Begin typing your search above and press return to search.

కొత్త ఏడాదిలో కుర్ర దర్శకుల దూకుడు!

By:  Tupaki Desk   |   24 Dec 2020 4:30 PM GMT
కొత్త ఏడాదిలో కుర్ర దర్శకుల దూకుడు!
X
ఒక వైపున రాజమౌళి .. కొరటాల శివ .. పూరి జగన్నాథ్ .. అనిల్ రావిపూడి వంటి దర్శకులు కొత్త ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు తమ సినిమాలను తీసుకురావడానికి ప్రణాళిక రచన చేసుకుంటున్నారు. మరోవైపున తొలి సినిమాతోనే శభాష్ అనిపించుకున్న యువ దర్శకులు కూడా న్యూ ఇయర్ లో తమ దూకుడు చూపించడానికి సిద్ధమవుతున్నారు. ఒక్కొక్కరూ ఒక్కో జోనర్లో చేసిన సినిమాలను వచ్చే ఏడాదిలో థియేటర్స్ లో దింపేయాలనే ఉత్సాహంతో చకచకా పనులను చక్కబెడుతున్నారు.

'కేరింత' సినిమాతో యూత్ ముందుకు వెళ్లిన వెంకీ అట్లూరి, ఆ తరువాత 'తొలిప్రేమ' సినిమాతో భారీ విజయాన్ని దక్కించుకున్నాడు. అటు వరుణ్ తేజ్ కి .. రాశి ఖన్నాకి ఈ సినిమాతో మంచి హిట్ ఇచ్చాడు. ఆ తరువాత సినిమాగా ఆయన, నితిన్ హీరోగా 'రంగ్ దే' చేశాడు. కీర్తి సురేశ్ కథానాయికగా నటించిన ఈ సినిమా, త్వరలో థియేటర్స్ కి రానుంది. ఈ సినిమాతో న్యూ ఇయర్లో హిట్ కొట్టేస్తాననే బలమైన నమ్మకంతో ఆయన ఉన్నాడు.

ఇక మరో యువ దర్శకుడు వివేక్ ఆత్రేయ కూడా దూకుడుగానే ఉన్నాడు. 'మెంటల్ మదిలో' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన వివేక్ ఆత్రేయ, 'బ్రోచేవారెవరురా' సినిమాతో తన మార్క్ చూపించాడు. కథలో కొత్తదనం .. కథనంలో పట్టు ఉంటే సక్సెస్ సాధించడం తేలికనే విషయాన్ని మరోమారు నిరూపించాడు. ప్రస్తుతం ఆయన నానీ హీరోగా 'అంటే .. సుందరానికీ!' సినిమాను పట్టాలెక్కించాడు. ఈ సినిమా వచ్చే ఏడాదిలో విడుదల కానుంది.

'ఛలో' .. 'భీష్మ' సినిమాలు ఇటు యూత్ తో పాటు అటు ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సినిమాల్లో మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునే అంశాలు కూడా ఉన్నాయి. ఇంత తెలివిగా రంగంలోకి దిగిన యువదర్శకుడు ఎవరబ్బా అనుకుంటే, అందుకు సమాధానంగా వెంకీ కుడుముల పేరు కనిపించింది. రామ్ హీరోగా ఆయన ఒక ప్రాజెక్టును సెట్ చేస్తున్నట్టు వినికిడి. వచ్చేఏడాది స్క్రీన్ పైకి ఎక్కించే పట్టుదలతోనే ఉన్నాడని అంటున్నారు.

ఇక 'కార్తికేయ'తో హిట్ కొట్టిన చందూ మొండేటి, నిఖిల్ హీరోగా ఆ సినిమాకి సీక్వెల్ చేయడానికి రంగంలోకి దిగాడు. అలాగే సోగ్గాడే చిన్నినాయనా'లోని 'బంగార్రాజు' పాత్రను కేంద్రంగా చేసుకుని అదే పేరుతో కల్యాణ్ కృష్ణ ఒక సినిమాను రూపొందించనున్నాడు. కథ ఒక కొలిక్కిరావడంతో కదనరంగంలోకి దిగడానికి రెడీ అవుతున్నారు. ఈ రెండు సినిమాలు కూడా వచ్చే ఏడాదిలోనే సందడి చేయనున్నాయి. మొత్తానికి లాక్ డౌన్ సమయంలో గట్టి కసరత్తులే చేసిన కుర్ర దర్శకులు, కొత్త ఏడాదిలో కొత్త ఉత్సాహంతో దూకుడు చూపించనున్నారన్నమాట.