Begin typing your search above and press return to search.

44 ఏళ్ల నాటి కమల్ - రజినీల చిత్రాన్ని ఇప్పుడు రీమేక్ చేస్తారా..?

By:  Tupaki Desk   |   21 Sep 2022 4:10 AM GMT
44 ఏళ్ల నాటి కమల్ - రజినీల చిత్రాన్ని ఇప్పుడు రీమేక్ చేస్తారా..?
X
కోలీవుడ్‌ కు రెండు కళ్లు లాంటి సౌత్ సీనియర్ హీరోలు కమల్ హాసన్ మరియు రజనీకాంత్ .. కెరీర్ ప్రారంభంలో పలు చిత్రాల్లో కలిసి నటించారు. వీరిద్దరూ 9 తమిళ సినిమాలు.. రెండు తెలుగు చిత్రాలు.. ఒక హిందీ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. వీటిల్లో యాక్షన్ మూవీస్ - ఫ్యామిలీ డ్రామాలతో పాటుగా మహిళ ప్రాధాన్యత చిత్రాలు కూడా ఉన్నాయి. అలాంటి వాటిలో ''అవళ్ అప్పడిదాన్'' సినిమా కూడా ఉంది.

1978లో రజినీ - కమల్ మరియు శ్రీ ప్రియ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'అవళ్ అప్పడిదాన్'. ఇది హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా. పురుషాధిక్య సమాజంలో ఒక స్త్రీకి ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి.. వాటికి ఎదురొడ్డి ఎలా నిలబడింది అనే కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సినిమా కథ శ్రీప్రియ పాత్ర చుట్టూనే ఎక్కువగా తిరుగుతుంది.

సి రుద్రయ్య దర్శకత్వం వహించిన ఈ తమిళ చిత్రం అప్పట్లో మంచి సాధించింది. అయితే దాదాపు 44 ఏళ్ల తర్వాత ఇప్పుడు 'అవళ్ అప్పడిదాన్' సినిమాని రీమేక్ చేయడానికి ప్లాన్స్ జరుగుతున్నాయి. అయితే ఇందులో కమల్ హాసన్ పెద్ద కుమార్తె శృతి హాసన్ మెయిన్ లీడ్ లో కనిపించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.

సమంత డెబ్యూ తమిళ్ మూవీ 'బానా కాత్తడి' ని డైరెక్ట్ చేసిన బద్రి వెంకటేష్.. ఇప్పుడు 'అవళ్ అప్పడిదాన్' చిత్రాన్ని రీమేక్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ విషయాన్ని దర్శకుడు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించారు. దీంతో ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో ఎవరు నటిస్తారనే చర్చ మొదలైంది.

ఇందులో నటి శ్రీప్రియ పాత్రలో శృతి హాసన్ నటించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. అలానే కోలీవుడ్ హీరో శింబు మరియు మలయాళ సహజ నటుడు ఫహద్ ఫాజిల్ లను నటింప చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు టాక్ ఉంది. రజినీ పాత్రలో శింబు.. కమల్ రోల్ లో ఫాహాద్ ని అనుకుంటున్నారట.

నేటి పరిస్థితులకు తగ్గట్టుగా 'అవళ్ అప్పడిదాన్' స్క్రిప్టులో మార్పులు చేసి రీమేక్ చేయనున్నారని తెలుస్తోంది. దీనికి శృతి హసన్ - శింబు మరియు ఫాహాద్ ఫాజిల్ సైడ్ నుంచి పాజిటివ్ సిగ్నల్ వస్తుందో లేదో అనేది ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

ఒక భాషలో హిట్టైన సినిమాలని మరో భాషలో రీమేక్ చేయడం అనేది ఎప్పటి నుంచో మనం చూస్తున్నాం. కాకపోతే అదే భాషలో రీమేక్ చేయడం అనేది చాలా అరుదుగా చూస్తుంటాం. ఇలా రీమేక్ చేయబడిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్స్ గా మిగిలిపోయాయి. అందుకే క్లాసిక్స్ ని ఎవరూ టచ్ చేయాలని అనుకోరు. కానీ ఇప్పుడు 'అవళ్ అప్పడిదాన్' చిత్రాన్ని రీమేక్ చేయాలని అనుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.