Begin typing your search above and press return to search.

నా కళ్లముందు అతనలా చేస్తే ఊర్కుంటానా?: రెజీనా

By:  Tupaki Desk   |   13 July 2022 12:30 AM GMT
నా కళ్లముందు అతనలా చేస్తే ఊర్కుంటానా?: రెజీనా
X
టాలీవుడ్ లో రెజీనా కథానాయికగా తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకుంది. తెలుగు తెరకి ఆమె పరిచయమై పదేళ్లు అవుతోంది. 'శివ మనసులో శృతి' సినిమాతో ఆమె టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది. 'పిల్లా నువ్వులేని జీవితం' .. 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' .. 'జ్యో అచ్యుతానంద' .. 'ఎవరు' వంటి హిట్స్ ఆమె ఖాతాలో ఉన్నాయి. ఇటీవలే 'ఆచార్య' సినిమాలో స్పెషల్ సాంగ్ లోను ఆమె దుమ్ము దులిపేసింది. ప్రస్తుతం ఆమె తమిళ సినిమాలతోను బిజీగా ఉంది. తాజాగా ఆమె 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో అనేక విషయాలను పంచుకుంది.

చిన్నప్పుడు నేను స్కూల్లో చదువుకునే రోజుల్లో ఒక కుర్రాడు వచ్చి నా బుగ్గ గిల్లాడు .. దాంతో మచ్చ పడిపోయింది. అలా చేస్తుంటే ఎందుకు ఊర్కున్నావంటూ మా అమ్మ కోప్పడింది. నా వరకూ తీసుకొచ్చి చెప్పొద్దూ .. నువ్వే చూసుకోవాలి అనేసింది. అంతే మరుసటి రోజు ఆ కుర్రాడి చెంపమీద ఒక్కటిచ్చుకున్నాను. ధైర్యం అనేది బయటి నుంచి తెచ్చుకునేది కాదు .. మన లోపలే ఉంటుందనే విషయం అప్పుడే నాకు అర్థమైంది.

ఇప్పటికీ కూడా నేను డామినేట్ చేస్తానని చాలామంది అంటారు .. కానీ నాకు అలా అనిపించదు. నాకు కోపం వస్తే కంట్రోల్ చేసుకోలేను. స్కూల్ డేస్ లోనే కాదు .. కాలేజ్ రోజుల్లోను .. సినిమాల్లోకి వచ్చాక కూడా అవతలవారిని కొట్టేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఆ కోపం వెనుక అహంభావం ఉండదు .. సరైన కారణం ఉంటుంది. ఒకసారి 'ఆగ్రా'లో ఒక సినిమా షూటింగు జరుగుతోంది.

అక్కడి వీధులు చాలా ఇరుకుగా ఉంటాయి. ఒక వీధిలో మా సినిమా షూటింగుకి ఏర్పాట్లు జరుగాయి. నేను కెమెరా ముందుకు వెళ్లి నిలబడ్డాను. చుట్టూ కెమెరాలు ఫిక్స్ చేశారు.

అదే సమయంలో దూరం నుంచి ఒక కుక్క అటుగా వస్తోంది. అది కెమెరా దాటి వెళ్లిపోయే వరకూ వెయిట్ చేద్దామని అంతా చూస్తున్నాం. ఇంతలో లోకల్ గా ఉండే ఒకతను వచ్చి తన బూట్ కాలుతో ఆ కుక్కను తన్నాడు.

అది బాధతో అక్కడి నుంచి అరుస్తూ వెళ్లిపోయింది. అతనలా చేయడంతో నాకు విపరీతమైన కోపం వచ్చేసింది. అంతే వేరే ఆలోచన చేయకుండా వెళ్లి కొట్టేశాను. నాకు మూగ జంతువులంటే చాలా ఇష్టం. వాటికి ఎవరైనా కష్టం కలిగిస్తే చూస్తూ ఊర్కోవడం నా వల్ల కాదు" అంటూ చెప్పుకొచ్చింది.