Begin typing your search above and press return to search.

రూ.50లకే చూసేయండి.. బంఫర్ ఆఫర్ ఇస్తున్నారట

By:  Tupaki Desk   |   10 Nov 2020 10:45 AM IST
రూ.50లకే చూసేయండి.. బంఫర్ ఆఫర్ ఇస్తున్నారట
X
కరోనా కారణంగా ఊహకు అందని ఎన్నో అంశాలు చోటు చేసుకున్నాయి. కరోనా ముందు వరకు మూడు పువ్వులు.. ఆరు కాయలుగా నడిచిన సినిమా వ్యాపారం.. ఇప్పుడు అందుకు భిన్నంగా తీవ్రమైన సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. లాక్ డౌన్ నేపథ్యంలో థియేటర్లను మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దాదాపు ఆర్నెల్లుపైగా సినిమా థియేటర్లు.. మల్టీఫ్లెక్సులు అందుబాటులోకి రాకుండా పోయాయి. ఇటీవల అన్ లాక్ లో భాగంగా మల్టీఫ్లెక్సులు ఓపెన్ అయినా.. అన్ని రాష్ట్రాల్లో మాత్రం ఓపెన్ చేయలేదు. ఓపెన్ అయిన చోట్ల ప్రేక్షకులు పెద్దగా రాని పరిస్థితి.

కొన్ని మల్టీఫ్లెక్సుల్లో అయితే వేళ్ల మీద లెక్కించేంతగా మాత్రమే ప్రేక్షకులు రావటంతో..వారు కిందామీదా పడుతున్నారు. తొక్కలో సినిమాను థియేటర్లలో చూడకున్నా ఫర్లేదు..సినిమా కోసం జీవితాన్ని రిస్కులో పడేసుకోలేం కదా? అన్న క్వశ్చన్ పలువురి నోటి నుంచి వస్తోంది. థియేటర్ సినిమాకు ప్రత్యామ్నాయంగా ఎవరిళ్లలో వారు.. పెద్ద తెరల టీవీల్ని కొనుగోలు చేయటం ఎక్కువ అవుతుంది.

ఇంట్లో ఎంత పెద్ద టీవీ ఉన్నా.. థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ మాత్రంథియేటర్లోనే సాధ్యం. ఈ విషయాన్ని మళ్లీ గుర్తు చేసేందుకు ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ యశ్ రాజ్ రంగంలోకి దిగింది. తాజాగా తమసంస్థను ఏర్పాటు చేసి 50 ఏళ్లు అయిన నేపథ్యంలో తాము నిర్మించిన సూపర్ హిట్ మూవీల్ని మరోసారి విడుదల చేయాలని భావిస్తోందట.

తమ బ్యానర్ పై నిర్మించిన సూపర్ హిట్ సినిమాల్ని మరోసారి రిలీజ్ చేసి.. టికెట్ ధరను రూ.50గా నిర్ణయించారు. ఈ నెల 12 నుంచి 19 వరకు ఈ ఆఫర్ ను అందజేయాలని భావిస్తున్నారు. యశ్ రాజ్ సంస్థ చేపట్టిన ఈ ప్రోగ్రాంను ప్రమోట్ చేసేందుకు పీవీఆర్..ఐనాక్స్.. సినీపాలీస్ లాంటి మల్టీఫ్లెక్సులు ముందుకు వచ్చాయి. మరి.. ప్రేక్షకులు ఏ మేరకు ముందుకు వస్తారో చూడాలి.