Begin typing your search above and press return to search.

ఓటీటీలో హిట్ కొట్టాడు.. కొత్త సినిమా వచ్చింది

By:  Tupaki Desk   |   1 Dec 2022 1:30 PM GMT
ఓటీటీలో హిట్ కొట్టాడు.. కొత్త సినిమా వచ్చింది
X
ఒకప్పటి యూత్ స్టార్లు తరుణ్, ఉదయ్ కిరణ్‌ల మాదిరే కెరీర్ ఆరంభంలో వరుసగా హిట్లు కొట్టి ప్రామిసింగ్‌గా అనిపించాడు రాజ్ తరుణ్. కానీ తర్వాత క్వాలిటీ చూసుకోకుండా ఎలా పడితే అలా సినిమాలు ఒప్పేసుకుని ట్రాక్ తప్పాడు. మొదట్లో రాజ్ తరుణ్‌ను చూసి ఫ్యాన్స్ అయిన వాళ్లు కూడా తన క్వాలిటీ లెస్ సినిమాలు చూసి లైట్ తీసుకోవడం మొదలుపెట్టారు. అతడి చివరి సినిమా ‘స్టాండప్ రాహుల్’ కనీస స్థాయిలో కూడా ప్రేక్షకులను మెప్పించలేదు. ఆ సినిమా వచ్చింది వెళ్లింది కూడా తెలియని పరిస్థితి నెలకొంది.

ఈ దెబ్బకు రాజ్‌తో కొత్తగా సినిమా చేయడానికి ఎవ్వరూ ముందుు రాని పరిస్థితి. ఐతే జీ5 వాళ్లు ధైర్యం చేసి రాజ్ తరుణ్‌తో ‘అహనా పెళ్లంట’ అనే వెబ్ సిరీస్ తీశారు. ఆ సిరీస్‌కు జీ5లో మంచి స్పందనే వచ్చింది. రివ్యూస్‌తో పాటు ఈ సిరీస్‌కు వ్యూస్ కూడా బాగానే వచ్చినట్లున్నాయి. ఇది రాజ్‌కు పెద్ద రిలీఫ్ అనడంలో సందేహం లేదు.

మొత్తానికి ఓటీటీలో అయినా సరే ఒక హిట్ పడడంతో రాజ్‌కు కెరీర్ మీద మళ్లీ ఆశలు చిగురించినట్లున్నాయి. ఈ ఊపులో ఒక సినిమా మొదలుపెట్టేశాడు. ఆ సినిమా పేరు.. ‘తిరగబడర స్వామి’ కావడం విశేషం. గోపీచంద్‌తో యజ్ఞం, సాయిధరమ్ తేజ్‌తో ‘పిల్లా నువ్వు లేని జీవితం’ లాంటి హిట్ సినిమాలు తీసిన రవికుమార్ చౌదరి ఈ చిత్రానికి దర్శకుడు. ‘పిల్లా నువ్వు లేని జీవితం’తో చాలా ఏళ్లకు మంచి హిట్ కొట్టినా.. మళ్లీ ‘సౌఖ్యం’ లాంటి డిజాస్టర్ ఇచ్చి కనుమరుగైపోయాడు రవికుమార్.

మళ్లీ ఇంత కాలానికి అతను సినిమా డైరెక్ట్ చేస్తున్నాడు. కొన్ని డబ్బింగ్ చిత్రాలతో పాటు సూర్య వెర్సస్ సూర్య, శౌర్య లాంటి నిర్మించి మధ్యలో గ్యాప్ తీసుకున్న మాల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఈ హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్.. ముగ్గురూ కమ్ బ్యాక్ కోసం ప్రయత్నిస్తున్న వారే. మరి ‘తిరగబడర స్వామి’ వారి కోరిక తీరుస్తుందేమో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.