Begin typing your search above and press return to search.

ఆ గొంతుకు అలుపు లేదు

By:  Tupaki Desk   |   10 Jan 2022 2:30 PM GMT
ఆ గొంతుకు అలుపు లేదు
X
శరీరానికే వయసు. గొంతుకు కానే కాదు, అసలు దానికి అలుపు అన్నదే తెలుసు. ఇంతకీ ఆ గొంతుక ఎవరిది అంటే జవాబు కట్టస్సెరి జోసెఫ్ ఏసుదాస్ ది అని. ఇదేంటి ఈ కొత్త పేరు అనుకుంటున్నారా. అది ఆయన ఇంటి పేరు. షార్ట్ కట్ లో అంతా కేజే ఏసుదాస్ అని పిలుస్తారు. అలా ఏసుదాసు అయినా జేసుదాసు అయినా ఆయనే. ఇంతకీ ఆయన ఎవరికి దాసుడు అంటే సంగీత కళామతల్లికే అని చెప్పాలి.

ఇప్పటికి ఎనభయ్యేళ్ళ క్రితం అంటే 1940 జనవరి 10న అగస్టీన్‌ జొసెఫ్‌, ఆలిస్‌ కుట్టి అనే రోమెన్‌ కేథలిక్‌ దంపతులకు కేరళ రాష్ట్రంలో ఫోర్ట్‌ కొచి గ్రామంలో ఏసుదాస్ జన్మించారు. ఆనాడు ఆయన తల్లిదండ్రులకు తెలియదు పుట్టిన వాడు భారతీయ సంగీతాన్ని విశ్వవ్యాప్తం చేస్తాడని.

ఇక జేసుదాస్ తండ్రి కూడా మళయాళ శాస్త్రీయ సంగీత విద్వాంసుడే. అందువల్ల ఆయనకు బాల్యం నుంచే సంగీతం అబ్బింది. ఆయన అలా శుద్ధంగా సంగీతాన్ని నేర్చుకున్నారు. 1961 అంటే ఇప్పటికి 61 ఏళ్ల క్రితం ఆయన సినీ సీమలో ప్లేబ్యాక్ సింగర్ గా అరంగేట్రం చేశారు

ఆనాటి నుంచి ఆ గొంతులో పలకను గమకం లేదు, సరిగమ లేదు. ఒక వైపు సినీ సంగీతానికి ప్రాధాన్యత ఇస్తూనే శాస్త్రీయ సంగీతాన్ని కూడా ఆయన ఎక్కడా విడవలేదు, అనేక కచేరీలు చేస్తూ దేశంలో నిష్ణాతులైన సంగీత సృఅష్టల సరసన పేరు సంపాదించుకున్నారు.

ఇక మళయాళంలో తొలిపాట పాడిన జేసుదాస్ 1965 ప్రాంతంలో తెలుగు సీమలో అడుగుపెట్టారు. నిండు చందమామా అంటూ ఆయన పాడిన తొలి పాట నిజంగా తెలుగు వారికి జాబిల్లి అంత చల్లంగా హాయిగా ఉందనిపించింది. తన గొంతుకు ఒక ప్రత్యేకత ఉంది. మృదుత్వం ఉంది. దాంతో ఫలానా పాట అంటే ఆయనే పాడాలి అని అంతా అనుకునేవారు.

అలా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ తదితర భాషల్లో పాటలు పాడారు. మనదేశ భాషల్లోనే కాక మలేషియన్‌, రష్యన్‌, అరబిక్‌, లాటిన్‌, ఆంగ్ల భాషలలో కూడా పాడి శ్రోతలను జేసుదాస్ శ్రోతలను మెప్పించారు. జేసుదాస్ కి కోపం ఎక్కువ అని చెబుతారు. అయినా ఆయనతోనే పాట పాడించుకున్నరంటే అది ఆయన సంగీతానికి పులకరించిపోయి చేసిన పనిగానే చూడాలి.

ఏసుదాస్ జన్మతహా క్రిస్టియన్. అయితే ఆయన అన్ని మతాల గీతాలను ఆలపించారు. ఆయన అయ్యప్ప పాటలు పాడుతూంటే ఆయన కంటే భక్తుడు వుంటారా అనిపించకమానదు. ఇక ఆయన షిరిడీ సాయిబాబా మీద గీతాలను ఆలపిస్తే మనసు భక్తితో ఊగకుండా ఉంటుందా.

జేసుదాస్ తెలుగులో ఎన్నో పాటలు పాడారు కానీ నాటి అగ్ర హీరోలు అక్కినేని, ఎన్టీయార్ కి మొదట్లో పాడలేదు. ఎన్టీయార్ సొంత చిత్రం శ్రీక్రిష్ణ సత్యలో ఆయన పాడారు. అయితే అన్న గారికి గొంతు అరువు ఇవ్వలేదు. ఇది జరిగిన పదేళ్ళకు ఆయన అక్కినేనికి మేఘ సందేశం చిత్రంలో పాటలు పాడి ఏయన్నార్ కి సరిపోయే గొంతు ఇదే అనిపించారు. ఇక ఎన్టీయార్ బ్రహ్మర్షి విశ్వామిత్ర మూవీలో ఆయనకు పాడి ఆ లోటు తీర్చుకున్నారు.

ఇక ఆయన క్రిష్ణ, శోభన్, క్రిష్ణం రాజు, మోహన్ బాబు, మురళీమోహన్, చిరంజీవి, బాలయ్య వెంకటేష్ లకు పాటలు పాడారు. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. ఏసుదాస్ గొంతు ఒక విలక్షణమైనది. ఆయన పాటను సినిమా తో అనుసంధానించి చూడలేరు. విడిగా ఉన్నా కూడా అది అలరిస్తుంది. అంటే ఆయన పాటే హీరో. దానికి వేరే ఇమేజ్ అన్నది అవసరం లేదు. తనకు సంగీతమే తప్ప కులాలు మతాలు, ప్రాంతలౌ ఎల్లలు లేవని చాటి చెప్పిన ఏసుదాస్ నిత్య సంగీత శ్రామికుడు. ఆయన మరిన్నేళ్ళు తన సంగీతంతో అలరించాయలి సంగీత ప్రియులు కోరుకుంటున్నారు.