Begin typing your search above and press return to search.

స్టైలిష్ డైరెక్టర్ తో యూత్ స్టార్..?

By:  Tupaki Desk   |   4 Sep 2021 12:30 PM GMT
స్టైలిష్ డైరెక్టర్ తో యూత్ స్టార్..?
X
యూత్ స్టార్ నితిన్ ఈ ఏడాది ప్రథమార్థంలోనే రెండు చిత్రాలను రిలీజ్ చేయడమే కాకుండా.. 'మాస్ట్రో' చిత్రాన్ని విడుదలకు సిద్ధం చేసాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 17న ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఎడిటర్ ఎస్ఆర్ శేఖర్ ని డైరెక్టర్ గా పరిచయం చేస్తూ నితిన్ ఓ సినిమా చేయనున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇదే క్రమంలో సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో నితిన్ ఓ ప్రాజెక్ట్ కి కమిట్ అయ్యాడని వార్తలు వస్తున్నాయి.

'సైరా నరసింహారెడ్డి' సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి ప్రస్తుతం అఖిల్ అక్కినేనితో 'ఏజెంట్' సినిమా చేస్తున్నాడు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. డిసెంబర్ నాటికి సినిమా పూర్తయ్యే అవకాశం ఉంది. దీని తర్వాత పవన్ కళ్యాణ్ తో సూరి ఓ సినిమా చేయాల్సి ఉంది. రామ్ తాళ్లూరి నిర్మించే ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథ అందిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ తో సురేందర్ రెడ్డి సినిమా సెట్స్ మీదకు వెళ్ళడానికి ఎక్కువ సమయమే పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. పవన్ ప్రస్తుతం నటిస్తున్న రెండు సినిమాలతో పాటుగా హరీష్ శంకర్ సినిమా చేయాల్సి ఉంది. ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాతే సురేందర్ - పవన్ ప్రాజెక్ట్ ఉంటుంది. అందుకే ఈ గ్యాప్ లో నితిన్ తో ఓ సినిమా చేయాలని సూరి నిర్ణయించుకున్నారట. దీని కోసం వక్కంతం వంశీ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనింగ్ స్క్రిప్టు రెడీ చేసారట.

స్టోరీ నచ్చడంతో నితిన్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని..
నితిన్ హోమ్ ప్రొడక్షన్ శ్రేష్ఠ మూవీస్ బ్యానర్ లోనే ఈ సినిమా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. అదే సమయంలో వక్కంతం వంశీ దర్శకత్వంలోనే నితిన్ ఓ సినిమా చేస్తాడని మరో న్యూస్ చక్కర్లు కొడుతోంది. 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమాతో దర్శకుడిగా మారిన వంశీ.. ఇప్పుడు నితిన్ ని డైరెక్ట్ చేసే అవకాశం అందుకున్నాడని అంటున్నారు. నితిన్ చేయబోయే ప్రాజెక్ట్ సురేందర్ రెడ్డి - వక్కంతం వంశీ లలో ఎవరి దర్శకత్వంలో ఉంటుందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.