Begin typing your search above and press return to search.

రిలీజైన ఏడాదిన్న‌ర‌కు ఇంత హ‌డావుడా?

By:  Tupaki Desk   |   4 July 2020 4:30 AM GMT
రిలీజైన ఏడాదిన్న‌ర‌కు ఇంత హ‌డావుడా?
X
ఎప‌్పుడో 2019 క్రిస్మ‌స్ కానుక‌గా రిలీజైంది కేజీఎఫ్ చాప్ట‌ర్-1. ఎంత పెద్ద సినిమా అయినా రెండు మూడు వారాల‌కు థియేట‌ర్ల నుంచి వెళ్లిపోతున్న రోజుల్లో ఆ చిత్రం నెలా నెల‌న్న‌ర పాటు ఆడ‌టం విశేష‌మే. థియేట‌ర్ల‌లో వివిధ భాష‌ల వాళ్లు ఈ సినిమాను విర‌గ‌బ‌డి చూశారు. అది చాల‌ద‌న్న‌ట్లు విడుద‌లైన రెండు నెల‌ల‌కే ఆ చిత్రం అమేజాన్ ప్రైమ్‌లో కూడా రిలీజైంది. అక్క‌డా సినిమాను పెద్ద ఎత్తునే చూశారు. అలాంటిది ఇప్పుడు.. సినిమా రిలీజైన ఏడాదిన్న‌ర త‌ర్వాత టీవీలో ప్రిమియ‌ర్ అంటూ పెద్ద హ‌డావుడే చేస్తున్నారు. ఈ ఆదివారం కేజీఎఫ్ చాప్ట‌ర్ 1 తెలుగు వెర్ష‌న్ స్టార్ మాలో ప్ర‌సారం కాబోతోంది.

ఈ సంద‌ర్భంగా హీరో య‌శ్, ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ప్ర‌త్యేకంగా వీడియో బైట్లు ఇవ్వ‌డం.. వాటిని సినిమా మ‌ధ్య‌లో అడ్వ‌ర్టైజ్మెంట్ బ్రేక్స్‌లో ప్ర‌సారం చేయ‌బోతుండ‌టం విశేషం. ఈ రోజుల్లో సినిమాలు రిలీజైన రెండు మూడు నెల‌ల‌కే టీవీల్లో కూడా ప్రిమియ‌ర్లు ప‌డిపోతున్నాయి. అలాంట‌పుడు కొత్త సినిమా అంటూ హ‌డావుడి చేస్తే బాగుంటుంది. కానీ సినిమా రిలీజైన ఏడాదిన్న‌ర‌కు ప్రిమియ‌ర్లంటూ ఓ రేంజిలో ప్ర‌చారం చేస్తుండ‌టం ఆశ్చ‌ర్యం క‌లిగించే విష‌య‌మే. ఇప్ప‌టికే సినిమా ప్రియులంద‌రూ కేజీఎఫ్ చూసేశారు. ప్రైంలో ఎప్ప‌ట్నుంచో సినిమా అందుబాటులో ఉంది. ఈ నేప‌థ్యంలో కేజీఎఫ్‌కు టీవీలో ఏమాత్రం రేటింగ్స్ వ‌స్తాయో చూడాలి.