Begin typing your search above and press return to search.

'ఉప్పెన' హీరో కోసం యంగ్ డైరెక్టర్ల పోటీ!

By:  Tupaki Desk   |   21 March 2021 3:30 AM GMT
ఉప్పెన హీరో కోసం యంగ్ డైరెక్టర్ల పోటీ!
X
ఇటీవల కాలంలో వసూళ్ల పరంగా టాలీవుడ్ ను షేక్ చేసిన చిత్రంగా 'ఉప్పెన' నిలిచింది. వైష్ణవ్ తేజ్ - కృతి శెట్టి జంటగా నటించిన ఈ సినిమాకి బుచ్చిబాబు దర్శకత్వం వహించాడు. విభిన్నమైన నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా, యూత్ కి బాగా కనెక్ట్ అయింది. దాంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. ఒక స్టార్ హీరో సినిమా రాబట్టే వసూళ్లు .. ఒక డెబ్యూ హీరో సినిమా రాబట్టడం ఇండస్ట్రీ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. జాలరి కుర్రాడి పాత్రలో వైష్ణవ్ తేజ్ నటన అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమా చూసిన వాళ్లంతా కూడా వైష్ణవ్ కి మంచి ఫ్యూచర్ ఉందని జోస్యం చెప్పేశారు.

ఆల్రెడీ వైష్ణవ్ తేజ్ .. క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా చేశాడు. ప్రస్తుతం ఈ సినిమా పోస్టు ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. ఆ తరువాత అన్నపూర్ణ బ్యానర్లో ఒకటి .. షైన్ స్క్రీన్ బ్యానర్లో ఒకటి చేయడానికి వైష్ణవ్ తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. 'ఉప్పెన' రాబట్టిన వసూళ్లను చూసిన ఇతర నిర్మాతలు, ఈ కుర్రాడిపై ఓ 15 కోట్లవరకూ పెట్టుబడి పెట్టొచ్చనే నిర్ణయానికి వచ్చేశారు. దాంతో యువ దర్శకులు కొంతమంది ఆ స్థాయి బడ్జెట్ కి తగిన కథలను సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది.

ప్రేమకథా చిత్రాలను అందంగా .. ఆసక్తికరంగా తెరపై ఆవిష్కరించడంలో మంచి పేరు తెచ్చుకున్న వెంకీ కుడుముల .. వెంకీ అట్లూరి, రీసెంట్ గా వైష్ణవ్ తేజ్ ను కలిసి కథలను వినిపించారనే టాక్ ఫిల్మ్ నగర్లో జోరుగా వినిపిస్తోంది. ఇక చందూ మొండేటి కూడా వైష్ణవ్ తేజ్ ను ఒప్పించే ప్రయత్నంలో ఉన్నాడని అంటున్నారు. శివ నిర్వాణ .. వివేక్ ఆత్రేయ కూడా ముందుగా ఓకే అనిపించేసుకుంటే ఆ తరువాత తమ సీరియల్ నెంబర్ వచ్చినప్పుడు రంగంలోకి దిగవచ్చనే ముందుచూపుతో ముందుకువెళుతున్నారని అంటున్నారు. మొత్తానికి మెగా మేనల్లుడి డిమాండ్ మామూలుగా లేదండోయ్!