Begin typing your search above and press return to search.

బుల్లితెర‌పై సినిమా వీక్ష‌ణ యాడ్స్ లేకుండా?

By:  Tupaki Desk   |   29 Oct 2022 4:07 AM GMT
బుల్లితెర‌పై సినిమా వీక్ష‌ణ యాడ్స్ లేకుండా?
X
సినిమా వీక్ష‌ణ విధానంలో కొత్త ప‌ద్ధ‌తులు పుట్టుకొచ్చాయి. ముఖ్యంగా ఓటీటీల రాక‌తో అమాంతం స‌న్నివేశం మారిపోయింది. ప్ర‌స్తుతం థియేట‌ర్ల‌లో ఆద‌ర‌ణ బావున్నా కానీ ఓటీటీల‌కు ఆద‌ర‌ణ త‌గ్గ‌డం లేదు. క‌రోనా క్రైసిస్ కాలంలో ఓటీటీల‌న్నీ బ‌లం పుంజుకున్నాయి. దేశంలో మారుమూల గ్రామాల‌కు సైతం హైస్పీడ్ ఇంట‌ర్నెట్ అందుబాటులోకి రావ‌డంతో ప్ర‌జ‌లు త‌మ స్మార్ట్ ఫోన్ల‌లోనే సినిమాలు షోలు చూస్తున్నారు. ఇక ఓటీటీలో అయితే త‌మ‌కు న‌చ్చిన సినిమాల‌ను వీక్షించే వెసులుబాటు ఉంది. అమెజాన్ ఇప్ప‌టికే ఇండియా మార్కెట్లో పెద్ద స‌క్సెస్ సాధించ‌డానికి కార‌ణ‌మిదే. పైగా యాడ్-ఫ్రీ విధానంలో ఓటీటీల్లో సినిమాల వీక్ష‌ణ పెద్ద ఉప‌శ‌మ‌నం క‌లిగిస్తోంది. దీని ప్ర‌భావం ఇప్పుడు బుల్లితెర‌- శాటిలైట్ మార్కెట్ పై తీవ్రంగా ప‌డింద‌ని విశ్లేషిస్తున్నారు. ఇటీవ‌లి కాలంలో టీవీల్లో మూవీ వేస్తే టీఆర్పీలు ఘోరంగా ప‌డిపోతున్నాయి.

ఎంత పెద్ద క్రేజ్ ఉన్న హీరో సినిమాకి అయినా రేటింగ్ స‌రిగా లేదు. దీనికి ప్ర‌ధాన కార‌ణాలను ఇప్పుడు ట్రేడ్ విశ్లేషిస్తోంది. బుల్లితెర‌పై ప్ర‌తి అర్థ గంట పావుగంట‌కు వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల‌తో పాటు సినిమాని వీక్షించాల్సి ఉంటంది. ఇది విసిగించే వ్య‌వహారం. అదే ఓటీటీలో అయితే ఈ ఇబ్బంది ఉండ‌దు. పైగా సినిమాని కొంత భాగం వీక్షించిన త‌ర్వాత ఇత‌ర ప‌నులు చూసుకుని తిరిగి మిగ‌తా భాగాన్ని కొన‌సాగింపుగా వీక్షించేందుకు కూడా వెసులు బాటు ఉంటుంది. ఇవ‌న్నీ ఓటీటీకి పెద్ద ప్ల‌స్ గా మారాయి. ప్ర‌జ‌లు త‌మ విలువైన‌ స‌మ‌యాన్ని ఆదా చేసుకునేందుకు అనువుగా సినిమాలు చూసేందుకు వీలున్న వేదిక‌గా ఓటీటీ ఉప‌యోగ‌ప‌డుతోంది.

ఒరిజిన‌ల్ కంటెంట్ తో దూసుకొచ్చిన 'ఆహా-తెలుగు' ఓటీటీ సైతం ఘ‌న‌విజ‌యం సాధించ‌డానికి ఇలాంటి అనేక కార‌ణాలు ఉన్నాయి. ఏది ఏమైనా ప్రేక్షకులు డిజిటల్ కంటెంట్ కి యూట్యూబ్ కి OTT లకు బానిసలుగా మారార‌ని తాజా ట్రెండ్ చెబుతోంది. స్మార్ట్ ఫోన్ లలో సినిమాలు షోల వీక్ష‌ణ చాలా స‌మీక‌ర‌ణాల‌ను మార్చేస్తోంది. మార్కెట్ లో ఉన్న డిజిటల్ ప్లేయర్లు మెజారిటీ భాగం డిజిటల్ హక్కులను కొనుగోలు చేస్తూ భారీగా ఆర్జిస్తున్నారు.

గత కొన్ని నెలలుగా శాటిలైట్ మార్కెట్ త‌గ్గిపోవ‌డం వెన‌క కార‌ణాల‌ను ఇప్పుడు అన్వేషించాల్సిన ప‌రిస్థితి క‌నిపిస్తోంది. గ‌డిచిన‌ నెలల్లో వీక్షకుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. బుల్లితెర ప్రేక్షకులకు ఇలాంటి తగ్గుదల రావడంతో శాటిలైట్ రైట్స్ కోసం శాటిలైట్ ఛానల్స్ భారీ మొత్తాలను చెల్లించేందుకు సిద్ధంగా లేవని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అగ్ర హీరో చిన్న హీరో అనే తేడా లేకుండా ఇప్పుడు శాటిలైట్ రైట్స్ పూర్తిగా ప‌డిపోయాయ‌ని ట్రేడ్ లో చ‌ర్చ సాగుతోంది. స‌న్ నెక్స్ట్- డిస్నీ హాట్ స్టార్ లాంటి కొన్ని డిజిటల్ ప్లేయర్ లు డిజిటల్ - శాటిలైట్ హక్కులను ప్యాకేజీగా పొందుతున్నాయి.

కానీ ఇటీవ‌ల‌ శాటిలైట్ రైట్స్ కోసం పోటీ మునుప‌టిలా లేదు. అమాంతం స‌న్నివేశం మారిపోయింది. ఇటు సౌత్ అటు నార్త్ లోను ఇదే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. సౌత్ లో తెలుగు- తమిళం -కన్నడ చిత్రాల ప‌రిస్థితి అమాంతం మారింది. శాటిలైట్ హక్కుల ధ‌ర‌లు అతి త్వరలో కనిష్ట స్థాయికి చేరుకుంటాయని డిజిటల్ హక్కులు వాటాను భర్తీ చేయవలసి ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఓవ‌రాల్ గా భారతీయ సినిమాల శాటిలైట్ మార్కెట్ కష్టాల్లో పడింది. దీని నుంచి గ‌ట్టెక్కేందుకు ఇప్పుడు బుల్లితెర యాజ‌మాన్యాలు త‌క్ష‌ణం త‌రుణోపాయం ఆలోచించాల్సి ఉంద‌ని కూడా టాక్ వినిపిస్తోంది. నిర్మాత‌ల‌తో కొన్ని టీవీ చానెళ్లు టై అప్ అయ్యి సినిమాల‌ను నిర్మిస్తున్నాయి. అలాంటి వారికి కంటెంట్ ప‌రంగా ఇబ్బంది ఉండ‌దు. కానీ యాడ్- ఫ్రీ లేని కంటెంట్ కి జ‌నాద‌ర‌ణ త‌గ్గ‌డంతోనే ఈ త‌ర‌హా భాగ‌స్వామ్యాల‌కు ముప్పు ఏర్ప‌డుతుంద‌ని విశ్లేషిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.