Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ: 'యాత్ర'

By:  Tupaki Desk   |   8 Feb 2019 9:12 AM GMT
మూవీ రివ్యూ: యాత్ర
X
చిత్రం : 'యాత్ర'

నటీనటులు: మమ్ముట్టి - జగపతి బాబు - రావు రమేష్ - అనసూయ భరద్వాజ్ - సచిన్ ఖేద్కర్ - సుహాసిని - పోసాని కృష్ణమురళి - అశ్రిత వేముగంటి తదితరులు
సంగీతం: కే
ఛాయాగ్రహణం: సత్యన్ సూర్యన్
నిర్మాతలు: విజయ్ చిల్లా - శశి దేవిరెడ్డి
రచన - దర్శకత్వం: మహి.వి.రాఘవ్

దేశవ్యాప్తంగా బయోపిక్స్ హవా నడుస్తోందిప్పుడు. ‘మహానటి’ తర్వాత తెలుగులోనూ ఈ ఒరవడి పెరిగింది. ఇటీవలే ‘యన్.టి.ఆర్-కథానాయకుడు’ సినిమా చూశాం. ఇప్పుడు మరో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితంలోని ముఖ్య ఘట్టాల నేపథ్యంలో తెరకెక్కిన ‘యాత్ర’ ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో 2004 ఎన్నికలకు ముందు నాటి రాజకీయ, సామాజిక పరిస్థితుల్ని చూపించడంతో మొదలవుతుందీ కథ. అప్పటి చంద్రబాబు సర్కారు ఎన్నికల్లో విజయంపై ధీమాతో ముందస్తుకు సిద్ధం కాగా.. కాంగ్రెస్ పార్టీ నేతలు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎన్నికల్లో గెలవడం సాధ్యం కాదన్న భావనతో ఉంటారు. అలాంటి సమయంలో అసలు జనం సమస్యలేంటో.. వాళ్లు ప్రభుత్వాల నుంచి ఏం ఆశిస్తున్నారో తెలుసుకోవడానికి వైఎస్ పాదయాత్ర మొదలుపెడతాడు. ఈ యాత్రలో జనం నాడిని వైఎస్ ఎలా పట్టుకున్నాడు.. వాళ్ల అభిమానాన్ని ఎలా చూరగొన్నాడు.. ఈ యాత్ర 2004 ఎన్నికల్లో గెలిచి వైఎస్ ముఖ్యమంత్రి కావడానికి ఎలా దోహదపడింది అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

‘యాత్ర’ వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ కాదు. ఆయన రాజకీయ జీవితంలో అత్యత కీలకంగా నిలిచిన పాదయాత్ర చుట్టూ నడిచే ఒక ఎమోషనల్ జర్నీ మాత్రమే. కేవలం ఈ యాత్ర చుట్టూ కథ అల్లి సినిమాగా తీయాలనుకోవడం సాహసమే. ఇందులో వైఎస్‌ ను గొప్పగా చూపించే ప్రయత్నం చేస్తారన్నది ఊహించిన విషయమే. ఐతే సినిమాగా తీయడానికి.. మెప్పించడానికి అనేక పరిమితులున్న ఈ కథను ఎంత మేరకు కన్విన్సింగ్ తెరపై ప్రెజెంట్ చేస్తారన్న విషయంలో ప్రేక్షకుల్లో సందేహాలున్నాయి. వైఎస్ మీద ఎవరికెలాంటి అభిప్రాయాలున్నాయి.. ఈ సినిమా ఏ ఉద్దేశంతో తీశారు అన్న విషయాలు పక్కన పెట్టి.. రాజకీయ కోణంలో కాకుండా మామూలుగా చూస్తే ‘యాత్ర’ సగటు ప్రేక్షకుడికి ఇది ఎలాంటి భావన కలిగిస్తుందన్నది కీలకమైన విషయం. ఈ విషయంలో ‘యాత్ర’ పాస్ మార్కులు వేయించుకుంటుంది. ‘యాత్ర’ను ఎమోషనల్ గా ప్రేక్షకులకు కనెక్ట్ చేయడంలో మహి.వి.రాఘవ్ విజయవంతం అయ్యాడు. తెలిసిన విషయాల్నే ప్రభావవంతంగా తెరమీద చూపించాడతను. వైఎస్ పాత్రను మమ్ముట్టి పోషించడం.. ఆ పాత్రలో ఆయన అద్భుత అభినయం ప్రదర్శించడం సగటు ప్రేక్షకుల్ని మెప్పించే విషయం.

