Begin typing your search above and press return to search.

స్టార్ హీరోయిన్ 'మన్మథుడు 2' దర్శకుడికి ఓకే చెప్తుందా..?

By:  Tupaki Desk   |   15 Nov 2022 8:30 AM GMT
స్టార్ హీరోయిన్ మన్మథుడు 2 దర్శకుడికి ఓకే చెప్తుందా..?
X
'అందాల రాక్షసి' సినిమాతో హీరోగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న రాహుల్ రవీంద్రన్.. 'టైగర్' 'అలా ఎలా' వంటి మరికొన్ని చిత్రాలతో మెప్పించాడు. ఈ క్రమంలో 'చిలసౌ' చిత్రంతో దర్శకుడిగా మెగాఫోన్ పట్టుకున్నాడు రాహుల్. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా.. రాహుల్ ను డైరెక్టర్ గా సక్సెస్ ఫుల్ గా లాంచ్ చేసింది. ఈ సినిమా బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే విభాగంలో నేషనల్ అవార్డు కూడా అందుకుంది.

దీంతో రెండో సినిమాకే సీనియర్ స్టార్ హీరో కింగ్ అక్కినేని నాగార్జునతో వర్క్ చేసే అవకాశం దక్కించుకున్నాడు రాహుల్. అయితే వీరి కలయికలో వచ్చిన 'మన్మథుడు 2' మూవీ డిజాస్టర్ గా నిలిచింది. అంతేకాదు దర్శకుడు ఎన్నో ట్రోల్స్ ఎదుర్కోవాల్సి వచ్చింది. అప్పటి నుంచి మరో చిత్రాన్ని డైరెక్ట్ చేయని హీరో.. ఎప్పటిలాగే నటుడిగా బిజీ అయిపోయాడు. అయితే మళ్ళీ ఛాన్స్ వస్తే మరోసారి సత్తా చాటాలని గట్టిగా ట్రై చేస్తున్నాడు.

ఈ నేపథ్యంలో రాహుల్ రవీంద్రన్ ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో సినిమా చేసే అవకాశం దక్కించుకున్నాడని సమాచారం. రాహుల్ చెప్పిన లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ నచ్చడంతో.. స్టార్ క్యాస్టింగ్ తో చేయడానికి ముందుకు వచ్చారట. దీని కోసం రష్మిక మందన్నా ని సంప్రదించినట్లుగా ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు అగ్ర కథానాయిక సమంత రూత్ ప్రభుతో చేసే ఆలోచన చేస్తున్నాడని టాక్ నడుస్తోంది.

విడాకుల ప్రకటన తర్వాత సమంత బ్యాక్ టూ బ్యాక్ ఫీమేల్ సెంట్రిక్ సినిమాలకు సైన్ చేస్తూ వచ్చింది. ఆమె లీడ్ రోల్ లో నటించిన 'యశోద' మూవీ ఇటీవ‌లే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ క్రమంలో గుణ శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో 'శాకుంత‌లం' అనే పౌరాణిక సినిమాతో పలకరించబోతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే విడుద‌ల కాబోతోంది. దీంతో పాటుగా మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ సామ్ చేతిలో ఉన్నాయి.

అయితే ఇప్పుడు రాహుల్ రవీంద్రన్ తన లేడీ ఓరియెంటెడ్ క‌థను స‌మంతకు చెప్పాలని అనుకుంటున్నట్లుగా ఇండ‌స్ట్రీ వర్గాల్లో టాక్‌ నడుస్తోంది. వీరిద్దరికీ మంచి సాన్నిహిత్యం ఉంది. రాహుల్ భార్య చిన్మ‌యి కూడా సామ్ కు మంచి ఫ్రెండ్. వీరంతా ఒక ఫ్యామిలీగా మెలుగుతుంటారు. 'చి.ల.సౌ' సినిమా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో రిలీజ్ అవ్వడం వెనుక సమంత ఉంది. రాహుల్ తో కలిసి 'యూ టర్న్' అనే సినిమా కూడా చేసింది.

'మన్మధుడు 2' సినిమాలోనూ సామ్ స్పెషల్ అప్పీయరెన్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. వీరి మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఉంది కాబట్టి.. రాహుల్ రవీంద్రన్ తో సినిమా చేయడానికి స్టార్ హీరోయిన్ రెడీగా ఉండే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. కాకపోతే సమంత ప్రస్తుతం అనారోగ్యంతో బాధ పడుతోంది. ఇప్పటికే కమిటైన సినిమాలు పూర్తి చేయాల్సి ఉంది. తిరిగి ఎప్పుడు సెట్స్ లో అడుగుపెడుతుందనే విషయంలో స్పష్టత లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రాహుల్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో లేదో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.