Begin typing your search above and press return to search.

టైం కలిసొచ్చింది కానీ..

By:  Tupaki Desk   |   13 Sep 2017 4:17 AM GMT
టైం కలిసొచ్చింది కానీ..
X
స్టార్ హీరోలు నటించిన భారీ చిత్రాలేం థియేటర్లలో లేవు. కలెక్షన్లు కొల్లగొట్టే స్థాయి ఉన్న డబ్బింగ్ సినిమాలేం రాలేదు. రోమాలు నిక్కబొడుకునేంత స్థాయిలో హాలీవుడ్ సినిమాలూ రిలీజవలేదు. బాలీవుడ్ సినిమాల సంగతి మరి చెప్పనే అక్కర్లేదు. ఓ రకంగా చెప్పాలంటే మాంచి ఛాన్స్. ఎలాంటి పోటీ లేకుండా చక్కటి కలెక్షన్లు రాబట్టుకునేందుకు అవకాశం. కానీ ఆ ఛాన్స్ ను ఈ వీక్ లో రిలీజైన రెండు కొత్త సినిమాలు ఉపయోగించుకోలేక పోయాయి.

నాగచైతన్య హీరోగా నటించిన యుద్ధం శరణం - అల్లరి నరేష్ నటించిన మేడమీద అబ్బాయి ఈ వారం థియేటర్లకు వచ్చాయి. వీటికన్నా ముందు రిలీజైన పైసా వసూల్ రొటీన్ కంటెంట్ తో అందరినీ నిరాశ పరిచింది. దీంతో అర్జున్ రెడ్డి మినహాయించి మిగతా థియేటర్లన్నీ ఖాళీగా ఉంటున్నాయి. ఈ రకంగా యుద్ధం శరణం అండ్ మేడమీద అబ్బాయి సినిమాలకు టైం బానే కలిసొచ్చింది. కానీ ఈ సినిమాలు రెండూ రిలీజ్ ముందు ప్రమోషన్ మీద సరిగా దృష్టి పెట్టలేదు. చివర్లో యుద్ధం శరణం టీం కాస్తంత హడావుడి చేయడంతో ఈ సినిమాకు కాస్తంత హైప్ వచ్చింది. అదికాస్తా మొదటి రోజునే డీలా పడిపోయింది. మేడమీద అబ్బాయి పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. వీకెండ్స్ సంగతి ఎలా ఉన్నా వీక్ డేస్ లో థియేటర్లలో జనాలే పెద్దగా కనిపించని పరిస్థితి. మల్టీప్లెక్స్ ల నుంచి సింగిల్ స్క్రీన్ల వరకు అన్నీ చోట్లా సీట్లు ఖాళీగానే కనిపిస్తున్నాయి.

ఈ వారం రిలీజైన రెండు సినిమాలు ఏ మాత్రం యావరేజ్ గా ఉన్నా ప్రస్తుతం ఉన్న పరిస్థితి వాటికి ప్లస్సయ్యేది. కానీ రెండు సినిమాలు ఏ మాత్రం మెప్పించలేక పోవడంతో ప్రేక్షకులు థియేటర్లకు దూరంగానే ఉండిపోయారు. మరోవైపు ఈ పరిస్థితి అర్జున్ రెడ్డికి బాగా కలిసొచ్చింది. మల్టీప్లెక్సుల్లో ఈ సినిమాకు ఇప్పటికీ చెప్పుకోదగ్గ కలెక్షన్లే వస్తున్నాయి.