Begin typing your search above and press return to search.

క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా యంగ్ హీరో!

By:  Tupaki Desk   |   31 Jan 2022 9:42 AM GMT
క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా యంగ్ హీరో!
X
ఆది సాయికుమార్ కెరియర్ ఆరంభంలోనే యూత్ నుంచి మంచి మార్కులు కొట్టేశాడు. ఫైట్స్ పరంగా .. డాన్స్ పరంగా ప్రేక్షకులు ఆయనను హీరోగా అంగీకరించారు. అయితే ఆ తరువాత సరైన హిట్ పడకపోవడంతో ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. గ్యాప్ రాకుండా చూసుకుంటూ రేస్ లో నిలబడటానికి తన వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అయినా కాలం కలిసి రావడం లేదు. ఆయన మాత్రం పట్టువదలని విక్రమార్కుడు మాదిరిగా గట్టిగానే కృషి చేస్తున్నాడు. ఇటీవల వచ్చిన 'అతిథి దేవోభవ' కూడా పెద్దగా ప్రమోషన్స్ లేకుండా బరిలోకి దిగి దెబ్బతినేసింది.

ఈ నేపథ్యంలో ఆయన తన తరువాత సినిమాలపై దృష్టిపెట్టాడు. ఆ జాబితాలో 'జంగిల్' .. 'కిరాతక' .. 'అమరన్' .. 'బ్లాక్' సినిమాలు కనిపిస్తున్నాయి. ఒక వైపున ఆ సినిమాలను ఒక్కొక్కటిగా కానిచ్చేస్తూనే, మరో సినిమాను కూడా ఆయన లైన్లో పెట్టేశాడు. ఆ సినిమా పేరే .. 'సీఎస్ ఐ సనాతన్'. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్టు లుక్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. అజయ్ శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈ సినిమాకి శివశంకర్ దేవ్ దర్శకత్వం వహిస్తున్నాడు. అనీష్ సోలోమన్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ఈ సినిమాలో ఆది సాయికుమార్ క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు.

క్రైమ్ బ్యాక్ డ్రాప్ లో గ్రిప్పింగ్ థ్రిల్లర్ గా ఈ సినిమా రూపొందుతోంది. ఓ బిల్డింగ్ లో జరిగే హత్యతో ఈ కథ మొదలవుతుంది. ఈ క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ ఆదికి అప్పగించడం జరుగుతుంది. హత్య జరిగిన ప్రదేశంలో ఆయనకి తుపాకీ .. కత్తి .. కళ్లద్దాలు .. వాటిపై ఫింగర్ ప్రింట్స్ లభిస్తాయి.

ఈ ఆధారాలతో ఆయన ఈ ఇన్వెస్టిగేషన్ ను ఎలా మొదలుపెట్టాడు? ఆ ప్రయత్నంలో ఆయన ఎలాంటి సంఘటనలను ఎదుర్కోవలసి వస్తుంది? చివరికి ఆయన ఈ కేసుకు సంబంధించిన చిక్కుముడులను ఎలా విప్పుతాడు? అనే అనూహ్యామైన మలుపులతో ఈ కథ నడుస్తుంది. ఆద్యంతం ఈ కథ ఆసక్తికరంగా నడుస్తుంది.

ఇప్పటికే ఈ సినిమా చాలా వరకూ చిత్రీకరణ జరుపుకుంది. ఈ ఏడాదిలోనే ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో ఆది సాయికుమార్ జోడీగా మిషా నారంగ్ అలరించనుంది. గతంలో ఆమె సింహా కొడూరి జోడీగా 'తెల్లవారితే గురువారం' సినిమాలో చేసింది. అయితే ఆ సినిమా అంతగా ఆడకపోవడం వలన, ఆమెకి అంతగా గుర్తింపు రాలేదు.

ఆ తరువాత ఆమె చేస్తున్న సినిమా ఇదే. హీరో .. హీరోయిన్ తో పాటు, దర్శక నిర్మాతల కెరియర్ కి కూడా ఈ సినిమా సక్సెస్ అత్యవసరమేనని చెప్పాలి. చూడాలి మరి ఈ సినిమా వాళ్ల కెరియర్ కి ఎంతవరకూ హెల్ప్ అవుతుందో!