Begin typing your search above and press return to search.

మెగాస్టార్ తమ్ముడి పాత్రలో వరుణ్ తేజ్ నటిస్తాడా..?

By:  Tupaki Desk   |   5 Jun 2021 1:00 PM IST
మెగాస్టార్ తమ్ముడి పాత్రలో వరుణ్ తేజ్ నటిస్తాడా..?
X
మలయాళంలో 100 కోట్లు వసూలు చేసిన 'లూసిఫర్' చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. మోహల్ లాల్ పోషించిన పవర్ ఫుల్ పాత్ర తన తండ్రికి బాగా సూట్ అవుతుందని రామ్ చరణ్ రీమేక్ రైట్స్ తీసుకున్నారు. రీమేక్ చిత్రాల స్పెషలిస్ట్ మోహన్ రాజాకు ఈ పొలిటికల్ థ్రిల్లర్ బాధ్యతలు అప్పగించారు. చిరు నటించబోయే ఈ 153వ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇప్పటికే వచ్చేసింది. అప్పటి నుంచి ఈ ప్రాజెక్ట్ గురించి రోజుకో రూమర్ వస్తూనే ఉంది. ఇప్పుడు తాజాగా మెగా రీమేక్ లో వరుణ్ తేజ్ ఓ కీలక పాత్ర పోషించబోతున్నారని టాక్ వచ్చింది.

'లూసిఫర్' ఒరిజినల్ వెర్షన్ లో హీరోతో పాటుగా మరో మూడు కీలకమైన పాత్రలు ఉన్నాయి. అందులో విదేశాల నుంచి వచ్చి ముఖ్యమంత్రి పదవి కోసం పోటీపడే యువకుడి పాత్ర ఉంటుంది. ఇది హీరో చెప్పినట్లు నడుచుకునే తమ్ముడి పాత్ర. మలయాళంలో ఆ క్యారక్టర్ లో వర్సటైల్ యాక్టర్ టోవినో థామస్ నటించాడు. అయితే ఇప్పుడు తెలుగు వర్షన్ లో ఆ రోల్ లో వరుణ్ తేజ్ ని నటింపజేయాలని చూస్తున్నారట. ఇదే కనుక నిజమై తన పెదనాన్న చిరంజీవి సినిమాలో ఆయనకు తమ్ముడిగా కనిపించడానికి వరుణ్ ఒప్పుకుంటాడో లేదో చూడాలి.

కాగా, కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్ - సూపర్ గుడ్ ఫిలిమ్స్ - ఎన్వీఆర్ సినిమా బ్యానర్స్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఆర్.బి చౌదరి - ఎన్.వి.ప్రసాద్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఎస్.ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. లక్ష్మీ భూపాల్ సంభాషణలు రాస్తున్నారు. రీమేక్ కథ అయినప్పటికీ మెగాస్టార్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని దర్శకుడు మోహన్ రాజా స్క్రిప్ట్ లో తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేస్తున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది.