Begin typing your search above and press return to search.

రజనీని మెప్పించిన యంగ్ డైరెక్టర్!

By:  Tupaki Desk   |   6 May 2021 9:00 PM IST
రజనీని మెప్పించిన యంగ్ డైరెక్టర్!
X
ఒకప్పుడు సీనియర్ స్టార్ హీరోలతో సినిమాలు చేయడానికి కొత్త దర్శకులకు ఒక పట్టాన అవకాశం వచ్చేది కాదు. ఎంతోకాలం పాటు వాళ్లు అలా వేచి చూడవలసి వచ్చేది. అంతగా వెయిట్ చేసినా అవకాశం వస్తుందని చెప్పలేని పరిస్థితి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. గతంలో తమకి హిట్లు ఇచ్చిన సీనియర్ దర్శకులతో మాత్రమే సినిమాలు చేసే హీరోల ఆలోచనా విధానంలో మార్పు వచ్చింది. కొత్త దర్శకులతో చేయడానికి వాళ్లు ఉత్సాహాన్ని చూపుతున్నారు. ఈ విషయంలో రజనీ .. కమల్ అందరికంటే ముందు వరుసలో కనిపిస్తారు.

రజనీకాంత్ తన డేట్ల కోసం వెయిట్ చేస్తున్న ఎంతోమంది సీనియర్ దర్శకులను పక్కన పెట్టి, యువ దర్శకుడైన పా.రంజిత్ కి 'కబాలి' సినిమాతో అవకాశం ఇచ్చారు. ఆ తరువాత 'పేట' సినిమాతో కార్తీక్ సుబ్బరాజ్ కి ఛాన్స్ ఇచ్చారు. ఈ సినిమాల ఫలితాల సంగతి అలా ఉంచితే, ఇద్దరూ కూడా రజనీని కొత్తగా చూపించడంలో సక్సెస్ అయ్యారు. ఆ కొత్తదనమే రజనీకి మరింత ఎనర్జీని ఇచ్చింది. అందువల్లనే ఇప్పుడు ఆయన మరో యువ దర్శకుడికి ఛాన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఆ దర్శకుడి పేరే .. 'దేశింగ్ పెరియసామి'.

ఈ పేరు వినగానే ఇంతకుముందు ఏ సినిమా చేశాడబ్బా? అనే ఆలోచన కలగడం సహజం. తమిళంలో ఆయన చేసిన తొలి సినిమా, 'కనులు కనులను దోచాయంటే' పేరుతో తెలుగులోనూ విడుదలైంది. దుల్కర్ - రీతూ వర్మ జంటగా నటించిన ఈ సినిమా, అక్కడ ప్రశంసలను అందుకుంది. కొత్త కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా ఇక్కడి ప్రేక్షకులను కూడా బాగానే ఆకట్టుకుంది. ఆ సినిమాకి దర్శకత్వం వహించిన దేశింగ్ పెరియసామి, రీసెంట్ గా రజనీని కలిసి ఒక కథను వినిపించాడట. కథ ... అందులో తన పాత్ర నచ్చడంతో వెంటనే రజనీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. ప్రస్తుతం రజనీ చేస్తున్న 'అన్నాత్తే' తరువాత ఆయన చేసే ప్రాజెక్టు ఇదేనని అంటున్నారు.