Begin typing your search above and press return to search.

దిగ్గ‌జ ర‌చ‌యిత ‘కారా’ అస్త‌మ‌యం

By:  Tupaki Desk   |   4 Jun 2021 4:00 PM IST
దిగ్గ‌జ ర‌చ‌యిత ‘కారా’ అస్త‌మ‌యం
X
రచయితలు ఎంతో మంది వ‌స్తుంటారు.. కానీ కొంద‌రు మాత్ర‌మే పాఠ‌కుల మ‌న‌సులో చెర‌గ‌ని ముద్ర‌వేస్తారు. అలాంటి వారిలో ఒక‌రు కాళీప‌ట్నం రామారావు (కారా). ఎన్నో అద్భుత‌మైన క‌థ‌ల‌ను అందించిన మ‌హా ర‌చ‌యిత ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఆయ‌న వ‌య‌సు 97 సంవ‌త్స‌రాలు. శ్రీకాకుళంలోని ఆయ‌న స్వ‌గృహంలో శుక్ర‌వారం క‌న్నుమూశారు.

1924లో శ్రీకాకుళం జిల్లా ముర‌పాక‌లో జ‌న్మించిన రామారావు.. ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఈ క్ర‌మంలో సామాన్యుల జీవితాల‌ను ద‌గ్గ‌ర‌గా చూసిన ఆయ‌న‌.. త‌న‌ ర‌చ‌న‌ల ద్వారా క‌ళ్ల‌కు క‌ట్టారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్నో క‌థ‌ల‌ను రాసిన ఆయ‌న‌కు.. 1964లో రాసిన ‘యజ్ఞం’ ఎన‌లేని కీర్తిని తెచ్చిపెట్టింది. ఈ క‌థ‌కు కేంద్ర సాహిత్య అకాడ‌మీ పుర‌స్కారం కూడా ద‌క్కింది. భూస్వామ్య వ్య‌వ‌స్థలోని దోపిడీని క‌ళ్ల‌కు క‌ట్టిన ఈ ర‌చ‌న‌.. ఎంతో మంది మ‌న‌సు గెలుచుకుంది.

య‌జ్ఞంతోపాటు కుట్ర‌, రాగ‌మ‌యి, జీవ‌ధార‌, కారా క‌థ‌లు, రుతుప‌వ‌నాలు వంటి ఎన్నో అద్భుత‌మైన ర‌చ‌న‌లు కారా క‌లం నుంచి జాలువారాయి. త‌న క‌థ‌లతోపాటు ఇత‌ర ర‌చ‌న‌లు పాఠ‌కుల‌కు అందుబాటులో ఉండాల‌నే ఉద్దేశంతో 1997లో శ్రీకాకుళంలో ‘కథానిలయం’ స్థాపించారు. ప్రస్తుతం అక్కడ లక్షకుపైగా పుస్తకాలు అందుబాటులో ఉండ‌డం గ‌మ‌నార్హం.

ఆ త‌ర్వాత kathanilayam.com అనే వెబ్ సైట్ ను ఏర్పాటు చేసి, ఈ క‌థ‌ల‌న్నింటినీ డిజిట‌లైజ్ చేసే ప్ర‌క్రియ కూడా మొద‌లు పెట్టారు. ఇప్ప‌టి వ‌ర‌కు దాదాపు స‌గానికి పైగా పుస్త‌కాల‌ను డిజిట‌లైజ్ చేయ‌డం పూర్త‌యింద‌ని నిర్వాహ‌కులు చెప్పారు.

కాళీప‌ట్నం రామారావు మృతిప‌ట్ల సాహిత్యాభిమానులు, క‌వులు, ర‌చ‌యిత‌లు సంతాపం వ్య‌క్తంచేశారు. సాహిత్య రంగానికి ఆయ‌న చేసిన సేవ‌లు అమోఘ‌మైన‌వ‌ని కీర్తించారు.