Begin typing your search above and press return to search.

యాత్ర టీజర్ రెడీ అవుతోందా?

By:  Tupaki Desk   |   4 July 2018 8:21 AM GMT
యాత్ర టీజర్ రెడీ అవుతోందా?
X
ప్రస్తుతం టాలీవుడ్‌కు బయోపిక్ ఫీవర్ పట్టుకుంది. ‘మహానటి’ ఘనవిజయం సాధించడంతో ఈ జానర్ సినిమాలకు ఊపొచ్చింది. ఒకేసారి ఎన్టీఆర్.. వైఎస్సార్ సినిమాలకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్ బయోపిక్ కొంచెం ఆలస్యం కాగా.. వైఎస్ సినిమా ఆల్రెడీ సెట్స్ మీదికి వెళ్లిపోయింది. చకచకా చిత్రీకరణ చేస్తున్నారు. సింగిల్ షెడ్యూల్లో సినిమాను పూర్తి చేయడానికి ప్రణాళికలు వేసుకున్నాడు దర్శకుడు మహి.వి.రాఘవ్.

ఓవైపు చిత్రీకరణలో బిజీగా ఉంటూనే ‘యాత్ర’ టీజర్‌ ను కూడా మహి సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. జులై 8న వైఎస్ జయంతి రాబోతోంది. ఆ రోజు ఆయన అభిమానులకు ‘యాత్ర’ టీజర్ ను బహుమతిగా ఇవ్వాలని చిత్ర బృందం భావిస్తోందట. ఒక ఆసక్తికర టీజర్ కోసం ఇప్పటికే కాన్సెప్ట్ రెడీ చేసి పని మొదలుపెట్టేశారట. ఒకట్రెండు రోజుల్లో టీజర్ రెడీ అవుతుందని.. జులై 8న వైఎస్ అభిమానులకు ఇది మంచి కానుక అవుతుందని అంటున్నారు. దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశముంది.

వైఎస్ 2004లో అధికారంలోకి రావడానికి ప్రధాన కారణాల్లో ఒకటైన పాదయాత్రను హైలైట్ చేస్తూ ‘యాత్ర’ సినిమాను తీర్చిదిద్దుతున్నాడు మహి. మమ్ముట్టి లాంటి నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ వైఎస్ పాత్రను చేస్తుండటంతో ఈ చిత్రంపై అందరిలోనూ అమితాసక్తి నెలకొంది. ఇంకా ఇందులో జగపతిబాబు.. రావు రమేష్.. పోసాని కృష్ణమురళి.. అనసూయ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మహితో ‘ఆనందో బ్రహ్మ’ తీసిన 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ఆరంభంలో ‘యాత్ర’ ప్రేక్షకుల ముందుకొస్తుంది.