Begin typing your search above and press return to search.

బుజ్జిగా మీద ఆధారపడిన హీరో భవితవ్యం!

By:  Tupaki Desk   |   24 May 2020 7:58 AM GMT
బుజ్జిగా మీద ఆధారపడిన హీరో భవితవ్యం!
X
యువ హీరో రాజ్ తరుణ్ మొదట్లో వరస హిట్లతో దూసుకుపోయాడు కానీ ఈమధ్య మాత్రం స్పీడు తగ్గింది. వరసగా ఫ్లాపులు తగలడంతో రాజ్ తరుణ్ కెరీర్ కు ఇబ్బంది తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజ్ తరుణ్ ప్రస్తుతం 'ఒరేయ్ బుజ్జిగా' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా వేసవిలోనే విడుదల కావాల్సి ఉంది కానీ థియేటర్లు మూతపడడంతో వాయిదా వేయక తప్పలేదు.

ఈ సినిమా విజయంపై రాజ్ తరుణ్ చాలా నమ్మకం పెట్టుకున్నాడు. ఈ సినిమా హిట్ అయితే కెరీర్లో బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఇప్పుడుండే పరిస్థితుల్లో థియేటర్లు ఎప్పుడు తెరుస్తారనేది ఇంకా క్లారిటీ లేదు. ఒకవేళ థియేటర్లు రీ-ఓపెన్ చేసినా ప్రేక్షకులు చిన్న సినిమాలను చూడడానికి వస్తారా అనేది సందేహంగా ఉంది. హిట్ సాధించడం తప్పనిసరి అయినప్పుడు ఏదీ అనుకూలంగా కనిపించకపోవడం రాజ్ తరుణ్ ను ఇబ్బంది పెట్టేదే.

ఈ సినిమాలో రాజ్ తరుణ్ సరసన మాళవిక హీరోయిన్ గా నటిస్తోంది. హెబ్బా పటేల్.. నరేష్.. పోసాని కృష్ణ మురళి.. వాణి విశ్వనాథ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కొండా విజయ్ కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమాను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై కె.కె. రాధా మోహన్ నిర్మిస్తున్నారు. మరి ఈ సినిమాతో అయినా రాజ్ తరుణ్ కు విజయం దక్కుతుందేమో వేచి చూడాలి.