పాదయాత్ర ద్వారా వైఎస్ ఒక నాయకుడిగా ఎలా పరిణామం చెందాడన్న విషయాన్ని ప్రధానంగా హైలైట్ చేస్తుంది ‘యాత్ర’. వైఎస్ అమలు చేసిన ప్రధానమైన సంక్షేమ పథకాల ఆలోచన ఎలా పుట్టిందో తెర మీద ప్రభావవంతంగా చూపించాడు మహి.వి.రాఘవ్. వ్యవసాయాన్ని నమ్ముకుని రైతులు ఎంత దయనీయ స్థితికి చేరిన వైనాన్ని చూసి చలించిపోయి ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రకటించడం.. ఆసుపత్రిలో ఒక చిన్నారి మరణానికి కదిలిపోయి ఆరోగ్యశ్రీ పథకానికి రూపకల్పన చేయడం.. ఇంకా ఫీజు రీఎంబర్స్ మెంట్, అర్హులందరికీ పింఛను లాంటి పథకాల దిశగా వైఎస్ అడుగులు వేయడం లాంటి విషయాల్ని ‘యాత్ర’లో హైలైట్ చేశాడు. వైఎస్ పాదయాత్ర మొదలుపెట్టడానికి ముందు కథను నడిపించిన విధానం ఆసక్తి రేకెత్తిస్తుంది. అప్పటి రాజకీయ పరిస్థితుల్ని.. వైఎస్ వ్యక్తిత్వాన్ని చూపిస్తూ సాగే ఆరంభ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఐతే పాదయాత్ర మొదలైనప్పటి నుంచి ‘యాత్ర’ డాక్యుమెంటరీ మోడ్ లోకి వెళ్లిపోతుంది. వైఎస్ జీవితాన్ని పూర్తిగా చూపించినట్లయితే.. డ్రామాకు అవకాశం ఉండేది. పాదయాత్ర కారణంగా వైఎస్ ఎలా పరిణామం చెందాడని మాటలతో చెప్పారు కానీ.. అంతకుముందు వైఎస్ ఎలాంటి వాడు.. ఎంత మొండిగా ఉండేవాడు అనే విషయాల్ని పెద్దగా ఎస్టాబ్లిష్ చేయలేదు. దీని వల్ల ఈ పరిణామాన్ని ప్రేక్షకులు పెద్దగా ఫీలవ్వరు.

ఎలాంటి సినిమాకైనా ‘విలన్’ ఫ్యాక్టర్ లేకపోతే డ్రామా పండటం కష్టం. బయోపిక్స్ లో కూడా ప్రేక్షకులు అది ఆశిస్తారు. కనీసం పరిస్థితుల్ని అయినా విలన్ గా చూపించాలి. ఐతే ‘యాత్ర’లో ఈ టచ్ తక్కువగానే కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ మీద అక్కడక్కడా సెటైర్లు పడ్డాయి. ఓటుకు నోటు కేసుతో చంద్రబాబు మార్క్ ‘బ్రీఫ్డ్ మి’ పదం ఎలా పాపులర్ అయిందో తెలిసిందే. దీన్ని ఇందులో వాడుకుని సెటైర్ వేశారు. ఆ సీన్ ప్రేక్షకుల్లో ఉత్తేజం తెస్తుంది. సినిమాలో చంద్రబాబును చూపించలేదు కానీ.. ఆయన ప్రస్తావన మాత్రం ఉంది. విశేషం ఏంటంటే ‘యాత్ర’లో తెలుగుదేశం పార్టీ కంటే కాంగ్రెస్ అధిష్టానాన్ని విలన్ లాగా చూపించారు. వైఎస్.. కాంగ్రెస్ హైకమాండ్ ను డిక్టేట్ చేసినట్లుగా చూపించి కొన్ని చోట్ల ఎమోషనల్ హై ఇవ్వడానికి ప్రయత్నించారు. వైఎస్ ను ఎలివేట్ చేయడానికి ఉద్దేశించిన సినిమా కాబట్టి.. ఆయన గురించి సినిమా అంతటా పాజిటివ్ గా చూపించారు. కొన్ని చోట్ల ఎగ్జాజరేషన్లు కనిపిస్తాయి. ఇవి ఇతర పార్టీల వాళ్లు.. వైఎస్ వ్యతిరేకుల్ని ఇబ్బంది పెట్టొచ్చు. ఐతే వైఎస్ ను అభిమానించే.. ఆరాధించే వాళ్లను మాత్రం ఎమోషనల్ గా కదిలించే సీన్లు సినిమాలో చాలా ఉన్నాయి.

వైఎస్ ను ఏదో ఒక సందర్భంలో అభిమానించిన వాళ్లను ‘యాత్ర’ ఎమోషనల్ గా కదిలిస్తుంది. అలా కాకుండా తటస్థంగా ఉండే వాళ్లకు మాత్రం ఇది వైఎస్ షో రీల్ లాగా అనిపించవచ్చు. వైఎస్ కు ఇచ్చిన ఎలివేషన్.. ప్రత్యర్థులపై సెటైర్లు.. ఇవన్నీ ఈ సినిమా వెనుక వైఎస్సార్ కాంగ్రెస్ ఉందన్న భావన కచ్చితంగా కలిగిస్తాయి. 2004 ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రిగా వైఎస్ ప్రమాణం చేయడంతో కథను ముగించి.. ఆ తర్వాత వైఎస్ మరణం సంబంధించిన దృశ్యాలతో ఒక ఎమోషనల్ సాంగ్ పెట్టారు చివర్లో. అది వైఎస్ అభిమానులకు కన్నీళ్లు తెప్పిస్తుంది. సినిమాలో జగన్ పాత్ర లేదు కానీ.. చివర్లో అతను కనిపిస్తాడు. ఓవరాల్ గా ‘యాత్ర’ గురించి చెప్పాలంటే 2003-04 నాటి పాదయాత్రతో ముడిపడ్డ వైఎస్ రాజకీయ ప్రస్థానాన్ని ఎమోషనల్ గా చూపించే ప్రయత్నమిది. వైఎస్ అభిమానుల్ని ఇది ఎమోషనల్ గా టచ్ చేస్తుంది. ఐతే ఎంచుకున్న కథాంశానికి ఉన్న పరిమితుల దృష్ట్యా సగటు ప్రేక్షకుడికి ‘యాత్ర’ ఓ మోస్తరుగా అనిపిస్తుంది. తటస్థ ప్రేక్షకులు ప్రధానంగా మమ్ముట్టి కోసం ఈ సినిమా ఒకసారి చూడొచ్చు.

నటీనటులు:

‘యాత్ర’ సినిమాకు అతి పెద్ద ఆకర్షణ మమ్ముట్టినే. ఆయన వైఎస్ పాత్ర చేయడానికి ఒప్పుకోవడంతోనే ఈ సినిమాపై జనాలకు ప్రత్యేక ఆసక్తి కలిగింది. ఇక సినిమాలో వైఎస్ పాత్రలో మమ్ముట్టి ఒదిగిపోయిన తీరుకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. బాడీ లాంగ్వేజ్ - డైలాగ్ డెలివరీ విషయంలో వైఎస్‌ ను అనుకరించడం కాకుండా.. పాత్ర తాలూకు ఆత్మను పట్టుకోవడనికే ప్రయత్నించారు మమ్ముట్టి. ఇక్కడే నటుడిగా ఆయన గొప్పదనం ఏంటన్నది అర్థమవుతుంది. ఇది వైఎస్ మీద తీసిన సినిమా అయినప్పటికీ.. ఆయన అభిమానులే కాక సామాన్య ప్రేక్షకులు కూడా కొంతమేర సినిమాలో ఇన్వాల్వ్ కావడానికి మమ్ముట్టి కారణమవుతాడు. ఎమోషనల్ సీన్లలో మమ్ముట్టి చూపించిన ఇంటెన్సిటీ.. ఆ సన్నివేశాల్లో గాఢతను పెంచింది. సినిమా అంతా మమ్ముట్టి షోనే కనిపిస్తుంది. మిగతా నటీనటులకు పెద్ద పాత్రలేమీ లేవు. కేవీపీ రామచంద్ర రావుగా రావు రమేష్.. వైఎస్ సతీమణి విజయమ్మగా సుశ్రిత.. సబితా ఇంద్రారెడ్డిగా సుహాసిని తదితరులు ఆయా పాత్రల్లో బాగానే ఒదిగిపోయారు. సచిన్ ఖేద్కర్.. పృథ్వీ.. పోసాని లాంటి వాళ్లు ఓకే.

సాంకేతిక వర్గం:

‘యాత్ర’ సాంకేతికంగా మంచి స్థాయిలోనే కనిపిస్తుంది. కృష్ణ కుమార్ అలియాస్ కే సినిమాకు తగ్గ సంగీతం అందించాడు. పాటలు.. నేపథ్య సంగీతం చాలా వరకు ఎమోషనల్ గా సాగుతాయి. సత్యన్ సూర్యన్ ఛాయాగ్రహణం కూడా బాగుంది. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. సినిమా అంతటా ఒక క్వాలిటీ కనిపిస్తుంది. ఇక దర్శకుడు మహి.వి.రాఘవ్.. వైఎస్ గురించి తానేం చెప్పదలుచుకున్నాడో అది ఒక కన్విక్షన్ తో చెప్పే ప్రయత్నం చేశాడు. దర్శకుడిగా అతడి ప్రతిభ మాత్రం తెరపై కనిపిస్తుంది. ఎమోషనల్ సీన్స్ ను అతను డీల్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. ఐతే అతను ఎంచుకున్న కథాంశమే చాలా పరిమితులున్నది. దాన్ని ఉన్నంతలో మెరుగ్గానే తీశాడు కానీ.. ఇది అందరికీ రుచిస్తుందా లేదా అన్నది సందేహమే.

చివరగా: యాత్ర.. ఎమోషనల్ జర్నీ ఆఫ్ వైఎస్సార్

రేటింగ్-3.25/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre