Begin typing your search above and press return to search.

కుర్ర భామ టాప్ లీగ్ లో చేరుతుందా..?

By:  Tupaki Desk   |   8 May 2022 1:30 AM GMT
కుర్ర భామ టాప్ లీగ్ లో చేరుతుందా..?
X
టాలీవుడ్ లో తెలుగు హీరోయిన్ల కంటే పరభాషా కథానాయికల హవానే ఎక్కువ ఉంటుందనేది అందరూ అంగీకరించే విషయమే. ఒకప్పుడు బాలీవుడ్ బ్యూటీలను ఇంపోర్ట్ చేసుకునే మేకర్స్.. ఇప్పుడు సౌత్ లోనే కన్నడ - మలయాళ ముద్దుగుమ్మలను తీసుకొస్తున్నారు. అలాంటి వారిలో యంగ్ బ్యూటీ కృతి శెట్టి ఒకరు.

మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ డెబ్యూ మూవీ 'ఉప్పెన' తో హీరోయిన్ గా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది కృతి శెట్టి. అమ్మడికి అదృష్టం కూడా కాస్త ఎక్కువే. ఎందుకంటే ముందుగా ఈ సినిమా కోసం ఎంపిక చేసిన హీరోయిన్ ని తప్పించి మరీ.. మేకర్స్ చివరి నిమిషంలో ఈ కన్నడ బ్యూటీని ప్రాజెక్ట్ లోకి తీసుకొచ్చారు.

ఉప్పెనలో బేబమ్మగా నటించి తెలుగు ప్రేక్షకుల మన్ననలు అందుకుంది కృతి. తొలి సినిమానే యువ హృదయాలను కొల్లగొట్టి ఘన విజయం సాధించడంతో.. వరుస అవకాశాలు అమ్మడి తలుపుతట్టాయి. ఈ క్రమంలో ఆమె నటించిన రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అవడంతో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.

'శ్యామ్ సింగరాయ్' చిత్రంతో నాని తో రొమాన్స్ చేసిన కృతి.. రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇందులో ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోయినా.. నేచురల్ స్టార్ తో ఓ రేంజ్ లో రొమాన్స్ చేయడంతో అందరి దృష్టిని ఆకర్షించగలిగింది.

ఇదే క్రమంలో సంక్రాంతి సందర్భంగా వచ్చిన 'బంగార్రాజు' చిత్రంలో యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య కు జోడీగా నటించింది కృతి. అక్కినేని తండ్రీకొడుకులు కలిసి నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడంతో.. అమ్మడి ఖాతాలోకి హ్యాట్రిక్ హిట్స్ చేరిపోయాయి.

కృతి ప్రస్తుతం సుధీర్ బాబు సరసన 'ఆ అమ్మాయి గురించి చెప్పాలి' అనే సినిమా చేస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నితిన్ తో కలిసి 'మాచర్ల నియోజకవర్గం' అనే సినిమాలలో కృతి హీరోయిన్ గా నటిస్తోంది. ఇది జూలై ఫస్ట్ వీక్ లో రిలీజ్ కానుంది.

అలానే రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న 'ది వారియర్' అనే ద్విభాషా చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోందీ కన్నడ బ్యూటీ. ఇది రామ్ తో పాటుగా కృతికి కూడా డెబ్యూ తమిళ్ మూవీ. 2022 జూలై 14న తెలుగు తమిళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కాబోతోంది.

అంటే కృతి శెట్టి ఈ ఏడాది మూడు సినిమాలతో పలకరించబోతోంది. అయితే ఉప్పెనలా దూసుకొచ్చిన ఈ బ్యూటీని.. మీడియం రేంజ్ హీరోలతో చేస్తున్న చిత్రాలు టాప్ లీగ్‌ లోకి తీసుకెళ్తాయో లేదో అనే సందేహాలు కలుగుతున్నాయి. ఈ విషయాన్ని గ్రహించి స్టార్ హీరోల సినిమాల కోసం ట్రై చేస్తోందని టాక్ వినిపిస్తోంది.

మహేష్ బాబు - రామ్ చరణ్ - ఎన్టీఆర్ - అల్లు అర్జున్.. వంటి స్టార్ హీరోలతో సినిమాల కోసం ఇప్పటికే తన మేనేజర్‌ల ద్వారా ప్రయత్నాలు మొదలు పెట్టిందని అంటున్నారు. అయితే పెద్ద హీరోల సినిమాల్లో నటించాలంటే అదృష్టం ఒక్కటే సరిపోదనే విషయం అందరికీ తెలిసిందే.

అగ్ర హీరోల సరసన నటించాలంటే గ్లామర్ తో పాటుగా ఆకట్టుకునే బ్యూటీ ఉండాలి.. లేదా అద్భుతమైన నటి అయినా అయ్యుండాలి. రెండూ కలబోసిన వారికి మొదటి ప్రాధాన్యత ఉంటుంది. కానీ కృతి ఇప్పటి వరకు తన నటనా ప్రావీణ్యాన్ని ఏ రకంగానూ నిరూపించుకోలేదనే చెప్పాలి. అలానే స్క్రీన్‌ పై పెద్దగా గ్లామర్ ఒలకబోసింది లేదు.

దీనిని బట్టి అమ్మడికి స్టార్ హీరోల సినిమాల్లో నటించే ఛాన్స్ అంత ఈజీగా దొరక్కపోవచ్చనే కామెంట్స్ వినబడుతున్నాయి. మరి ప్రస్తుతం కృతి శెట్టి చేస్తున్న మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్స్ అయితే ఆమెను కన్సిడర్ చేస్తారేమో చూడాలి.