Begin typing your search above and press return to search.

నిన్న థియేట‌ర్స్..ఇప్పుడు ఓటీటీలోనూ పాగా వేసేస్తున్నారు

By:  Tupaki Desk   |   13 Feb 2022 12:30 AM GMT
నిన్న థియేట‌ర్స్..ఇప్పుడు ఓటీటీలోనూ పాగా వేసేస్తున్నారు
X
థియేట‌ర్లు ప్ర‌ధానంగా ఆ న‌లుగురి చేతుల్లోనే వున్నాయ‌ని, చిన్న సినిమాల‌కు థియేట‌ర్లు ల‌భించ‌డం లేద‌ని గ‌త కొన్నేళ్లుగా విమ‌ర్శ‌లు వినిపిస్తున్న విష‌యం తెలిసిందే. ఆర్. నారాయ‌ణ మూర్తి చిన్న చిత్రాల‌కు థియేట‌ర్ల దొర‌క‌ని ప‌నిస్థిత‌కి వ‌చ్చేశామ‌ని ఆ న‌లుగురిపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆ త‌రువాత అదే త‌ర‌హాలో క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు సైతం త‌న సినిమాకు థియేట‌ర్లు ల‌భించ‌లేద‌ని మీడియా ముఖంగా వెల్ల‌డించిన సంద‌ర్భాలున్నాయి.

చాలా వ‌ర‌కు చిన్న చిత్రాలు థియేట‌ర్లు ల‌భించ‌క రిలీజ్ ల‌కు ఇబ్బందుల్ని ఎదుర్కొన్న రోజులు వున్నాయి. అయితే ఇలా థియేట‌ర్లు ల‌భించ‌క అల్లాడుతున్న చిన్న నిర్మాత‌ల పాలిట కామ‌ధేను క‌ల్పివృక్షంగా మారాయి ఓటీటీ ప్లాట్ ఫామ్స్‌. వీటి ప్ర‌భావం మొద‌ల‌య్యాక చిన్న చిత్రాల నిర్మాత‌ల్లో కొండంత ధైర్యం వ‌చ్చింది. త‌మ సినిమాల‌కు థియేట‌ర్లు ల‌భించ‌క‌పోయినా ఫ‌ర‌వాలేద‌ని ఓటీటీల్లో రిలీజ్ చేస్తామంటూ ధైర్యంగా సినిమాలు నిర్మించ‌డం మొద‌లు పెట్టారు.

అయితే ఇప్పుడు వారి ఆశ‌ల‌కు ఓటీటీ ప్లాట్ ఫామ్ ల విష‌యంలోనూ అడ్డుక‌ట్ట ప‌డ‌బోతోందా? .. థియేట‌ర్ల విష‌యంలో అడ్డుత‌గిలిన‌న వారే ఓటీటీ వేదిక‌ల్లోనూ అడ్డ‌గోడ‌గా మార‌బోతున్నారా? అంటే తాజా ప‌రిణామాలు అలాగే వున్నాయ‌ని చిన్న చిత్రాల నిర్మాత‌లు, ద‌ర్శ‌కులు భ‌యాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్ప‌టికే ఓటీటీల్లో స్టార్ లు కూడా వెబ్ సిరీస్ లు, వెబ్ మూవీలు చేయ‌డం మొద‌లుపెట్టారు. `బాహుబ‌లి` లాంటి సంచ‌ల‌న చిత్రాన్ని నిర్మించిన మేక‌ర్స్ ప్ర‌స్తుతం వెబ్ సిరీస్ ల‌కే ప్రాధాన్య‌త నిస్తున్నారు.

వీరి త‌ర‌హాలోనే స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు కూడా ఓ ప‌క్క భారీ చిత్రాలు నిర్మిస్తూనే మ‌రో ప‌క్క ఓటీటీ కోసం వెబ్ సిరీస్ లు చేయ‌డం మొద‌లుపెట్టారు. అంతే కాకుండా స్టార్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ ఇప్ప‌టికే `ఆహా` ఓటీటీని నిర్వ‌హిస్తూ ప‌లు వెబ్ సిరీస్‌లు, వెబ్ మూవీల‌కు వెన్నుద‌న్నుగా నిలుస్తున్నారు. ఇక మెగా ఫ్యామిలీ నుంచి సుష్మిత వెబ్ సిరీస్ ల నిర్మాణం చేపట్టింది. ఇటీవ‌ల నిర్మించిన `సేనాప‌తి`పై విమ‌ర్శ‌క‌ల ప్ర‌శంస‌లు ద‌క్కాయి.

మెగా బ్ర‌ద‌ర్ డాట‌ర్ కొణిదెల నిహారిక `ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ`నిర్మించింది. అన్న‌పూర్ణ స్టూడియోస్ ఇప్ప‌టికే వెబ్ సిరీస్ ల నిర్మాణంతో దూసుకుపోతోంది. ప్రియ‌ద‌ర్శితో చేసిన `లూజ‌ర్` హిట్ కావ‌డంతో దానికి సీక్వెల్ గా `లూజ‌ర్ 2`ని నిర్మించింది. ఇది కూడా మంచి టాక్ ని సొంతం చేసుకోవ‌డంతో మ‌రి కొన్ని సిరీస్ ల‌ని నిర్మించాల‌ని ప్లాన్ చేస్తోంది. రానున్న రోజుల్లో మ‌రింత మంది స్టార్ ప్రొడ్యూస‌ర్ లు, డైరెక్ట‌ర్లు ఓటీటీ బాట ప‌ట్ట‌బోతున్నారు.

దీంతో నిన్న థియేట‌ర్స్..ఇప్పుడు ఓటీటీలోనూ పాగా వేసేస్తున్నారని, అక్క‌డా..ఇక్క‌డా... మ‌ళ్లీ ఆ న‌లుగురేనా అంటూ చిన్న చిత్రాల నిర్మాత‌ల‌తో పాటు కొత్త‌గా డైరెక్ట‌ర్లు గా ప‌రిచ‌యం కావాల‌ని కోటి ఆశ‌ల‌తో ఎదురుచూస్తున్న యంగ్ స్ట‌ర్స్ ఇప్ప‌డు భ‌య‌ప‌డుతున్నారు. సినిమాల్లో వారిదే పై చేయి అయింద‌ని, ఇక ఓటీటీల్లోనూ వారి హ‌వా మొద‌లైతే ఇక్క‌డ కొత్త వాళ్ల‌ని ప‌ట్టించుకునే వారు వుండ‌ని వాపోతున్నారు.