Begin typing your search above and press return to search.

టాలెంటెడ్ దర్శకుడికి ఎవరు డేట్స్ ఇస్తారో..?

By:  Tupaki Desk   |   5 Feb 2022 3:30 AM GMT
టాలెంటెడ్ దర్శకుడికి ఎవరు డేట్స్ ఇస్తారో..?
X
'కొత్త బంగారు లోకం' సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన శ్రీకాంత్ అడ్డాల.. తొలి సినిమాతోనే మంచి విజయం అందుకున్నారు. మానవ సంబంధాల నేపథ్యంలో అల్లుకున్న సున్నితమైన కథలను తెర మీదకు తీసుకొస్తూ సెన్సిబుల్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. మహేష్ బాబు - వెంకటేష్ వంటి ఇద్దరు స్టార్ హీరోల కాంబినేషన్ లో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' వంటి తీసి బ్లాక్ బస్టర్ అందుకోవడమే కాదు.. టాలీవుడ్ లో క్రేజీ మల్టీస్టారర్స్ కు నాంది పలికారు. అయితే అలాంటి దర్శకుడికి ఇప్పుడు హీరోలు దొర‌క‌డం లేద‌ని టాక్ వినిపిస్తోంది.

నిజానికి 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాతో క్రేజీ డైరెక్టర్ గా మారిపోయిన శ్రీకాంత్ అడ్డాల.. రెండు బ్యాక్ టూ బ్యాక్ ప్లాప్స్ తో రేసులో వెనకబడిపోయారు. మెగా హీరో వరుణ్ తేజ్ లాంచింగ్ మూవీ 'ముకుంద'.. మహేష్ బాబుతో చేసిన రెండో సినిమా 'బ్రహ్మోత్సవం' ప్రేక్షకులను నిరాశపరిచి బాక్సాఫీస్ వద్ద చతికిలపడ్డాయి. దీంతో శ్రీకాంత్ నుంచి మరో సినిమా రావడానికి ఏకంగా ఐదేళ్లు పట్టింది.

విక్టరీ వెంకటేష్ హీరోగా 'నారప్ప' అనే సినిమా తెరకెక్కించారు శ్రీకాంత్ అడ్డాల. తమిళ్ లో సూపర్ హిట్ అయిన 'అసురన్' చిత్రానికి ఇది అధికారిక తెలుగు రీమేక్. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో రూపొందిన ఈ సినిమా గతేడాది లాక్ డౌన్ టైంలో డైరెక్ట్ ఓటీటీ పద్ధతిలో విడుదలైంది. శ్రీకాంత్ శైలికి పూర్తి భిన్నంగా రీమేక్ సినిమాతో ఓటీటీ ఆడియన్స్ ను మెప్పించారు. ఎక్కువగా రిస్క్ తీసుకోకుండా ఒరిజినల్ చిత్రాన్ని ఫాలో అయిపోయారనే విమర్శకులు కూడా అందుకున్నారు.

ఏదైతేనేం 'నారప్ప' విజయంతో శ్రీకాంత్ అడ్డాల మళ్లీ ట్రాక్ లోకి వచ్చినట్లే అని అందరూ అనుకున్నారు. వెంటనే మరో ప్రాజెక్ట్ ని సెట్స్ మీదకు తీసుకెళ్లారని భావించారు. అయితే ఆ సినిమా వచ్చి ఇన్ని నెలలు గడుస్తున్నా.. ఇంతవరకు దర్శకుడి తదుపరి మూవీ గురించి అధికారిక ప్రకటన రాలేదు. దీంతో 'నార‌ప్ప' ఓటిటి రిలీజ్ అవ్వ‌డంతో శ్రీకాంత్ క‌మ్ బ్యాక్ కి ఈ ప్రాజెక్ట్ పెద్ద‌గా హెల్ప్ అవ్వ‌లేదనే కామెంట్స్ వస్తున్నాయి.

శ్రీకాంత్ అడ్డాల 'అన్నాయ్' అనే సినిమా చేయనున్నట్లు ఆ మధ్య వెల్లడించారు. ఇది గుంటూరు బ్యాక్ డ్రాప్ లో రూపొందే పీరియాడికల్ యాక్షన్ డ్రామా అని.. మూడు భాగాలుగా తెరకెక్కే ట్రైయాలజీ అని తెలిపారు. ఇప్పుడున్న మార్కెట్ కి కథ సరిగ్గా కుదురుతుందని.. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఈ ప్రాజెక్ట్ ఉంటుందని అన్నారు. కానీ ఇంతవరకు ఈ భారీ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి ప్రకటన లేదు. దీనికి కారణంగా హీరోల డేట్స్ దొరక్క పోవడమే అని టాక్ నడుస్తోంది.

'అన్నాయ్' చిత్రాన్ని యువ హీరో శర్వానంద్ తో చేయాలని అడ్డాల శ్రీకాంత్ ప్రయత్నాలు చేస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం శర్వా ఇతర ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. మరి టాలెంటెడ్ డైరెక్టర్ కి ఏ హీరో డేట్స్ ఇస్తారో.. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందో చూడాలి. ఏదేమైనా శ్రీకాంత్ ఈసారి సాలిడ్ హిట్ అందుకొని మళ్ళీ పెద్ద హీరోలతో మల్టీస్టారర్ సినిమాలు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.