ఆపరేటర్ అని గుర్తు చేస్తూ చివర్లో ఒక సన్నివేశానికి మాత్రమే దాన్ని వాడున్నారంతే. ఇక శ్రీకాంత్ పాత్రలోనూ అంత బలం లేకపోవడం.. అది కేవలం బిల్డప్పులకే పరిమితం కావడంతో నిరాశ తప్పదు.

మొరటుగా హత్యలు చేసే విలన్ని.. హీరో టెక్నాలజీ సాయం తీసుకుని బుద్ధి బలంతో ఎదుర్కొనేలా చూపించి ఉంటే.. ఈ క్రమంలో ఆసక్తికర సన్నివేశాలు రాసుకుని ఉంటే ‘యుద్ధం శరణం’ ఎగ్జైటింగా అనిపించేదేమో. హీరోను మరీ సామాన్యుడిలాగానూ చూపించలేదు. అలాగని మాస్ సినిమాల్లో మాదిరి అసాధారణ శక్తిమంతుడిలానూ చూపించలేదు. ఒక సందర్భంలో విలన్లను ఎదుర్కోలేక పారిపోతాడు. ఇంకోసారి అందరినీ ఉతికారేసేస్తాడు. హీరో పాత్ర పూర్తి వాస్తవికంగానూ అనిపించదు. అలాగని లార్జర్ దన్ లైఫ్ క్యారెక్టర్లానూ అనిపించదు. కథను నడిపించిన విధానం కూడా అలాగే సాగింది. దీంతో ఏ వర్గం ప్రేక్షకుడూ ఈ పాత్రతో సంతృప్తి చెందడు.

‘యుద్ధం శరణం’ ఆద్యంతం ప్రేక్షకుడి అంచనాలకు తగ్గట్లే సాగుతుంది. ప్రథమార్ధమంతా కుటుంబ బంధాలు.. హీరో లవ్ స్టోరీతో కథను సరదాగా, ఆహ్లాదంగా నడిపించే ప్రయత్నం చేశారు. ఇక ద్వితీయార్ధమంతా హీరో పోరాటం నేపథ్యంలో కథ నడుస్తుంది. ఉన్నంతలో ప్రథమార్ధంలో ఫ్యామిలీ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు పర్వాలేదనిపిస్తాయి. ప్రేమకథ తేలిపోయినప్పటికీ ఒకట్రెండు మంచి పాటలు పడటం.. విజువల్స్ బాగుండటంతో ప్రేక్షకుడు కొంతమేర ఎంగేజ్ అవుతాడు. దీనికి తోడు హీరో తల్లిదండ్రులకు ఏమైంది.. దీని వెనుక మిస్టరీ ఏంటన్న ఆసక్తి కూడా ద్వితీయార్ధం మీద దృష్టిపెట్టేలా చేస్తుంది.

ఐతే ద్వితీయార్ధంలో హీరో-విలన్ పోరులో ఏ ప్రత్యేకతా లేకపోవడంతో ప్రేక్షకుడు నీరసించిపోతాడు. ఇక్కడ ప్రేక్షకుడిని సర్ప్రైజ్ చేసే అంశాలేమీ కనిపించవు. పేరుకు థ్రిల్లర్ అయినప్పటికీ ఇందులో ఉత్కంఠ అన్నదే కనిపించదు. ద్వితీయార్ధమంతటా చైతూ ఇంతకుముందు చేసిన ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమా గుర్తుకొస్తే ఆశ్చర్యం లేదు. నరేషన్.. విజువల్స్ అన్నీ కూడా చాలా వరకు ఆ సినిమానే తలపిస్తాయి. సన్నివేశాల్లో బలం లేకపోగా.. కొన్ని సన్నివేశాలకు ఏమాత్రం అతకని.. అనవసరం అనిపించే డైలాగులు ప్రేక్షకుడిని మరింత అసహనానికి గురి చేస్తాయి. హీరో చివర్లో కేవలం విలన్ పని పట్టేసి ఊరుకోవడం.. అతడి వెనుక ఉన్న.. పెద్ద స్కామ్ చేసిన రాజకీయ నేతల్ని వదిలేయడంతో ముగింపు సహేతుకంగా అనిపించదు. ఓవరాల్ గా ‘యుద్ధం శరణం’ ఏదో కొత్తగా ఉంటుందని భ్రమలు కల్పించే మామూలు సినిమా.

నటీనటులు:

నాగచైతన్యకు ఇలాంటి పాత్రలు కొత్తేమీ కాదు. గౌతమ్ మీనన్ సినిమాల్లో ఎలా కనిపించాడో ఇందులోనూ అలాగే ఉన్నాడు. తనకు అలవాటైన రీతిలో చేసుకుపోయాడు. నటన ఓకే అనిపిస్తుంది. అతడి లుక్ బాగుంది. లావణ్య త్రిపాఠికి చెప్పుకోదగ్గ పాత్ర ఏమీ లేదు. ఆమె అందంగా కనిపిస్తుంది. శ్రీకాంత్ తన వరకు సిన్సియర్ పెర్ఫామెన్స్ ఇచ్చే ప్రయత్నం చేశాడు కానీ.. పాత్రలో దమ్ము లేకపోవడంతో అంత ఇంపాక్ట్ వేయలేకపోయాడు. మురళీ శర్మ పాత్ర కామెడీగా అనిపిస్తుంది. ఊరికే హడావుడి చేయడం తప్ప ఏమీ లేదు ఆ పాత్రలో. రావు రమేష్.. రేవతి ఉన్నంతసేపూ బాగా నటించారు. ప్రియదర్శి మామూలే.

సాంకేతికవర్గం:

‘పెళ్లిచూపులు’ ఫేమ్ వివేక్ సాగర్ కొత్తగా ఏదో చేద్దామని ప్రయత్నించాడు కానీ అది బెడిసికొట్టింది. పాటలు ఒకట్రెండు ఆహ్లాదంగా అనిపిస్తాయి. కానీ ఓవరాల్ గా అతడి మ్యూజిక్ ఈ సినిమాకు సూటవ్వలేదు. ముఖ్యంగా బ్యాగ్రౌండ్ స్కోర్ పూర్తిగా ట్రాక్ తప్పింది. చాలా సన్నివేశాల్లో బ్యాగ్రౌండ్ స్కోర్ ఇబ్బందిగా అనిపిస్తుంది. అసందర్భంగా వచ్చే పాటలు.. నేపథ్య సంగీతం సినిమాపై ఇంప్రెషన్ మరింత తగ్గించేస్తాయి. నికేత్ ఛాయాగ్రహణం బాగుంది. సినిమాల్లో చెప్పుకోదగ్గ ఆకర్షణల్లో అదొకటి. సినిమాకు ఒక డిఫరెంట్ లుక్ తీసుకొచ్చాడతను. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. ఇక ‘జెంటిల్ మన్’తో ఆకట్టుకున్న తమిళ రచయిత డేవిడ్ నాథన్.. ఈసారి ఆకట్టుకోలేకపోయాడు. అతడి కథ చాలా రొటీన్. అబ్బూరి రవితో కలిసి అతను రాసిన స్క్రీన్ ప్లేలో కూడా పెద్ద విశేషం ఏమీ లేదు. అబ్బూరి రవి మాటలు కూడా చాలా చోట్ల అసందర్భోచితంగా.. అనవసరంగా అనిపిస్తాయి. దర్శకుడు కృష్ణ మారిముత్తు కొన్ని సన్నివేశాల వరకు ప్రతిభ చూపించాడు కానీ.. ఓవరాల్ గా నిరాశ పరిచాడు. స్క్రిప్టులోనే విశేషం ఏమీ లేకపోవడంతో అతను చేయడానికి పెద్దగా ఏమీ లేకపోయింది.

చివరగా: యుద్ధం శరణం.. పరీక్షిస్తుంది సహనం!

రేటింగ్- 1.75/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre