Begin typing your search above and press return to search.

ఆ నటి చేసిన దారుణ తప్పు తర్వాతైనా సెలబ్రిటీలు కళ్లు తెరుస్తారా?

By:  Tupaki Desk   |   6 Aug 2021 3:19 AM GMT
ఆ నటి చేసిన దారుణ తప్పు తర్వాతైనా సెలబ్రిటీలు కళ్లు తెరుస్తారా?
X
చేయకూడని తప్పు చేయటం.. తీరిగ్గా పశ్చాతాపపడటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఎంత వేదనకు గురైనా.. పోయిన ప్రాణం తిరిగి రాదు. తన కారణంగా.. తన స్నేహితురాలి ప్రాణం పోయిందన్న వేదన వర్ణణాతీతం. ఇక.. బాధితురాలి కుటుంబ సభ్యుల లోటును ఎవరూ తీర్చలేరు. వారి గర్భశోకం వెంటాడుతూనే ఉంటుంది. ఈ మధ్యన కోలీవుడ్ నటి యాషికా ఆనంద్ రోడ్డు ప్రమాదానికి గురి కావటం.. అందులో ఆమె మిత్రురాలి.. హైదరాబాద్ కు చెందిన ఐటీ ఉద్యోగిని మరణించటం తెలిసిందే.

మస్తు పార్టీ చేసుకొని.. ఫుల్ గా మద్యాన్ని సేవించి వేగంగా కారు నడపటం.. ఈ క్రమంలో చోటు చేసుకున్న దారుణ ప్రమాదంలో స్నేహితురాలిని కోల్పోయిన యాషికా ఆనంద్ ఇప్పుడు తీవ్రస్థాయిలో వేదనకు గురవుతోంది. మహాబలిపురం వద్ద జరిగిన కారు యాక్సిడెంట్ పై తాజాగా ఆమె స్పందించారు. తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. తన జీవితంలో ఎన్నడూ లేని బాధను తాను అనుభవిస్తున్నట్లు చెప్పారు. ‘మాటల్లో చెప్పలేను. నేనింకా ప్రాణాలతో బతికి ఉన్నందుకు లోలోన కుమిలిపోతున్నా. దారుణ ప్రమాదంలో ప్రాణాలతో బయపడినందుకు దేవుడికి థ్యాంక్సు చెప్పాలా? నా స్నేహితురాలుపావనీ ప్రాణాలు పోయినందుకు భగవంతుడ్ని నిందించాలో అర్థం కావట్లేదు. మా నుంచి శాశ్వితంగా దూరమైన పావనిని అనుక్షణం మిస్ అవుతున్నా’ అంటూ ఎమోషనల్ మెసేజ్ పోస్టు చేశారు.

ఇలాంటివి ఎన్ని పెట్టినా పోయిన ప్రాణమైతే తిరిగి రాదు. వారి కుటుంబ సభ్యుల వేదనను తీర్చలేనిది. తన పోస్టులో పావని తల్లిదండ్రుల ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. ‘నువ్వు నన్ను ఎప్పటికి క్షమించవని తెలుసు. నీ కుటుంబాన్ని బాధాకరమైన స్థితిలోకి నెట్టినందుకు నన్ను క్షమించు. నువ్వు మళ్లీ మా మధ్యకు రావాలని కోరుకుంటున్నా’ అని పేర్కొన్నారు. ఇంతటి బాధకు బదులు.. ఫుల్ గా తాగేసిన వేళ డ్రైవ్ చేయకూడదన్న ఆలోచన వచ్చి ఉంటే.. ప్రమాదమే కాదు.. మంచి ఫ్రెండ్ అయిన పావని కూడా ప్రాణాలతో ఉండేది. ఇంతటి పశ్చాతాపం ఉండేది కాదు కదా?